Begin typing your search above and press return to search.

రాజీనామాలు చేసినా అతీ గతీ లేని వైసీపీ ఎమ్మెల్సీలు !

ఏపీలో వింత విచిత్రమైన రాజకీయం సాగుతోంది. నిజానికి ఈ రాజకీయాల వెనక తగిన వ్యూహాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి.

By:  Tupaki Desk   |   7 March 2025 7:00 PM IST
రాజీనామాలు చేసినా అతీ గతీ లేని వైసీపీ ఎమ్మెల్సీలు !
X

ఏపీలో వింత విచిత్రమైన రాజకీయం సాగుతోంది. నిజానికి ఈ రాజకీయాల వెనక తగిన వ్యూహాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి. దాంతో మాకొద్దీ పదవి అని కొందరు ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి వేరుపడి రాజీనామాలు ఇచ్చినా వాటికి ఈ రోజుకీ అతీ గతీ లేదని అంటున్నారు. వైసీపీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే వరసగా కొందరు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. ఈ ప్రక్రియ ఆగస్టు నెల నుంచి మొదలైంది.

ప్రకాశం జిల్లాకు చెందిన పోతుల సునీత, తిరుపతి జిల్లకు చెందిన బల్లి కళ్యాణ చక్రవర్తి. గోదావరి జిల్లాకు చెందిన కర్రి పద్మశ్రీ వంటి వారు రాజీనామా చేశారు. ఈ రాజీనాలు అన్నీ జరిగి ఆరు నెలలు అయింది అని అంటున్నారు. వీరంతా శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషెన్ రాజుని స్వయంగా కలసి రాజీనామా పత్రాలను ఇచ్చారు.

తాము ఎవరి ఒత్తిడికి లొంగి రాజీనామాలు చేయడం లేదని స్పష్టం చేశారు. తమ రాజీనామాలను ఆమోదించాలని వారు కోరారు. అయితే వారి రాజీనామాలను ఆమోదించాల్సింది చైర్మన్. ఆయన వైసీపీ వారు కావడంతో లేట్ అవుతోందని అంటున్నారు. ఈ రాజీనామాలను ఆమోదిస్తే వీరంతా కూటమిలోని పార్టీలలో చేరాలని చూస్తున్నారని అంటున్నారు.

మరో వైపు ఈ ఖాళీల నుంచి తమను నిలబెట్టాలని వీరు కోరినా కూటమి పార్టీలు ఏమి చేస్తాయో తెలియదు. ఏది ఏమైనా ఈ ఖాళీలు అయితే కూటమికి లాభంగానే ఉంటాయి. అందుకే ఈ విధగ్నా కొందరిని కూటమి పెద్దలు ప్రోస్తహించారు అని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంలో వైసీపీ కూడా తనదైన శైలిలో కొత్త ఎత్తులు వేస్తోంది.

ఏ సభ్యుడు రాజీనామా చేసినా చైర్మన్ ఆమోదించాలి. దానిని నిర్దిష్ట కాలపరిమితి లేదు. అది చైర్మన్ విచక్షణ మీదనే ఆధారపడి ఉంటుంది. మరో వైపు చూస్తే కనుక వైసీపీకి ఎన్నికల్లో ఓటమి తరువాత 38 మంది ఎమ్మెల్సీల బలం ఉంటే నలుగురి రాజీనామాలతో అది కాస్తా 34కి పడిపోయింది. వీరి రాజీనామాలు ఆమోదిస్తే కనుక మిగిలిన వారు కూడా క్యూలోకి వచ్చేవారు. అలా మండలిలో టీడీపీ కూటమి బలం పెరుగుతుందని లెక్క వేసుకునే ఇదంతా చేశారని అంటున్నారు.

అయితే అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని సభకు హాజరు కాని వైసీపీకి మండలి అతి పెద్ద వేదికగా ఉంది. అక్కడే కూటమి ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతోంది. చెప్పాలంటే అక్కడే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కూటమిని వైసీపీ తనకు ఉన్న ఆధిక్యతతో నిలదీస్తోంది.

చైర్మన్ సైతం వైసీపీకి చెందిన వారు కావడంతో ఆయన వైసీపీకి మైకు బాగానే ఇస్తున్నారు. దాంతో కూటమి మండలిలో ఇరుకునపడుతోంది. ఈ నేపధ్యంలో వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలను ఆమోదిస్తే అత్యధిక శాతం కూటమి వైపు పోతారు. అపుడు మండలిలో వైసీపీకి మెజారిటీ ఉండదు, అలా చైర్మన్ పోస్టు కూడా టీడీపీ కూటమికి వెళ్తుంది. ఇవన్నీ ఆలోచించిన మీదటనే వైసీపీ ఈ కొత్త ఎత్తు వేసింది అని అంటున్నారు.

దాంతో ఎపుడో వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసినా అక్కడ ఖాళీలు ఏర్పడలేదు. దాంతో కూటమి ఆశలు తీరలేదు. ప్రస్తుతం అయిదుగురు ఎమ్మెల్సీల పదవీ విరమణ జరిగినా అవన్నీ టీడీపీ వారి పదవులే కావడం విశేషం. దాంతో మండలిలో వైసీపీ బలం అలాగే ఉంది. మొత్తానికి చూస్తే ఇదే పరిస్థితి 2027 దాకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అంతవరకూ మండలిలో వైసీపీ బలం అలాగే ఉంటుందని అంటున్నారు.