Begin typing your search above and press return to search.

రాజకీయ నిరుద్యోగం పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!

ఏపీలో రాజకీయ నిరుద్యోగాన్ని తగ్గించేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

By:  Tupaki Desk   |   5 Feb 2025 12:12 PM GMT
రాజకీయ నిరుద్యోగం పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
X

ఏపీలో రాజకీయ నిరుద్యోగాన్ని తగ్గించేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ పార్టీ క్యాడరుకు గుర్తింపు, గౌరవం కల్పిస్తున్న ప్రభుత్వం.. వచ్చే మున్సిపల్ ఎన్నికల నాటికి మరిన్ని కౌన్సిల్, కార్పొరేటర్ పదవులను సృష్టించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల క్షేత్రస్థాయిలో పదవుల కొట్లాటను తగ్గించొచ్చని భావిస్తోంది.

రాష్ట్రంలో మరో ఏడాదిలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. వీటికి ఎన్నికలు జరిగి నాలుగేళ్లు అవుతోంది. ప్రస్తుతం ఖాళీలు ఉన్న స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించింది ప్రభుత్వం. ఈ సందర్భంలోనే వచ్చే ఎన్నికల నాటికి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన చేపడదామని మున్సిపల్ మంత్రి నారాయణ ప్రకటించారు. నెల్లూరులో డిప్యూటీ మేయర్ గా టీడీపీ నేతను గెలిపించుకున్న అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి సూచన ప్రాయంగా వార్డుల విభజనపై ప్రకటన చేశారు.

మున్సిపాలిటీల్లో ఓటర్ల ప్రాతిపదికన వార్డులను విభజిస్తారు. అయితే ఈ వార్డుల విభజన ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కోలా ఉంటుంది. కొన్నిచోట్ల రెండు వేల ఓట్లకే ఒక వార్డు ఏర్పాటు చేస్తే మరి కొన్ని చోట్ల మూడు-నాలుగు వేలకు ఒక వార్డు ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానంలో వార్డుల విభజన ఉండాలనే ప్రతిపాదన పరిశీలిస్తోందని అంటున్నారు. ఒక్కోవార్డుకు కనిష్ట-గరిష్ట సంఖ్యను పరిమితిగా నిర్ణయించి వార్డులను విభజించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. దీనివల్ల గ్రేడ్ వన్, స్పెషల్ క్లాస్ మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందంటున్నారు.

మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య పెరిగితే రాజకీయంగా తమకు మేలు జరుగుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారికి ఎక్కువ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా కూటమి సర్దుబాటు వల్ల అన్ని పార్టీలకు తగిన అవకాశాలు దక్కుతాయని ఆశిస్తున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నందున వార్డుల విభజన ప్రక్రియ ఎప్పుడు మొదలు పెడతారన్న విషయమై ఇంకా విధాన నిర్ణయం తీసుకోవాల్సివుందని చెబుతున్నారు.