Begin typing your search above and press return to search.

బుద్ధా - వంగ‌వీటి - జ‌లీల్ - వ‌ర్మ‌.. వీరంతా టీడీపీలో కొత్త బాధితులేనా..!

అయితే ఇప్పుడు వీరి ఆశ‌లు అడియాస‌లు అయ్యేలా క‌న‌ప‌డుతున్నాయి. అస‌లు వీరి బాధ‌లు ఎలా ఉన్నాయో ఆ క‌థ ఏంటో చూద్దాం.

By:  Tupaki Desk   |   4 Dec 2024 3:54 AM GMT
బుద్ధా - వంగ‌వీటి - జ‌లీల్ - వ‌ర్మ‌.. వీరంతా టీడీపీలో కొత్త బాధితులేనా..!
X

టీడీపీలో ఉండి.. ఆ పార్టీ త‌ర‌ఫున అంతో ఇంతో ప్ర‌జ‌ల‌ను ప్ర‌బావితం చేసిన వారికి, క‌ష్ట‌ప‌డిన వారికి .. సీట్లు వ‌దులుకుని మ‌రీ త్యాగాలు చేసిన నేత‌ల‌కు ప‌ద‌వులు ఇస్తామ‌న్న చంద్ర‌బాబుపై ఆ నేత‌లు బాగా ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రీ ముఖ్యంగా విజ‌య‌వాడ‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా, మ‌రో మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌తో పాటు పిఠాపురంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం సీటు వ‌దులుకున్న‌ వ‌ర్మ‌లు భారీగానే ఆశ‌లు పెట్టుకున్నారు. ఏదో ఒక ప‌ద‌వి ద‌క్క‌క పోతుందా ? అని ఎదురు చూశారు. అయితే ఇప్పుడు వీరి ఆశ‌లు అడియాస‌లు అయ్యేలా క‌న‌ప‌డుతున్నాయి. అస‌లు వీరి బాధ‌లు ఎలా ఉన్నాయో ఆ క‌థ ఏంటో చూద్దాం.

గ‌త ఎన్నిక‌ల్లో త్యాగాలు చేసి.. సీట్లు వ‌దులుకున్న వారెవ్వ‌రికి ఇప్ప‌టివ‌ర‌కు ఛాన్స్ ద‌క్క‌లేదు. వీరిలో వ‌ర్మ‌, బుద్ధాల‌కు మ‌రో బాధ కూడా వెంటాడుతోంది. వారు అస‌లు ప్ర‌జ‌ల్లోకి కూడా రాలేక పోతున్నారు.

ఎన్నిక‌ల‌కు ముందు బుద్ధా.. త‌న‌కు అన‌కాప‌ల్లి ఎంపీ సీటు వ‌స్తుంద‌ని.. విజ‌య‌వాడ వెస్ట్ ఇస్తున్నార‌ని తెగ ప్ర‌చారం చేసుకున్నారు. కానీ, ఆయ‌న‌కు సీటు రాలేదు. క‌నీసం ఆయ‌న పేరు కూడా ఎక్క‌డా వినిపించ లేదు. దీంతో చంద్ర‌బాబుకు ర‌క్తాభిషేకం అంటూ..కొత్త పంథాకు తెర‌దీశారు. త‌న‌లాంటి వాడు పార్టీకి ఉండ‌ర‌ని కూడా చెప్పుకొచ్చారు. అనేక రూపాల్లో త‌న మ‌న‌సులో మాట‌ను చెప్పుకొచ్చారు. కానీ, చివ‌ర‌కు ఏమీ ద‌క్క‌లేదు.

ఇక‌, వ‌ర్మ విష‌యం అంద‌రికీ తెలిసిందే. పిఠాపురంలో ఆయ‌న పోటీ త‌థ్య‌మ‌ని అనుకున్న క్ష‌ణంలో చంద్ర‌బాబు అనూహ్యంగా ప‌వ‌న్‌కు ఇచ్చేశా రు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు మంత్రి పీఠంపై ఆశ‌లు చూపించారు. ఎమ్మెల్సీని చేసి మ‌రీ త‌న కేబినెట్లో మంత్రిని చేస్తాన‌ని ప్రామీస్ చేశారు. కానీ,ఆరు మాసాలైనా ఆయ‌న‌ను కూడా ప‌ట్టించుకోలేదు. పైకి వీరిద్ద‌రూ విధేయ‌త చూపిస్తున్నా.. మ‌న‌సులో మాత్రం ర‌గిలిపోతున్నారు. పార్టీలో ఉండి తాము ఏం సాధించామ‌న్న‌దివారు త‌మ అనుచ‌రుల ద‌గ్గ‌ర బాహాటంగానే చెబుతున్నారు.

ఇక విజ‌య‌వాడ‌కు చెందిన వంగ‌వీటి రాధా బాధ కూడా ఇలానే ఉంది. ఆయ‌న‌కు రాజ్య‌స‌భ ఇస్తార‌ని కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, ఇప్పుడు అస‌లు ఆ ఊసు కూడా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు, మైనారిటీ నాయ‌కుడు జ‌లీల్ ఖాన్ ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. దేవినేని ఉమా వంటివారు కూడా ఈ ఆవేద‌న‌తో ఉన్నా.. ఆయ‌న‌కు కూడా.. రాజ్య‌స‌భ ఇస్తార‌ని ప్ర‌చారంలో ఉంది. కానీ, ఇప్పుడు అన్ని ఈక్వేష‌న్లు మారుతున్నాయి.

పార్టీలో అస‌లే క‌మ్మ నేత‌లు ఎక్కువుగా ఉన్నారు. ఇంత గ‌ట్టి పోటీలో క‌మ్మ నేత ఉమాకు రాజ్య‌స‌భ‌ ప‌ద‌వి వ‌స్తుందా ? అన్న డౌట్ ఆయ‌న‌కే ఉంది. ఎవ‌రికి ఈ పెద్ద‌ల స‌భ యోగం ప‌డుతుందో తెలియ‌దు. పోనీ.. నామినేటెడ్ అయినా.. చిక్కుతుందా? అంటే.. కీల‌క నామినేటెడ్ ప‌ద‌వులు అయిపోయాయి. దీంతో ఇప్పుడు వీరి ప‌రిస్థితి.. నామినేటెడ్ బాధితులుగా మార‌నుంద‌న్న చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.