ఏపీ రాజకీయాలు ఎటు పోతున్నాయ్..!
వికృత చేష్టలు, పదాలు, నోటికి వచ్చిన మాటలతో విరుచుకుపడే వారే నాయకులు అనిపించుకుంటారన్న భావన వ్యక్తమవుతోంది.
By: Tupaki Desk | 26 Oct 2024 12:30 PM GMTమాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు అని సినిమా పాట చాలా పాపులర్ అయింది. అలానే ఇప్పు డు ఏపీలోనూ సగటు రాజకీయ నాయకుడు కనిపించడం లేదు. వికృత చేష్టలు, పదాలు, నోటికి వచ్చిన మాటలతో విరుచుకుపడే వారే నాయకులు అనిపించుకుంటారన్న భావన వ్యక్తమవుతోంది. ఒకప్పుడు .. ఉమ్మడి రాష్ట్రంలో పుచల్లపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, ప్రకాశం పంతులు, అయ్యదేవర కాళేశ్వరరావు... వంటి వారు రాజకీయాలు చేశారు.
రాజకీయాలకు వన్నె తీసుకువచ్చారు. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి వెళ్లిన.. భోగరాజు పట్టాభిరామయ్య వంటివారు ఏపీ రాజకీయాలకు గౌరవాన్ని తీసుకువచ్చారు. ఆ గౌరవాన్ని దశ దిశలా వ్యాప్తి కూడా చేశారు. కానీ, ఇప్పుడు రాజకీయాలు మరీ దిగజారాయి. ముఖ్యమంత్రి స్థాయిని సైతం దిగజార్చే పరిస్థితి ఏర్పడిం ది. మంత్రులు కూడా అలానే తయారయ్యారు. కీలక పదవిలో ఉన్న కూటమి మంత్రుల నుంచి వైసీపీ నాయకుల వరకు కూడా.. నోరు చేసుకుంటున్న పరిస్థితి సభ్య సమాజం సిగ్గుపడేలా చేస్తోంది.
గతంలోనే సీఎంగా ఉన్నప్పటి నుంచి జగన్‌ను టీడీపీ నాయకులు సైకో అనడం తెలిసిందే. అంతేకాదు.. అనేక వ్యాఖ్యలు కూడా చేశారు. అప్పట్లో కొందరు సంతోషించారు. టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను పదే పదే మీడియాలోనూ ప్రచారం చేసుకున్నారు. కానీ, ఇప్పుడు అది రివర్స్ అయింది. సీఎం చంద్రబా బుకు తాజాగా వైసీపీ `శాడిస్ట్ సీఎం` అనే ట్యాగ్ జోడించింది. దీనిపై టీడీపీ నాయకులు నిప్పులు చెరుగు తున్నారు.
నిజమే ఆవేదన ఉంటుంది. కానీ, రాజకీయాలు అలా మారాయి. ఎవరూ ఎవరినీ సమర్థించలేరు.. తప్పుబ ట్టనూ లేని పరిస్థితికి పరిస్థితి దిగజారిపోయింది. ఆడు-ఈడు.. అనుకునే స్థాయి మరింత దిగజారిపోతోంది. ఇప్పుడు చంద్రబాబును శాడిస్టు అంటే.. టీడీపీ నాయకులు జగన్ అంతకుమించి అనేందుకు సిద్ధమ వుతున్నారు. జగన్‌ను హంతకుడితో పోల్చేశారు సీమకు చెందిన మంత్రి. చంద్రబాబును ఖూనీకోరుగా అభివర్ణించారు వైసీపీ మాజీ మంత్రి. ఈ పరిణామాలను చూస్తే.. భావితరం రాజకీయ నేతలకు ఏం చెబుతున్నారు? అనేది ప్రశ్న.
కొసమెరుపు ఏంటంటే..
నరసాపురం నియోజకవర్గంలో ఒకప్పుడు కనుమూరి బాపిరాజు, నటుడు కృష్ణంరాజు హోరా హోరీ తలపడి ఎన్నికల్లో పోటీ చేశారు. కృష్ణం రాజు గెలిచారు. మరుసటి రోజు.. దండ పట్టుకుని కృష్ణం రాజు ఇంటికి బాపిరాజు వెళ్లి అభినందించారు. ఇదీ.. అప్పటి రాజకీయం. కానీ, నేడు మరీ దిగజారిపోతోంది. ఇది ఎవరికీ మంచిది కాదు!!