టీడీపీకి కొత్త రెక్కలు... ఈ కొత్త స్టోరీ ఇదే...!
కూటమి పార్టీల్లో కీలకమైన టీడీపీలో కొత్త నేతల జోరు.. హుషారు పెరుగుతోంది.
By: Tupaki Desk | 19 Oct 2024 4:11 AM GMTకూటమి పార్టీల్లో కీలకమైన టీడీపీలో కొత్త నేతల జోరు.. హుషారు పెరుగుతోంది. కొత్తగా అనేకమంది నాయ కులకు చంద్రబాబు మంత్రి వర్గంలో చోటు కల్పించారు. వీరంతా దూకుడుగా ఉన్నారు. ఎవరూ ఎవరినీ తీసిపోని విధంగా దూసుకుపోతున్నారు. ప్రతి ఒక్కరూ కసితోనే పనిచేస్తున్నారు. ఈ విషయంలో సందేహం లేదు. అయితే.. ఉన్నదల్లా చంద్రబాబు చెబుతున్నట్టు పనిచేస్తున్నారా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. కొందరు సొంత అజెండాల ప్రకారం ముందుకు సాగుతున్నారు.
మరికొందరు కార్యకర్తలను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో చంద్రబాబు గీసిన రేఖల ను వారు పట్టించుకోవడం లేదు. ``సార్.. మా ఏరియాలో సమస్యలు ఉన్నాయి. పట్టించుకుని పరిష్కరిం చండి`` అని ఒకప్పుడు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేలను మంత్రులను అడిగే వారు. దీనిపై ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టేవారు. కానీ, మారిన కాల మాన పరిస్థితుల్లో ప్రజల సమస్యలు పోయి.. వ్యక్తిగత సమస్యలు తెరమీదికి వస్తున్నాయి. దీనిని ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కాదనలేకపోతున్నారు.
ఉదాహరణకు.. విజయవాడ తూర్పులో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సౌమ్యుడిగా గుర్తింపు పొందారు. ఆయన ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. కానీ.. ఇప్పుడు వరుసగాఒకే నియోజకవర్గంలో మూడోసారి విజ యం దక్కించుకున్న ఆయన ఇప్పుడు కార్యకర్తలతో కటువుగా మాట్లాడలేక పోతున్నారు. దీంతో కార్యకర్త ల దూకుడు పెరిగింది. ఇక, మంత్రి మండపల్లి రాంప్రసాద్‌రెడ్డి నియోజకవర్గంలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. ఈయన తొలిసారివిజయం దక్కించుకున్నారు.
అలానే, ధర్మవరం నుంచి తొలిసారి విజయం సాధించిన బీజేపీ నాయకుడు, మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు కొన్ని విషయాలు అసలు తెలియకుండానే జరిగిపోతున్నాయి. ఆయన ప్రమేయం కూడా లేకుండానే ఇటీవల కూటమి పార్టీల నాయకులు రెచ్చిపోయి.. వైసీపీనాయకుడు బాల్‌రెడ్డి మద్యం దుకాణాన్ని ధ్వంసం చేశారు. దీనికి కారణం.. సెటిల్‌మెంటు కుదరకపోవడమే. అదేవిధంగా అనంతపురంలో ఒకే నాయకుడు.. జిల్లా వ్యాప్తంగా హవా చలాయించేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదన వినిపిస్తూనే ఉంది. మొత్తానికి దీనివల్ల కొత్త నేతల దూకుడు పెరిగి.. పార్టీ పటిష్టతకు ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.