బీద...మోపిదేవి ప్లేస్ లో రాజ్యసభకు గల్లా...నాగబాబు ?
వైసీపీ నుంచి నెగ్గిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు తమ పదవులు వదులుకున్నారు. వారే మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు.
By: Tupaki Desk | 29 Aug 2024 11:30 PM GMTవైసీపీ నుంచి నెగ్గిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు తమ పదవులు వదులుకున్నారు. వారే మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు. ఈ ఇద్దరూ గురువారం తమ పదవులకు రాజీనామా చేస్తూ రాజ్యసభ చైర్మన్ జగధీప్ ధన్ ఖర్ కి స్వయంగా సమర్పించారు. ఈ ఇద్దరూ తొందరలో టీడీపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది.
ఇక బీద మస్తాన్ రావు తొలి నుంచి టీడీపీ వారే. ఆయన మధ్యలో వైసీపీ లోకి వెళ్లారు. ఇపుడు ఆయన తన మాతృ సంస్థలోకే వచ్చారు. ఆయనకు తగిన న్యాయం చేస్తామని పార్టీ నుంచి హామీ లభించింది. దాంతో ఆయన స్థానం రాజ్యసభలో ఖాళీ అయినట్లే. 2028 జూన్ 21 వరకూ ఆయన పదవీ కాలం ఉంది. అంటే గట్టిగా నాలుగేళ్ళు అన్న మాట.
ఇక మోపిదేవి వెంకట రమణ తన ఎంపీ సభ్యత్వాన్ని వదులుకున్నారు. ఆయనకు టీడీపీ నుంచి ఎమ్మెల్సీ హామీ ఉందని ప్రచారం సాగుతోంది. అలాగే ఆయన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు బాధ్యతకు తగిన గ్యారంటీ దక్కింది అని అంటున్నారు. మోపిదేవి రాజ్యసభ పదవీ కాలం జూన్ 21 2026 దాకా ఉంది. అంటే రెండేళ్ళ కాలపరిమితి అన్న మాట.
ఈ రెండు పోస్టులు ఖాళీ అయినట్లుగా తొందరలోనే ప్రకటన రానుంది. అయితే ఈ రెండు రాజ్యసభ ఎంపీ పోస్టుల కోసం టీడీపీ కూటమిలోని ఆశావహులు చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే చంద్రబాబు చూపు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ మీద ఉంది అని అంటున్నారు. ఆయన గుంటూరు నుంచి లోక్ సభకు రెండు సార్లు ఎంపీగా నెగ్గారు. ఇటీవల ఎన్నికల కంటే ముందు పోటీ చేయకుండా తప్పుకున్నారు.
ఇపుడు కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి రావడంతో పాటు కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఉండడంతో గల్లా పార్లమెంట్ లో అడుగుపెట్టాలని చూస్తున్నారు. చంద్రబాబు కూడా ఆయనకు ఉన్న అనుభవాన్ని వాడుకోవాలని చూస్తున్నారు. దాంతో గల్లాకు కచ్చితంగా ఈ రెండింటిలో ఒక ఎంపీ సీటు కన్ఫర్మ్ అని అంటున్నారు.
మరో ఎంపీ సీటుని జనసేనకు ఇస్తారని అంటున్నారు. జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబుకు ఆ పోస్ట్ ఖరారు అయింది అని అంటున్నారు. నాగబాబుకు అలా పెద్దల సభలో అవకాశం దక్కుతుందని అంటున్నారు. నాగబాబు 2019లో జనసేన తరఫున ఎంపీగా పోటీ చేసి భారీ ఓట్లను తెచ్చుకున్నారు. వైసీపీని తక్కువ మెజారిటీకే పరిమితం చేశారు.
ఇక నాగబాబు 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేయాలని చూశారు. కానీ కూటమిలోకి బీజేపీ రావడంతో ఆ సీటు సీఎం రమేష్ కి బీజేపీ కోటాలో ఇవ్వాల్సి రావడంతో మిత్ర ధర్మం ప్రకారం నాగబాబు తప్పుకున్నారు. దాంతో నాగబాబు ఆనాడు చేసిన త్యాగానికి ప్రతిఫలంగా రాజ్యసభ సీటు ఇస్తామని కూటమి పెద్దలు ప్రామిస్ చేశారు అని ప్రచారం సాగింది.
ఇపుడు ఆ శుభ ఘడియలు వచ్చాయని అంటున్నారు. దాంతో నాగబాబు తొందరలోనే ఎంపీ అవుతారు అని ప్రచారం ఊపందుకుంది. మరో వైపు చూస్తే కేంద్ర మంత్రివర్గంలో జనసేన కోటా కింద ఒక కేంద్ర మంత్రి పదవి బెర్త్ అట్టేబెట్టి ఉంచారు అని అంటున్నారు. నాగబాబు ఎంపీ కాగానే ఆయనకు కేంద్ర పదవి దక్కడం సైతం ఖాయమని అంటున్నారు.
ఆ విధంగా ఆలోచనలు చేయడం వల్లనే టీటీడీ చైర్మన్ పోస్ట్ కానీ ఎఫ్డీసీ చైర్మన్ పోస్ట్ కానీ నాగబాబుకి వద్దు అని జనసేన హై కమాండ్ ఒక నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఏపీలో కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా ఉంటే కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా నాగబాబు ఉంటారన్న మాట. ఒకే టైం లో అన్నదమ్ములు ఇద్దరూ కీలక పదవుల్లో ఉండడం అంటే అది రాజకీయ విశేషమే. ఇంతకీ రెండేళ్ల ఎంపీ పోస్ట్ ఎవరికీ నాలుగేళ్ల ఎంపీ పోస్ట్ ఎవరికీ అన్నదే తేలాల్సి ఉంది.