Begin typing your search above and press return to search.

ఆంధ్రుల సెంటిమెంట్ ప్రత్యేక హోదా నోటి మాటనా ?

అయితే ప్రత్యేక హోదా విషయంలో 2014 నుంచి కేంద్రం ఏమేమి చెప్పింది అన్నది అయిదు కోట్ల ఆంధ్రులతో పాటు దేశమంతా చూసారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   28 Nov 2024 7:08 AM GMT
ఆంధ్రుల సెంటిమెంట్  ప్రత్యేక  హోదా నోటి మాటనా ?
X

నోటి మాట అంటే తేలికగా ఎవరైనా తీసుకుంటారు. ఇది కలియుగం. కాగితాలకు ఉన్న విలువ ప్రాణం ఉన్న మనిషి చెబితే ఉండదు. ఇపుడు ఏపీకి ప్రత్యేక హోదా విషయం కూడా కేవలం నోటి మాట అని కేంద్రం అంటోంది.

ఆ విషయాన్ని కేంద్రం హైకోర్టుకు తెలియచేసింది. ఏపీకి ప్రత్యేక హోదా అన్న హామీని కేవలం మౌఖికంగా మాత్రమే ఇచ్చామని రాతపూర్వకంగా ఇవ్వలేదని కేంద్రం హైకోర్టుకు నివేదించడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మాటలు గత పదేళ్ళుగా నేరవేరలేదు. అవి నీటి మూటలు అయ్యాయని అంతా అనుకుంటున్నదే. దీని మీద విశాఖకు చెందిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. దానికి కేంద్రం తన స్పందనను తెలియచేస్తూ నోటి మాట అని చెప్పడం పట్ల హాట్ డిబేట్ అయితే సాగుతోంది.

అయితే ప్రత్యేక హోదా విషయంలో 2014 నుంచి కేంద్రం ఏమేమి చెప్పింది అన్నది అయిదు కోట్ల ఆంధ్రులతో పాటు దేశమంతా చూసారని అంటున్నారు. ఆనాడు ఉమ్మడి ఏపీ నుంచి ఏపీని విడగొట్టినపుడు రాజధాని కూడా లేదు. ఆర్ధికంగా నిధులు అందించే నగరాలు కూడా ఏపీకి లేవు. దాంతో పాటుగా 90 వేల కోట్ల రూపాయల రెవిన్యూ లోటుతో ఏపీ ఏర్పాటు అయింది.

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని నాటి యూపీఏ ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ రాజ్యసభ లో కీలక ప్రకటన చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అయిదేళ్ల పాటు ఇస్తామని ప్రధాని హోదాలో ఆయన అధికారికంగా దేశ అత్యున్నత చట్ట సభలొ చేసిన ప్రకటన అది.

ప్రధాని చేసిన ప్రకటన నోటి మాట ఎలా అవుతుంది అన్నది ఇపుడు అంతా ప్రశ్నిస్తున్న విషయం. ఇక ప్రధాని అయినా ముఖ్యమంత్రి అయినా ఒక ప్రకటన చేస్తే అది జీవోతో సమానం అన్నది కూడా అంతా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు చెప్పేది ఎపుడూ అధికారికంగానే ఉంటుంది. అలాగే రికార్డు అవుతుంది.

పైగా ప్రధాని చెప్పిన సందర్భం ఆయన ప్రసంగించిన సభ అన్నీ చూసుకుంటే కచ్చితంగా యూపీఏ ప్రభుత్వం నాడు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది ఇక ఎన్నికలు రావడం ప్రభుత్వాలు రావడం పోవడం అన్నది ప్రజాస్వామ్యంలో భాగం.

కేంద్ర ప్రభుత్వం అన్నది శాశ్వతం. ఒక ప్రధాని ఇచ్చిన హామీని మరో ప్రధాని ఎవరు వచ్చినా అమలు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. అలా చూసుకుంటే నిండు సభలో మన్మోహన్ ప్రధాని హోదాలో చేసిన ప్రకటన నోటి మాట ఎలా అవుతుంది అని అంతా ప్రశ్నిస్తున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే గతంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోవడానికి కారణం 14వ ఆర్ధిక సంఘం సిఫార్సులు అడ్డంకిగా మారడం అని కేంద్రం చెప్పింది. ఇపుడు చూస్తే హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో మౌఖికంగా చెప్పామని తప్పించి ప్రత్యేక హోదా రాతపూర్వక హామీ కాదని అంటున్నారు

దీనిని అంతా ఆసక్తిగానే చూస్తున్నారు. ఒక దేశ ప్రధాని పార్లమెంట్ లో చేసిన ప్రకటనకు విలువ లేదా అని కూడా మేధావులూ ప్రజాస్వామ్య ప్రియులు ప్రశ్నిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కేంద్రం ఇచ్చి తీరాల్సిందే అని మరోసారి డిమాండ్ వస్తోంది. ఇది సున్నితమైన అంశమని భావోద్వేగాలకు సంబంధించిన వ్యవహారం అని అంటున్నారు. ఏపీ మళ్లీ పునర్ నిర్మాణం కావాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని అంతా అంటున్నారు. ప్రభుత్వం చేసినా ప్రధాని చేసిన అవి మౌఖికంగానే అయినా కూడా అధికారికమే అవుతాయి తప్ప అందులో వేరే విధంగా ఉండదని కూడా నిపుణులు అంటున్నారు