జమిలి టీడీపీ ఫిలాసఫీ కాదు !
జమిలి ఎన్నికలు కాకుండా రాష్ట్రాలు తమ రాజకీయ ఆకాంక్షలు ప్రాంతీయ అవసరాలకు తగినట్లుగా విడిగానే ఎన్నికల్లో పాల్గొనే విధానం ఉండాలన్నది మేధావుల మాట.
By: Tupaki Desk | 28 Nov 2024 2:30 AM GMTతెలుగుదేశం పార్టీ పెట్టినపుడు దివంగత నటుడు ఎన్టీఆర్ ఒక నినాదం అందుకున్నారు. అది తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదం. ఆ తరువాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కేంద్రం పెత్తనాన్ని రాష్ట్రాల మీద రుద్దడం మీద కూడా తీవ్ర స్థాయిలో విభేదించారు. ఆయన కేంద్రం మీద గట్టిగా పోరాటం చేశారు. రాష్ట్రాలు నిజం అన్నారు, కేంద్రం మిథ్య అని కూడా అన్నారు. రాష్ట్రాలు అన్నీ కలిపితే కేంద్రం అన్న ఫెడరల్ సిద్ధాంతాన్ని ఎన్టీఆర్ వినిపించారు.
ఈ విషయంలో ఆయన ఒక్కరే పోరాటం చేయలేదు. దేశంలోని చాలా పార్టీలను కూడగట్టారు. కాశ్మీర్ లో అప్పట్లో ఫరూఖ్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని కూఅదోశారు. దాంతో ఆయనను కలుపుకున్నారు. అలాగే కర్ణాటకలోని జనతా పార్టీ నేత ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డేను, ఉత్తరాదిన ఇతర నేతలను కూడగట్టారు ఎన్టీఅర్. రాష్ట్రాలకే విలువ ఇవ్వాలని రాష్ట్రాల మీద కేంద్రం ఆధిపత్యం తగదని ఆయన గట్టిగానే చెప్పారు. సమాఖ్య స్పూర్తి ఉండాలని బలంగా కోరుకున్నారు. దాని ఫలితంగాగానే సర్కారియా కమిషన్ ఏర్పాటు అయింది.
అలా 80 దశకంలో ఏర్పాటు చేయబడిన సర్కారియా కమిషన్ భారతదేశంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను పరిశీలించేందుకు సిఫారులు చేసింది. అలగే కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ కేంద్రం రాష్ట్రాల మధ్య సహకారాన్ని మెరుగుపరిచేందుకు మార్గాలను కూడా సూచించింది.
ఇవన్నీ ఇలా ఉంటే ఎన్టీఆర్ సమాఖ్య స్పూర్తిని బలంగా నమ్మేవారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం అన్నది కూడా ఆయన ఏలుబడిలో టీడీపీ విధానంగా ఉండేది. అయితే ఇపుడు చూస్తే దేశంలో మళ్లీ కేంద్రీకృత విధానాలు అమలు అవుతున్నాయా అన్న చర్చ సాగుతోంది.
జమిలి ఎన్నికలు అందులో భాగమే అని అంటున్నారు. జమిలి ఎన్నికలు కనుక దేశంలో కనుక అమలు చేస్తే రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గుతుంది. అలాగే ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికి ముప్పు కలుగుతుంది. జాతీయ పార్టీలు ముందున ఉంటాయి. జాతీయ అంశాలే అజెండాగా ఉంటాయి.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో జమిలి ఎన్నికల బిల్లుని కేంద్రం ప్రవేశపెడుతుంది అని అంటున్నారు. దేశంలో 2027లో జమిలి ఎన్నికలను నిర్వహిస్తారు అని అంటున్నారు. జమిలి ఎన్నికల విషయంలో టీడీపీ ఆలోచనలు ఏమిటి అన్నవి చూడాల్సి ఉంది.
ఇటీవల చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ జమిలి ఎన్నికలు వచ్చినా ఏపీలో షెడ్యూల్ ప్రకారమే 2029లో ఎన్నికలు జరుగుతాయని అన్నారు. తాను పూర్తి కాలం ముఖ్యమంత్రిగా పనిచేస్తాను అన్నట్లుగా ఆయన చెప్పారు. అయితే జమిలి ఎన్నికల ముఖ్య ఉద్దేశ్యం అన్ని రాష్ట్రాలూ లోక్ సభతో కలిపి నిర్వహించాలని.
మరి ఆ విధంగా చూస్తే ఏపీలో వేరుగా ఎలా ఎన్నికలు పెడతారు అన్నది చూడాల్సి ఉంది. ఆ గొలుసు కట్టు నుంచి ఏపీ ఏ విధంగా వేరు చేయబడుతుంది అన్నది కూడా చూడాల్సి ఉంది. ఇంకో వైపు చూస్తే ఎన్డీయే కూటమిలో టీడీపీ ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల మీద నిర్ణయం తీసుకుంటే టీడీపీ కాదు అనే పరిస్థితి ఉంటుందా అన్నది కూడా చర్చగా ఉంది.
అయితే దేశంలో చాలా పార్టీలు ముఖ్యంగా విపక్షాలు జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడులో డీఎంకే జమిలి ఎన్నికలను వద్దు అనే అంటోంది. వామపక్షాలు అయితే జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ ముప్పు అని అంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో దేశంలో ప్రాంతీయ పార్టీలకు బలం చేకూరాలీ అన్నా ఎన్టీఆర్ ప్రవచించిన సమాఖ్య స్పూర్తిని కాపాడుకోవాలన్నా జమిలి ఎన్నికల విషయంలో టీడీపీ ఆలోచించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
జమిలి ఎన్నికలు కాకుండా రాష్ట్రాలు తమ రాజకీయ ఆకాంక్షలు ప్రాంతీయ అవసరాలకు తగినట్లుగా విడిగానే ఎన్నికల్లో పాల్గొనే విధానం ఉండాలన్నది మేధావుల మాట. ఈ విషయంలో టీడీపీ ఎంతవరకూ జమిలి మీద తన ఆలోచనలను ముందుకు తెస్తుంది చూడాల్సిన అవసరం ఉంది.