క్యాబినెట్ బెర్త్ కోసం ఎన్నో ప్రయత్నాలు.. రోజురోజుకు పెరుగుతున్న ఆశావాహులు
జనవరిలో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చనే ప్రచారంతో టీడీపీలో ఆశావాహుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది.
By: Tupaki Desk | 29 Dec 2024 2:30 PM GMTజనవరిలో మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చనే ప్రచారంతో టీడీపీలో ఆశావాహుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన కోసం జనవరిలో విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. అయితే నాగబాబుతో పాటు మరో ఇద్దరికి క్యాబినెట్ బెర్త్ లభించవచ్చుననే విశ్లేషణలతో ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
జనసేన నేత నాగబాబు పేరు ఫైనల్ అయింది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న ఏకైక ఖాళీని ఆయనతో భర్తీ చేసేస్తే.. ఇక ఎవరికీ ఇప్పట్లో మంత్రి యోగం పట్టే అవకాశం లేదు. కానీ, మంత్రివర్గం నుంచి ఇద్దరిని తప్పించి మరో ఇద్దరికి నాగబాబుతోపాటు మంత్రులుగా ప్రమాణం చేయిస్తారని గత కొద్ది రోజులుగా టీడీపీ వర్గాల్లో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. టీడీపీలో కోటాలో ఖాళీ అయ్యే రెండు స్థానాలకు టీడీపీ నుంచే భర్తీ చేసే చాన్స్ ఉంది. అయితే ఖాళీ అయ్యే స్థానాలు, కొత్తగా చాన్స్ కొట్టేసే నేతలపైనే సస్పెన్స్ కొనసాగుతోంది.
ఎవరిని తప్పించినా తమకు మాత్రం మంత్రి పదవి కావాలని టీడీపీలో కొద్ది మంది నేతలు పట్టుబడుతున్నారు. ఈ లిస్టులో శ్రీకాకుళం జిల్లా నుంచి కూన రవికుమార్, విజయనగరం నుంచి కిమిడి కళావెంకటరావు, విశాఖ నుంచి పల్లా శ్రీనివాసరావు, కడప నుంచి మాధవీరెడ్డి, అనంతపురం నుంచి పరిటాల సునీత తదితరులు మంత్రి పదవి కోసం సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు చెబుతున్నారు. వీరిలో గాజువాక ఎమ్మెల్యే, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేరు దాదాపు ఫైనల్ అయ్యిందంటున్నారు. మిగిలిన ఆ ఒక్కరు ఎవర్నదే టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన కూన రవికుమార్.. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా గత ఐదేళ్లు పనిచేసిన రవికుమార్ గత ప్రభుత్వంలో అణచివేతకు గురయ్యారని పార్టీ శ్రేణుల్లో సానుభూతి ఉంది. అదేవిధంగా ఆయన సామాజిక వర్గం కళింగ బీసీ వర్గానికి చెందినది. ప్రతి క్యాబినెట్ లోనూ ఈ సామాజికవర్గం నుంచి ఓ నేత మంత్రిగా ఉండేవారు. కానీ, ఈ సారి సామాజిక సమీకరణలతో కళింగ నేతకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆ వర్గం నుంచి టీడీపీపై విపరీతమైన ఒత్తిడి వస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కళింగ సామాజికవర్గం వెన్నుదన్నుగా నిలుస్తుండటంతో విస్తరణలోనైనా మంత్రి పదవి ఇవ్వాలని ఆ వర్గం నేతలు కోరుతున్నారు.
ఇక విజయనగరం జిల్లాకు చెందిన చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు సీనియర్ నేత. టీడీపీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చిన కళా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించారు. అయితే ఈ సారి ఆ జిల్లా నుంచి యువనేత కొండపల్లి శ్రీనివాస్ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. దీంతో కళా వెయిటింగ్లో ఉండిపోయారు. మలి విడత విస్తరణ జరిగితే కళాకు పదవి దక్కడం ఖాయమని చాలా కాలంగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో జిల్లా మంత్రి కొండపల్లి.. ప్రతిపక్ష నేత బొత్స దూకుడును అడ్డుకోలేకపోతున్నారని, జడ్పీ సమావేశాల్లో సైతం వైసీపీ నేతల మాటలే చెల్లుబాటు అవుతున్నాయని పార్టీలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కళాను మంత్రిని చేసి బొత్సను ఎదుర్కోవాలని టీడీపీ నేతలు డిమాండ్ వినిపిస్తున్నారు. గత ఎన్నికల్లో బొత్సను ఓడించిన కళా అయితే జిల్లాలో పార్టీ మరింత బలపడే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
అటు రాయలసీమ నుంచి రెడ్డి సామాజికవర్గానికి సముచిత ప్రాధాన్యం కల్పించాలంటే మహిళానేత మాధవీరెడ్డిని మంత్రిని చేయాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వస్తోంది. కడప ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన మాధవీరెడ్డి తన వాగ్ధాటితో పార్టీ శ్రేణులను ఆకట్టుకుంటున్నారు. పైగా, మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో ఆమె చూపుతున్న పోరాట స్ఫూర్తికి కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. ఓ సాధారణ ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి విరోచితంగా పోరాడుతున్నారని, ఆమెను మంత్రిని చేస్తే రాయలసీమలో పార్టీ మరింత దూసుకుపోవచ్చనని కూడా టీడీపీలో అంతర్గతంగా టాక్ నడుస్తోంది.
మంత్రివర్గాన్ని ఎప్పుడు విస్తరిస్తారో కానీ, ప్రస్తుతానికి అయితే చాలా మంది తమకు పదవులు ఇవ్వాలంటూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరిలో ఎవరికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులు దక్కుతాయో చూడాల్సివుంది.