Begin typing your search above and press return to search.

ఏపీ టీడీపీ అధ్యక్షుడి పోస్టుకే ఎసరు వస్తోందా ?

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా మూడు నెలల క్రితం విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ నియమితులయ్యారు.

By:  Tupaki Desk   |   15 Sep 2024 3:52 AM GMT
ఏపీ టీడీపీ అధ్యక్షుడి పోస్టుకే ఎసరు వస్తోందా ?
X

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా మూడు నెలల క్రితం విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయన ఇపుడు విశాఖ ఉక్కు ఉద్యమంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గాజువాకలోనే లోకేట్ అయి ఉంది.

దాంతో పల్లా మీద చాలా ఒత్తిడి ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడాల్సిన బాధ్యత టీడీపీదే అని కార్మికులు అంటున్నారు. ఎన్నికల ముందు టీడీపీ కూటమి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

కేంద్రంలో బీజీపీ ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది అంటే కేవలం టీడీపీ ఎంపీల వల్లనే అని ఉక్కు కార్మికసంఘాలు గుర్తు చేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ గండం నుంచి తప్పించే అవకాశం బాధ్యత రెండూ టీడీపీ మీదనే ఉన్నాయని కూడా గుర్తు చేస్తున్నారు.

మరో వైపు చూస్తే వైసీపీ వ్యూహాత్మకంగా విశాఖ టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా రాజీనామాలు సమర్పించాలని డిమాండ్ చేస్తోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నపుడు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీని కార్నర్ చేసారు.

దాంతో అప్పటి నుంచే వైసీపీ మీద ఉక్కు సెగ బాగా తగిలి చివరికి వైసీపీ కి విశాఖలో ఒక్క సీటు కూడా దక్కలేదు. దాంతో టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా వైసీపీ తెలివిగా రాజీనామాల అంశాన్ని తెర మీదకు తెస్తోంది.

దీంతో టీడీపీ టార్గెట్ అవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ టీడీపీ ప్రెసిడెంత్ పల్లా శ్రీనివాస్ అయితే ఉక్కు కార్మికుల ఉద్యమానికి మరోసారి సంఘీభావం తెలిపారు.అంతే కాదు తాము తప్పకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ని రక్షిస్తామని చెప్పారు

ఒకవేళ అలా చేయని పక్షంలో తన పదవులకు రాజీనామా చేసి ఉక్కు ఉద్యమకారులతో పాటు టెంట్ లో కూర్చుని దీక్ష చేస్తాను అని కూడా స్పష్టంగా ప్రకటించారు. అయితే పల్లా శ్రీనివాస్ అనుకున్నట్లుగా ఇది అంత ఈజీ వ్యవహారమా అనేది చర్చకు వస్తోంది.

కేంద్రంలోని బీజేపీ ఒక పాలసీగా తీసుకుని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థల విషయంలో తమ మాటే నెగ్గుతుంది తప్ప రాష్ట్రాలకు సంబంధం ఏంటి అన్నది కూడా వైఖరిగా ఉంది. పైగా ఒక డెసిషన్ ని మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న దాఖలాలు అయితే లేవు.

ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కి ముడి సరకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. గడచిన నాలుగేళ్లలో చాలా దూరం ప్రైవేటీకరణ వ్యవహారం వచ్చేసింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఏకంగా మద్దతు ఉపసంహరణ వంటి గట్టి నిర్ణయం కేంద్రం మీద తీసుకుంటేనే తప్ప ప్రైవేటీకరణ అన్నది ఆగేది కాదు అని అంటున్నారు. అది కనుక జరగకపోతే విశాఖ ఉక్కు ఉద్యమం కాస్తా పల్లా పదవికే ఎసరు పెడుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.