రేపే పోలింగ్.. పట్టభద్రుల నాడి ఎలా ఉంది?
ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు ముహూర్తం సిద్ధమైంది. తెలంగాణలో రెండు స్థానాలు, ఏపీలో రెండు పట్టభద్రుల స్థానాలకు పోలింగ్ జరగనుంది.
By: Tupaki Desk | 26 Feb 2025 10:39 AM GMTఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు ముహూర్తం సిద్ధమైంది. తెలంగాణలో రెండు స్థానాలు, ఏపీలో రెండు పట్టభద్రుల స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ రెండు స్థానాలు కూడా.. అధికార పార్టీ నా యకులకు పరీక్షగానే మారింది. ఏపీ విషయానికి వస్తే.. కూటమి తరఫున టీడీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ ప్రతిపక్షం వైసీపీ ఎన్నికలకు దూరంగా ఉంది. అయితే.. స్వతంత్రుల నుంచి బలమైన పోటీ ఎదుర్కొంటున్నారు.
ఇక, తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్, సహా ప్రతిపక్షం బీజేపీ నుంచి అభ్యర్థులు తలపడుతున్నారు. దీంతో పోటీ తీవ్రంగానే ఉంది. ఇక్కడ కూడా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ ఎన్నికల కు దూరంగా ఉంది. అయినప్పటికీ.. పోటీ మాత్రం భారీ స్థాయిలో కనిపిస్తోంది. పార్టీలు, అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉన్నా.. అసలు ఓటు వేసే సగటు పట్టభద్రుడి నాడి ఎలా ఉందన్నది ప్రశ్న.గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ ఎన్నికలు అటు ఏపీ ప్రభుత్వానికి, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా పరీక్షగానే మారాయి.
ఏపీలో పట్టభద్రుల విషయానికి వస్తే.. గ్రూప్-2 పరీక్షల వ్యవహారం.. సర్కారుకు ఇబ్బందిగా మారింది. ఈ పరీక్షలను వాయిదా వేయాలని.. దాదాపు అన్ని జిల్లాలలోనూ అభ్యర్థులు డిమాండ్ చేశారు. కానీ, సర్కారు పట్టించుకున్నట్టే పట్టించుకుని కాడి వదిలేసింది. దీంతో బలవంతంగానే గ్రూప్-2 పరీక్షలకు అభ్యర్థులు హాజరయ్యారు. ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక, డీఎస్సీ వాయిదా వ్యవహారం కూడా.. ఇబ్బందిగా మారుతోంది. ఈ రెండు అంశాలకు తోడు.. నిరుద్యోగ భృతి వ్యవహారం ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా వినిపించింది. సో.. ఈ మూడు సంకటాలు తప్పితే.. మిగిలిన పరిస్థితి ఓకే.
తెలంగాణ విషయానికి వస్తే.. పట్టభద్రులకు 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. రేవంత్ రెడ్డి చెబుతున్న మాట ఏమేరకు ఎక్కుతుందో చూడాలి. అదేసమయంలో రేవంత్ ఇమేజ్ కూడా.. పనిచేసే అవకాశం ఉంది. కానీ, బీజేపీ చేస్తున్న యాంటీ ప్రచారం.. లోపాయికారీగా బీఆర్ ఎస్ మద్దతు కొందరు ఇండిపెండెంట్లకు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం అయితే.. అంత ఈజీకాదన్నది పరిశీలకులు చెబుతున్న మాట. మరి ఏం చేస్తారో చూడాలి.