తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు.. కొత్త షెడ్యూల్ విడుదల
ఏపీ, తెలంగాణలో మళ్లీ ఎన్నికలకు తెరలేచింది. ప్రస్తుతం జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే ముహూర్తం ఖరారు కాగా.. మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరగనుంది.
By: Tupaki Desk | 24 Feb 2025 9:30 AM GMTఏపీ, తెలంగాణలో మళ్లీ ఎన్నికలకు తెరలేచింది. ప్రస్తుతం జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే ముహూర్తం ఖరారు కాగా.. మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఇక, ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడం గమనార్హం. దీని ప్రకారం.. ఏపీలో ఐదు స్థానాలకు, తెలంగాణలో ఐదు స్థానాలకు పోలింగ్ జరగనుంది.
దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 3న విడుదల కానుంది. అదే నెల 20న పోలింగ్ జరగనుంది. ఇక, కౌంటింగ్ కూడా అదే రోజు చేపడతారు. మొత్తం ఐదు కూడా ఎమ్మెల్యే కోటాలోవే కావడం గమనార్హం. వీరిని పూర్తిగా ఎమ్మెల్యేలే ఎన్నుకోనున్నారు. దీంతో వీటికి కూడా ప్రాధాన్యం ఏర్పడింది. ఏపీ విషయానికి వస్తే.. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన జంగా కృష్ణమూర్తి, ప్రస్తుతం టీడీపీ మండలి ఫ్లోర్ లీడర్‌గా ఉన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, మాజీ ఉద్యోగ సంఘం నేత, టీడీపీ సభ్యుడు పరుచూరి అశోక్‌బాబు రిటైర్ కానున్నారు.
అదే విధంగా తిరుమల నాయుడు, రామారావు కూడా.. రిటైర్ కానున్న నేపథ్యంలో ఏపీలో ఐదు స్థానాలకు ఎన్నికలు వచ్చాయి. ఇక, తెలంగాణ విషయానికి వస్తే.. మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, సత్యవతి, శేరి సుభాష్‌రెడ్డి, మల్లేశం, రియాజుల్ హుస్సేన్‌ల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. మార్చి 10 నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. అదే నెల 11న పరిశీలన చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 13 వరకు గడువు విధిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.