అమరావతి కోసం చంద్రబాబు నయాప్లాన్.. అదిరిపోయిందిగా...
ఆంధ్రుల కలల రాజధాని నగరం శరవేగంగా అభివృద్ధి చెందాలంటే అమరావతికి ఓ బ్రాండ్ ఉండాలని సీఎం ఆకాంక్షిస్తున్నారు.
By: Tupaki Desk | 16 Feb 2025 8:32 AM GMTముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన విలక్షణంగా ఉంటుంది. అందరూ నడిచే మార్గంలో నడుచుకోవడం ఆయన స్టైల్ కాదు. పని ఏదైనా తన రూట్ డిఫరెంట్ అంటుంటారు చంద్రబాబు. అది రాజకీయమైనా.. ఇంకొకటైనా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్పీకరించిన తొలినాళ్లలో తనను సీఈవో ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా పిలిపించుకోడానికి ఆయన ఎక్కువ ఇష్టపడ్డారు. ఇక ఇప్పుడు 4.0 పాలనలో చంద్రబాబు ఏఐ జపం చేస్తున్నారు. అదేవిధంగా రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఆంధ్రుల కలల రాజధాని నగరం శరవేగంగా అభివృద్ధి చెందాలంటే అమరావతికి ఓ బ్రాండ్ ఉండాలని సీఎం ఆకాంక్షిస్తున్నారు. దీంతో అమరావతి కోసం బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకోవాలని చూస్తున్నారు.
ఎక్కడైనా ప్రైవేటు సంస్థలు తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోడానికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకుంటాయి. మార్కెట్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవారిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకోవడం వల్ల తమ ఉత్పత్తులకు బ్రాండింగ్ వస్తుందని, అమ్మకాలు పెరుగుతాయనే మార్కెట్ వ్యూహాన్ని అనుసరిస్తుంటారు. కానీ, ఓ ప్రభుత్వం.. తన రాజధాని నగరానికి బ్రాండింగ్ చేసుకోవాలని ఆలోచన చేయడం ఇదే తొలిసారి.
ఏడాది కాలపరిమితితో అమరావతి బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకోవాలని చూస్తున్న ఏపీ ప్రభుత్వం.. వీరి ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు అమరావతికి తీసుకురావాలని చూస్తోంది. రాజధాని అమరావతిని నవ నగరాల కాన్సెప్ట్ తో నిర్మిస్తున్నారు. పూర్తిగా ఓ ప్లాన్ ప్రకారం నిర్మించనున్న రాజధానిలో అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటైతే అభివృద్ధిలో జోరు చూపించవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న ప్రముఖులను అమరావతి బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ప్రభుత్వం నియమించుకనే బ్రాండ్ అంబాసిడర్లు తమ పరపతి, గుర్తింపుతో ప్రపంచవ్యాప్తంగా సదస్సులు, సమావేశాలు నిర్వహించడం, ప్రముఖ సంస్థలతో సంప్రదింపులు జరిపి అమరావతి అభివృద్ధి సహకరించాల్సివుంటుందని ప్రభుత్వం చెబుతోంది.