జగన్ రెఢీ.. కేసీఆర్ మీదే ఆలస్యం!
అయితే.. దీనికి సూటిగా మాత్రం సమాధానం చెప్పట్లేదు కేసీఆర్ అండ్ కో. ఇటీవల పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్.. రేవంత్ సర్కారుపై ఘాటు విమర్శలు చేయటమే కాదు.. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
By: Tupaki Desk | 23 Feb 2025 4:44 AM GMTఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విపక్ష నేతలు అసెంబ్లీకి రాకపోవటం.. వారు అసెంబ్లీకి రావాలని అధికారపక్షాలు అదే పనిగా అడగటం కనిపిస్తోంది. అయితే.. వారు అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో సానుకూలంగా ఉండకపోవటం తరచూ చర్చనీయాంశంగా మారటం తెలిసిందే. తనకు ప్రధాన ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వకపోవటంతో.. ఆ అంశంపై న్యాయస్థానంలో సవాలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన జగన్ పార్టీ.. తనకు ప్రధాన ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలని కోరటం తెలిసిందే.
అయితే.. మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 10 శాతం సీట్లలో పార్టీ గెలిచి ఉంటే.. ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చేదని టీడీపీ వాదిస్తోంది. అయితే.. అలాంటి రూల్ ఏదీ పుస్తకాల్లో లేదని జగన్ వర్గం వాదిస్తోంది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే.. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడటానికి.. తమ వాణిని వినిపించేందుకు సమయం లభిస్తుందని.. అందుకే తాము పోరాడుతున్నట్లుగా వైసీపీ చెబుతోంది.
మొత్తంగా అసెంబ్లీ హాజరుపై వైసీపీ వాదన ఒకలా ఉంటే.. దానికి భిన్నంగా అధికార టీడీపీ వాదన ఉంది. ఇలాంటి వేళ.. అనూహ్య రీతిలో తాజా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. సోమవారం నుంచి షురూ అయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలన్న నిర్ణయాన్ని వైసీపీ శాసనసభా పక్షం నిర్ణయం తీసుకుంది.దీనికి ముందు పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయానికి రావాలని పార్టీ సూచన చేసింది.
గత ఏడాది జులై అసెంబ్లీ సమావేశాల వేళ..రెండు రోజులు అసెంబ్లీకి వచ్చిన జగన్.. ఆ తర్వాత రాలేదు. ఇప్పుడు కూడా గవర్నర్ ప్రసంగం తర్వాతి రోజు అసెంబ్లీకి హాజరు అవుతారా? లేదా? అన్న అంశంపై స్పష్టత రాలేదు. గవర్నర్ ప్రసంగం వేళ మాత్రమే జగన్ హాజరవుతారని.. ఆ తర్వాత హాజరు మీద క్లారిటీ లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీకి సంబంధించి ఇలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీకి వచ్చే విషయంపై గులాబీ అధినేత ఇప్పటివరకు నిర్ణయం తీసుకున్నది లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి వస్తే.. ఆయన వేసే ప్రశ్నలకు ముఖాముఖి సమాధానం ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
అయితే.. దీనికి సూటిగా మాత్రం సమాధానం చెప్పట్లేదు కేసీఆర్ అండ్ కో. ఇటీవల పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్.. రేవంత్ సర్కారుపై ఘాటు విమర్శలు చేయటమే కాదు.. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ అంతే ధీటుగా రియాక్టు అయ్యారు. తన ప్రతి ప్రసంగంలోనూ ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావాలని సీఎం రేవంత్ కోరటం తెలిసిందే. ఏపీలోనూ.. విపక్ష నేత అసెంబ్లీకి హాజరు కావాలంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించటం తెలిసిందే.
మొత్తంగా అసెంబ్లీకి హాజరయ్యేందుకు వీలుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవటంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా మారనున్నాయి. జగన్ తాజా నిర్ణయంతో.. తెలంగాణలో కేసీఆర్ నిర్ణయం ఏమై ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకాలం ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్.. ఇప్పుడిప్పుడే జన జీవన స్రవంతిలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న సంకేతాలు ఇస్తున్నారు. ఏపీలో జగన్ మాదిరి తెలంగాణలో కేసీఆర్ కూడా అసెంబ్లీకి వచ్చేందుకు వస్తే.. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా మారతాయనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. మరేం జరుగుతుందో చూడాలి.