జగన్ వదిలేశారు...వారు పట్టుకున్నారు !
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ అన్నది ఒక దానిని సృష్టించిన వారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.
By: Tupaki Desk | 17 March 2025 6:00 PM ISTఏపీలో వాలంటీర్ల వ్యవస్థ అన్నది ఒక దానిని సృష్టించిన వారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. అది ఆయన మానస పుత్రికగా ముద్ర పడింది. జగన్ ఈ వ్యవస్థను తెచ్చేంతవరకూ దేశంలో ఇలాంటి వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేసుకోవచ్చని ఎవరికీ తెలియదు. పౌర సేవలు సాధ్యమైనంత దగ్గరగా ప్రజల ముంగిట్లోకి తీసుకుని వెళ్ళడం అంటే పాలనలో ఒక మంచి సంస్కరణ కిందనే లెక్క.
ప్రతీ యాభై కుటుంబాలకు ఈ విధంగా న్యాయం చేయాలనుకోవడం ద్వారా ప్రభుత్వం మరింత దగ్గరకు వచ్చినట్లు అయింది. అయితే వాలంటీర్ల వ్యవస్థ మంచి ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసినా దానిని రాజకీయంగా వైసీపీ వాడుకుంది అన్న ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా 2021లో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో వాలంటీర్ల వ్యవస్థ అతి చేసిందన్న విమర్శలు రావడంతో ప్రతిపక్షాలకు టార్గెట్ అయింది. దానికి తోడు వైసీపీ వారు సైతం వాలంటీర్ల వ్యవస్థను సొంతం చేసుకోవడంతో ఒక మంచి వ్యవస్థ పూర్తిగా రాజకీయం పాలు అయింది.
ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల వేళ వాలంటీర్ల చేత రాజీనామాలు చేయించి వైసీ నేతలు వాడుకోవడం ఒక పరాకాష్ట అయితే వాలంటీర్లకు అయిదు నుంచి పది వేల గౌరవ వేతనం ఇస్తామని చెప్పి వారి ఓట్లను వేయించుకోవడం ద్వారా కూటమి పెద్దలు తమదైన రాజకీయం చేశారు.
ఇక అధికారంలోకి వచ్చాక టీడీపీ కూటమి నేతలు నాలిక మడత వేశారు. 2023 ఆగస్టు నుంచే వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను రెన్యువల్ చేయలేదు కాబట్టి తాము ఆ వ్యవస్థను లేనట్లుగానే భావిస్తున్నామని చెబుతున్నారు.
వాలంటీర్ల వ్యవస్థ కంటిన్యూ అయితే తాము వారిని విధులలోకి తీసుకునే వారమని అంటున్నారు. ఈ టెక్నికాలిటీస్ ఈ లాజిక్కులు పక్కన పెట్టి హామీ ఇచ్చిన మేరకు వాలంటీర్లను విధులలోకి తీసుకోవాలని ఆ సంఘం నాయకులు కోరుతున్నారు. అయితే వాలంటీర్ల పోరాటం అంతా ఒంటరిగా సాగుతోంది. వారికి ఏపీలో బలమైన వైసీపీ నుంచి మద్దతు కరవు అవుతోంది.
నిజానికి వాలంటీర్ల వ్యవస్థను తెచ్చిన వైసీపీకే ఎక్కువ బాధ్యత ఉండాలి. పైగా ప్రతిపక్షంగా ఏపీలో రెండున్నర లక్షల మంది దాకా ఉన్న ఒక అతి పెద్ద వ్యవస్థ తరఫున మాట్లాడేందుకు వైసీపీ ముందుకు రాకపోవడం బాధాకరం అని అంటున్నారు. అయితే తాము తెచ్చిన వ్యవస్థను కూటమి ప్రభుత్వం కాదని అంటూంటే వైసీపీ ఎందుకు ఇలా చేస్తోంది అంటే దాని వెనక కారణాలు ఉన్నాయని అంటున్నారు.
వాలంటీర్ల వ్యవస్థ తెచ్చి అయిదేళ్ళ పాటు వారిని పోషించి ఉపాధి కల్పించినా చివరి నిముషంలో పదివేల గౌరవ వేతనానికి ఆశపడి వాలంటీర్లు కూటమికి మద్దతుగా నిలిచారు అన్న ఆగ్రహం ఏదో వైసీపీకి ఉందని ప్రచారం సాగుతోంది. దాంతో ఎందుకొచ్చిన తంటా అని ఊరుకుంటోందా అన్నదే చర్చగా ఉంది.
అంతే కాదు వాలంటీర్ల వ్యవస్థ వల్ల రాజకీయంగా తాము నష్టపోయామని క్యాడర్ ని వదిలేయడం వల్లనే 2024 ఎన్నికల్లో ఘోరమైన ఓటమి వరించిందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు. అందుకే వారి విషయంలో మళ్ళీ మాట్లాడితే ఎక్కడ క్యాడర్ కి కోపం వస్తుందో అన్న ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. అందుకే వాలంటీరు అన్న మాటను గడచిన పది నెలలుగా వైసీపీ నోటి వెంట వినిపించడం లేదు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే వాలంటీర్లకు వామపక్ష కార్మిక సంఘాల నుంచి మద్దతు దక్కుతోంది. వారే వీరిని ముందుండి నడిపిస్తున్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. హామీ ఇచ్చిన మేరకు వాలంటీర్లకు న్యాయం చేయాల్సిందే అని అంటున్నారు. ఈ క్రమంలో వాలంటీర్లకు ఏమైనా మేలు జరిగితే ఆ క్రెడిట్ వామపక్ష అనుబంధ సంస్థలకే పోతుంది అని అంటున్నారు.