తెల్ల రేషన్ కార్డు చేతిలో ఉంటే బ్రహ్మాస్త్రమే !
టీడీపీ కూటమి ప్రభుత్వం మీద జనాలలో ఆశ, నమ్మకం నిండుగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం చెప్పినది చేస్తుంది అని వారు విశ్వసిస్తున్నారు
By: Tupaki Desk | 6 Dec 2024 3:44 AM GMTటీడీపీ కూటమి ప్రభుత్వం మీద జనాలలో ఆశ, నమ్మకం నిండుగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం చెప్పినది చేస్తుంది అని వారు విశ్వసిస్తున్నారు. అయితే అనుకున్నది కాస్తా ఆలస్యం అయితే కావచ్చు అని సర్ది చెప్పుకుంటున్నారు. అంతే తప్ప వైసీపీ నేతలు విమర్శించినట్లుగా సూపర్ సిక్స్ అన్నది ప్రభుత్వం చేయదని మాత్రం వారు భావించడం లేదు.
ఈ నేపధ్యంలో కొంతకాలం వేచి చూడడానికి కూడా లబ్దిదారులు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఏపీలో తెల్ల రేషన్ కార్డు అన్నది ఒక బ్రహ్మాస్త్రంగా మారుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ఏపీలో అమలుకు కూటమి హామీ ఇచ్చింది. అందులో సూపర్ సిక్స్ అన్నవి జనాలలోకి చొచ్చుకుని పోయాయి.
వాటి మీద మోజుతోనే కూటమికి జనాలు భారీ ఎత్తున మద్దతు ఇచ్చారు. తీర్పు కూడా వన్ సైడెడ్ గా వచ్చి కూటమికి అదిరిపోయే సక్సెస్ దక్కింది. ఇదిలా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు పధకాలను అమలు చేసింది. సామాజిక పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇపుడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పధకానికి కూడా శ్రీకారం చుట్టింది.
మిగిలినవి కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఏ పధకం అమలు కావాలన్నా తెల్ల రేషన్ కార్డు అన్నది ముఖ్యంగా ఉంది. వైట్ రేషన్ కార్డు చేతిలో ఉంటే చాలు ప్రభుత్వ పధకాలు అలా వచ్చి వాలతాయని అందరికీ తెలుసు. అందుకే ఇపుడు వైట్ రేషన్ కార్డుకు ఏపీలో యమ డిమాండ్ ఉంది.
ఈ రోజుకు చూస్తే ఏపీ జనాభా 5 కోట్లకు పైగా ఉంది. అందులో కుటుంబాలు మూడున్నర కోట్ల దాకా ఉంటే ఒక లక్షా 65 వేల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే సగానికి సగం కుటుంబాలు ఏపీలో వైట్ కార్డుతో ఉన్నాయన్న మాట.
ఇపుడు కొత్తగా మరో నాలుగు నుంచి అయిడు లక్షల మంది దాకా వైట్ రేషన్ కార్డులు అందుకోవాలని చూస్తున్నారు. ఇక డిసేంబర్ 2 నుంచి 28 వరకూ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు సచివాలయాలలో స్వీకరిస్తామని ఆ మీదట సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రచారం అయితే జరిగింది. కానీ అధికారికంగా ఎక్కడా చెప్పినట్లుగా అయితే ప్రకటన వెలువడలేదు.
కానీ జనాలు మాత్రం గత వారం రోజులుగా సచివాలయాలకు వెళ్ళి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. దాంతో ఆ తాకిడి అంతకంతకు అధికమైపోతోంది. కొత్త కార్డుల కోసం వచ్చే వారిని అదుపు చేయలేక సచివాలయ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదిలా ఉంటే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం కూడా ఆలోచిస్తోంది.అంతే కాదు గత వైసీపీ హయాంలో జగన్ బొమ్మతో ఇచ్చిన రేషన్ కార్డులను కూడా మార్చేసి కొత్త కార్డులను మొత్తంగా ముద్రించి ఇవ్వాలని కూడా చూస్తోంది. వీటికి సంక్రాంతి టైం అయితే సరిపోదు. అందుకే ప్రభుత్వం సరైన సమయంలో కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు మొత్తం కార్డులను ముద్రించి ఇచ్చే ప్రక్రియను మొదలెడుతుందని అంటున్నారు. మార్చి నెలాఖరులోగా ఈ కార్యక్రమం జరగవచ్చు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే కొత్త రేషన్ కార్డులకు విధి విధానాలను కూడా పకడ్బంధీగా రూపొందించాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ముఖ్యంగా నిరు పేదలకే కార్డులు ఇవ్వాలని వారి ఆదాయాలను పూర్తిగా ధృవీకరించుకున్న మీదటనే కార్డులు మంజూరు చేయాలని చూస్తున్నారు.
ఇక పాత కార్డులలో కూడా కోటీ అరవై అయిదు లక్షలలో ఎక్కువగా అనర్హులకు కార్డులు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది అని అంటున్నారు. దాంతో వాటి విషయంలోనూ ప్రక్షాళన ఉంటుంది అని అంటున్నారు. ఏపీలోనే నివాసం ఉంటూ పేదలుగా ముద్ర పడిన వారికే తెల్ల రేషన్ కార్డులను ఇస్తూ అసలైన వారికే వాటిని అందించాలన్నది కూటమి ప్రభుత్వం లక్ష్యమని అంటున్నారు.
దాని కోసం చేసే కసరత్తు వల్లనే ఆలస్యం అవుతోంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో తెల్ల రేషన్ కార్డు కోసం జనాలలో విపరీతమైన ఆసక్తి ఉంది. ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలను బట్టి చూస్తేనే తప్ప ఎవరికి అవి దక్కుతాయో మాత్రం తెలియదు అని అంటున్నారు.