మహిళను వివస్త్రను చేసి.. సంక్రాంతి వేళ.. ఏపీలో దారుణం!
సంక్రాంతి వేళ అందరూ హ్యాపీగా పండుగ చేసుకుంటే.. ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న పెనుగొండ నియోజకవర్గంలో దారుణం జరిగింది
By: Tupaki Desk | 16 Jan 2025 4:11 AM GMTసంక్రాంతి వేళ అందరూ హ్యాపీగా పండుగ చేసుకుంటే.. ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న పెనుగొండ నియోజకవర్గంలో దారుణం జరిగింది. ఈ నియోజకవర్గానికి టీడీపీ మహిళా నాయకురాలు, మంత్రి సంజీవరెడ్డిగారి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంక్రాంతి వేళ.. ఇక్కడి ఓ మహిళ(35) పట్ల కొందరు వ్యక్తులు(కూటమిలోని ఓ పార్టీకి చెందిన వారని ప్రచారం జరుగుతోంది) అమానుషంగా ప్రవర్తించారు. ఆమెను వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించినట్టు తెలిసింది.
దాడి చేసిన వ్యక్తులకు చెందిన ఓ యువతి కులాంతర వ్యక్తిని ప్రేమించింది. ఈ ప్రేమ జంటకు బాధిత మహిళ సాయం చేసినట్టు పోలీసులు చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న యువతి బంధువులు.. సదరు మహిళపై సంక్రాంతి వేళ.. దాడి చేసి ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి.. వివస్త్రను చేయడంతో పాటు.. మహిళ జుట్టును కూడా కత్తిరించినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం.. ఊళ్లో ఆమెను ఊరేగిం చారని తెలిపారు. ఈ ఘటన స్థానికంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
బాధిత మహిళ తాలూకు బంధువులు వద్దని వారించినా.. వారిపైనా యువతి బంధువులు దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. దీంతో హుటాహుటిన బాధిత మహిళ తాలూకు బంధువుల పోలీసులను ఆశ్రయిం చారు. ఈ కుటుంబం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఫ్యామిలీ కావడంతో రంగంలోకి దిగిన డీఎస్పీ.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటన జరిగిన విషయాన్ని నిర్ధారించుకున్నారు. అనంతరం కేసు నమోదు చేశారు. దాడి చేసి.. మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారి కోసం వెతుకుతున్నట్టు డీఎస్పీ చెప్పారు. దీనిపై పూర్తి విచారణ చేపట్టామన్నారు.