బాబుకు రిక్వెస్టు: పసుపు-కుంకాలకు దరఖాస్తులు..!
ఈ క్రమంలో అనేక సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయి. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు.. వంటివాటి కోసం ఎక్కువ మంది మహిళలు దరఖాస్తులు చేసుకుంటున్నారు.
By: Tupaki Desk | 24 Jan 2025 8:30 PM GMTఏపీలో కూటమి ప్రభుత్వ కీలక పార్టీ టీడీపీ ప్రజాదర్బార్‌లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రతిరోజూ.. ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. వారి సమస్యలు వింటున్నారు. వాటిని సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో అనేక సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయి. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు.. వంటివాటి కోసం ఎక్కువ మంది మహిళలు దరఖాస్తులు చేసుకుంటున్నారు.
ఆయా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగానే ఉంది. అయితే.. అనూహ్యంగా తూర్పు, పశ్చిమ, అనంతపురం, తిరుపతి జిల్లాల నుంచి ఇటీవల కాలంలో మహిళలు పెద్ద ఎత్తున పసుపు-కుంకం పథకాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలంటూ.. దరఖాస్తులు సమర్పించడం గమనార్హం. 2019 ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న టీడీపీ.. ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఖచ్చితంగా ఎన్నికలకు నాలుగు మాసాల ముందు ఎనౌన్స్ చేసిన ఈ పథకం బాగానే వర్కవుట్ అయింది.
అర్హులైన మహిళలకు రూ.10000 చొప్పున ఆర్థిక సాయం అందించడమే .. పసుపు-కుంకుమ పథకం లక్ష్యం. 2019 ఎన్నికలకు ముందు కీ రోల్ పోషించిన ఈ పథకంతో తిరిగి అధికారం దక్కించుకుంటామని తమ్ముళ్లు ఆశలు పెట్టుకున్నారు. పథకం అయితే వర్కవుట్ అయింది. రాత్రికి రాత్రి విధి విధానాలు ఖరారు చేసి మరీ దీనిని అమలు చేశారు. మహిళలకు భారీగానే లబ్ధి చేకూర్చారు. మరోవైపు.. అప్పటి విపక్ష పార్టీ వైసీపీకి చెమటలు కూడా పట్టించారు. కానీ, ఎందుకో.. ఈ పథకం ఎన్నికల్లో ఓట్లు దూయలేక పోయింది.
కట్ చేస్తే.. గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు చంద్రబాబు, టీడీపీ టీం అందరూ.. సూపర్ సిక్స్‌ను ప్రకటించారే కానీ.. దానిలో పసుపు-కుంకం పథకాన్ని ప్రస్తావించలేదు. దీని స్థానంలో మాతృవందనం పథకాన్ని తీసుకువచ్చారు. కానీ.. ఇప్పుడు పలు జిల్లాల నుంచి కేంద్ర కార్యాలయానికి వస్తున్న మహిళలు.. పసుపు-కుంకుమ పథకాన్ని తిరిగి అమలు చేయాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 130కిపైగా దరఖాస్తులు అందినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే.. దీనిని తిరిగి ప్రవేశ పెట్టేదీ లేందీ చంద్రబాబు నిర్ణయిస్తారని అంటున్నాయి. ఇది మహిళల సెంటిమెంటుతో కూడిన పథకం కావడంతో సానుకూలంగానే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.