Begin typing your search above and press return to search.

బాబు సీఎం అయినా అతడే ఏపీ ఆగ్రోస్ ఛైర్మన్

నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారు ఎవరైనా.. ప్రభుత్వాలు మారిన తర్వాత తమంతట తాముగా పదవులకు రాజీనామా చేసి గౌరవంగా తప్పుకుంటారు

By:  Tupaki Desk   |   30 July 2024 8:30 AM GMT
బాబు సీఎం అయినా అతడే ఏపీ ఆగ్రోస్ ఛైర్మన్
X

నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారు ఎవరైనా.. ప్రభుత్వాలు మారిన తర్వాత తమంతట తాముగా పదవులకు రాజీనామా చేసి గౌరవంగా తప్పుకుంటారు. కొన్ని ప్రభుత్వాలు తాము అధికార దండాన్ని తీసుకున్నంతనే ఇలాంటి వాటిపై ఫోకస్ చేస్తాయి. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. గత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవిని చేపట్టి.. కొత్త ప్రభుత్వంలోనూ కొనసాగుతున్న ఒక ప్రముఖుడిపై తెలుగు తమ్ముళ్లు నిప్పులు చెరుగుతున్నారు. తమ చేతిలో అధికారం ఉన్నా.. పగ్గాలు మరొకరి చేతుల్లో ఉండటాన్ని ప్రశ్నిస్తున్నారు.

గతంలో నియమితులైన నామినెటెడ్ ఛైర్లన్లు పలువురు తమ పదవులకు రాజీనామా చేయగా.. శ్రీసత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ మాత్రం తన కుర్చీని విడిచి పెట్టేందుకు ససేమిరా అంటున్నారు. ఆయన ఏపీ ఆగ్రోస్ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. ప్రభుత్వం మారినంతనే పదవికి రాజీనామా చేసే సంప్రదాయాన్ని పట్టించుకోకుండా కొనసాగుతున్నారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం ఒక కన్నేస్తే సరిపోతుంది. కానీ.. చంద్రబాబుకు ఇలాంటివి పట్టటం లేదంటున్నారు.

దీనికి తోడు సదరు ఆగ్రోస్ ఛైర్మన్ లీలలు మామూలుగా లేవంటున్నారు. నవీన్ నిశ్చల్ హయాంలో సదరు శాఖకు ఎండీగా క్రిష్ణమూర్తి పని చేశారు. వీరి హయాంలో అవసరం లేకున్నా రూ.13 కోట్లతో నాసిరకం యంత్ర పరికరాలు.. రేపర్లను కొనుగోలు చేసి పక్కన పెట్టేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ట్రాక్టర్ల కొనుగోలుకు ఆగ్రోస్ కు చెందిన నిధుల్ని బ్యాంకులో హామీగా ఉంది రూ.33 కోట్లకు పైగా రుణం తీసుకున్నారని చెబుతున్నారు.

ఏపీ ఆగ్రోస్ భవిష్యత్తు సందేహంగా మారిన వైనంపై అప్పటి ఉద్యోగులు కంప్లైంట్ చేసినా గత ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఇప్పటి ప్రభుత్వం కూడా పట్టనట్లుగా ఉందంటున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కూడా ఆగ్రోస్ ఛైర్మన్ గా నవీన్ కొనసాగటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.ఈ తరహా తీరుకు చెక్ పెట్టాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉందని.. ఈ తరహా వ్యక్తులపై కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.