అటు అధికారులు.. ఇటు కార్పొరేషన్ల చైర్మన్లు.. తుడిచి పట్టేస్తున్న కూటమి!
దీంతో పూనం మాలకొండయ్య, భరత్ గుప్తా, రేవు ముత్యాలరాజులను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తప్పుకోవాలని సూచించారు
By: Tupaki Desk | 7 Jun 2024 1:36 PM GMTకూటమి ప్రభుత్వం ఇంకా అధికారం చేపట్టకముందే.. అటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సహా.. ఇటు కార్పొరేషన్ల పదవుల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు సీఎంవోలో పనిచేసిన అందరు అధికారులను కూడా తీసి పక్కన పెట్టేసింది. సీనియర్ మోస్ట్ అదికారుల నుంచి జూనియర్ల వరకు కూడా.. సీఎంవోలో పనిచేసిన వారిని వెంటనే జీఏడీలో రిపోర్టు చేసి.. సీట్లు ఖాళీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాద్యతలు స్వీకరించిన.. నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.
దీంతో పూనం మాలకొండయ్య, భరత్ గుప్తా, రేవు ముత్యాలరాజులను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తప్పుకోవాలని సూచించారు. దీంతో వారు తమ తమ స్థానాలను ఖాళీ చేశారు. ఇదేసమయంలో వారి వారి ఛాంబర్లనుంచి ముఖ్యమైన ఫైళ్లను కూడా.. తీసుకువెళ్లడానికి వీల్లేదని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇక, రాష్ట్రంలో వైసీపీ సర్కారు ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్ల పై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయా కార్పొరేషన్లకు చెందిన చైర్మన్లను, వైస్ చైర్మన్లను కూడా.. తక్షణమే ఖాళీ చేయాలని.. ఆయా పదవులకు రాజీనామాలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, అకాడమీలు, ఇతర సంస్థలకు సంబంధించిన నామినేటెడ్ చైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యుల రాజీనామా లను తెప్పించుకొని, వాటిని వెంటనే ఆమోదించాలని సంబంధిత శాఖాధిపతులను ఏపి చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. దీంతో తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి నుంచి సినిమా టోగ్రఫీ వరకు.. అన్ని కార్పొరేషన్లు, 56 సామాజిక వర్గాలకు చెందిన కార్పొరేషన్ల పదవుల వరకు కూడా.. అధికారులు, చైర్మన్లు తమ తమ పదవులకు రాజీనామాలు చేయనున్నారు. కాగా.. వీటిని కూడా.. అత్యంత వేగంగా టీడీపీ, జనసేన నాయకులతో భర్తీ చేయనున్నట్టు సమాచారం.