హైదరాబాద్ తో ఏపీ రుణం మరో రెండు నెలలే... తర్వాత అద్దెలే!
ఏపీ, తెలంగాణ మధ్య అధికారికంగా ఉన్న బంధానికి మరో రెండు నెలల్లో తెరపడబోతోంది.
By: Tupaki Desk | 28 March 2024 4:54 AM GMTఏపీ, తెలంగాణ మధ్య అధికారికంగా ఉన్న బంధానికి మరో రెండు నెలల్లో తెరపడబోతోంది. వాస్తవానికి అప్పటివరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పటికీ... చంద్రబాబు ఏపీకి హుటాహుటున షిప్ట్ అయిపోయారు! అందుకు గల కారణాల సంగతి కాసేపు పక్కనపెడితే... మరో రెండు నెలల్లో హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కి కేటాయించిన భవనాలు తెలంగాణ ప్రభుత్వం ఆదీనంలోకి వెళ్లబోతున్నాయి. దీంతో... వాట్ నెక్స్ట్ అనేది ఆసక్తిగా మారింది.
అవును... రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ ని పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ప్రకటించడంతో... ఇక్కడున్న ప్రభుత్వ భవనాలను ఏపీ సర్కార్ తన వాటాలో తాను వాడుకుంది! ఇందులో భాగంగా... హైదరాబాద్ లోని లేక్ వ్యూ అతిథి గృహంతో పాటుగా మరికొన్ని భవనాలకు సంబంధించి, జూన్ 2 నుంచి ఉపయోగించుకుంటే అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే... జూన్ 2 నుంచి హైదరాబాద్ ఏపీ తెలంగాణాల ఉమ్మడి రాజధానిగా ఉండదు.
జూన్ 2 నుంచి హైదరాబాద్ పూర్తిగా తెలంగాణ రాజధాని కాబోతోంది! అది కూడా సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే రెండు రోజుల ముందే కావడం గమనార్హం. దీంతో.. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికంటే ముందే... డెడ్ లైన్ పూర్తయిపోతుందన్నమాట. ఈ నేపథ్యంలో... తెలంగాణకి ఏపీ ప్రభుత్వం అద్దెలు చెల్లించడం తప్పకపోవచ్చని అంటున్నారు!
కాగా.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం... పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో అప్పటివరకూ తమ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ తో పాటు మిగిలిన భవనాలను ఏపీ ప్రభుత్వం ఖాళీ చేయాల్సి, వాటిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే.. ఈ విషయంలో మరో ఏడాది పాటు భవనాలను ఉచితంగా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరినా.. అందుకు తెలంగాణ సర్కార్ అంగీకరించలేదని అంటున్నారు.
దీంతో... హెర్మిటేజ్ భవనం, సీఐడీ భవనం, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లను తీసుకుని.. తెలంగాణ ప్రభుత్వానికి అద్దె చెల్లించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది! అయితే... ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో... ఈ విషయంపై జూన్ 4 తర్వాతే క్లారిటీ రావొచ్చు! ఇక... విభజన చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం... 2014 జూన్ 2 నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిథిలోని ప్రాంతం ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా ఉంటున్న సంగతి తెలిసిందే!