ఏపీ - తెలంగాణ: రాజకీయ ప్రయోగాలు.. ఏది మంచి.. ఏది చెడు.. ?
కానీ, చిత్రంగా.. ఈ ప్రయోగం వికటించింది. మొత్తంగా చూస్తే.. రాజకీయ ప్రయోగాలు.. ఏది మంచి.. ఏది చెడు? అనేది పట్టుకోవడం కష్టంగా ఉందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.
By: Tupaki Desk | 18 Jun 2024 2:30 PM GMTప్రయోగాలు మంచిదే.. కానీ, రాజకీయ ప్రయోగాలు మాత్రం ఆచి తూచి చేయాలి. ఎక్కడ ఏచిన్న తేడా వచ్చినా.. మొత్తం పార్టీకే ఎసరు పెడుతుంది. అయితే.. ఒక్కొక్కసారి ప్రయోగాల విషయంలో సాచివేత ధోరణి కూడా.. మంచిది కాదు. మొత్తంగా రాజకీయంగా ప్రయోగాల విషయంలో అసలు ఏది మంచిది.. ఏది చెడు అనే విషయంలో పార్టీలు ఇప్పటికీ ఒకనిర్ణయానికి రాలేక పోతున్నాయి. గెలిచిన తర్వాత.. ఓడిపోయిన తర్వాత.. చేసుకుంటున్న సమీక్షలను బట్టి మార్చుకుంటున్నాయి.
ఉదాహరణకు తెలంగాణలో గత ఏడాది నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ కాంగ్రెస్‌పార్టీ పెద్ద ప్రయోగం చేసింది. పార్టీ అధ్యక్షుడి టీడీపీ నుంచి తీసుకువచ్చిన రేవంత్‌రెడ్డిని నియమించింది. అంతేకాదు.. ప్రచార బాధ్యతలను కూడా అప్పగించేసింది. ఇది ఒక జాతీయ పార్టీ.. అందునా కాంగ్రెస్ పార్టీ చేసిన అతి పెద్ద ప్రయోగం. ఎంతో మంది సీనియర్లు ఉన్నా.. వారిని పక్కన పెట్టి రేవంత్‌కు అవకాశం ఇచ్చింది. దీంతో సీనియర్లు ఆగ్రహానికి గురయ్యారు.
ఈ పరిణామాలతో పార్టీ గెలుపుపైనా సందేహాలు ముసురుకున్నాయి. కానీ, అంతిమంగా చూస్తే.. కాంగ్రెస్ చేసిన ప్రయోగం ఫలించింది. పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతేకాదు.. అసలు సీఎం అభ్యర్థిగా రేవంత్‌ను ముందుగానే ప్రకటించి ఉంటే.. మరింత ఫలితం వచ్చేదని కూడా.. వాదన వినిపించింది. కట్‌చేస్తే.. అదే రాష్ట్రంలో బీఆర్ ఎస్ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను పెద్దగా మార్చకుండానే తిరిగి టికెట్లు ఇచ్చింది. అందరూ గుండుగుత్తగా ఓడిపోయారు.
దీంతో కేసీఆర్ మార్చకుండా తప్పుచేశారని మేధావులు చెప్పారు. ఇక, ఏపీ విషయానికి వస్తే.. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు.. వారి వారి నియోజకవర్గాల్లో సుమారు 45 మందికిపైగానే అప్పటి సీఎం జగన్ మార్చేశారు. ఇక బీసీలకు, ఎస్సీలకు, మహిళలకు కూడా పెద్ద పీట వేశారు. యాభై శాతం సీట్లను మహిళ లకు ఇచ్చారు. అంతేకాదు.. కాపులకు కూడా ఎక్కువ మందికి సీట్లు ఇచ్చారు. దీనిని కూడా.. అప్పట్లో రాజకీయ నేతలు, మేధావులు పెద్ద ప్రయోగంగానే పేర్కొన్నారు. కానీ, చిత్రంగా.. ఈ ప్రయోగం వికటించింది. మొత్తంగా చూస్తే.. రాజకీయ ప్రయోగాలు.. ఏది మంచి.. ఏది చెడు? అనేది పట్టుకోవడం కష్టంగా ఉందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.