Begin typing your search above and press return to search.

ఏపీలో ఎమ్మెల్యే అభ్యర్ధి యాభై కోట్లు పెట్టే స్తోమత ఉండాలా...?

ఎన్నికలు అంటే ఇదివరకులా లేవు. ప్రజాస్వామ్యం అంతకంతకు ధనస్వామ్యంగా మారుతోంది

By:  Tupaki Desk   |   13 Oct 2023 2:30 PM GMT
ఏపీలో ఎమ్మెల్యే అభ్యర్ధి యాభై కోట్లు పెట్టే స్తోమత ఉండాలా...?
X

ఎన్నికలు అంటే ఇదివరకులా లేవు. ప్రజాస్వామ్యం అంతకంతకు ధనస్వామ్యంగా మారుతోంది. కోట్లు తీస్తేనే తప్ప రాజకీయం సాగడం లేదు ఒకపుడు అంటే అన్న గారి టీడీపీ టైం లో జస్ట్ నామినేషన్ ఖర్చులు పెట్టుకుంటే చాలు హ్యాపీగా ఎమ్మెల్యే ఎంపీ అయిపోయేవారు. ఆ తరువాత మాత్రం తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ఖరీదు అయిపోయాయి. పాతికేళ్ళుగా సాగుతున్న ఈ రకమైన ట్రెండ్ ఇపుడు అంతకంతకు ఎన్నికల ఖర్చుని పెంచేస్తూ ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలంటే యాభై కోట్లు బడ్జెట్ ని వెచ్చించాల్సిందే అన్నట్లుగా మారింది అని అంటున్నారు.

అలా ఆలోచిస్తే ఏపీలో 2024 ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలుగా మారబోతున్నాయని అంటున్నారు. అది టీడీపీ అయినా లేక వైసీపీ జనసేనల నుంచి అయినా ఎమ్మెల్యేగా పోటీ చేయాలీ అంటే వారి దగ్గర యాభై కోట్లు ఉంటేనే సీటు వచ్చే చాన్స్ ఉంది అని అంటున్నారు. ప్రజలు కూడా ఈసారి ఎన్నికల హడావుడి హోరాహోరీ పోటీ చూసి చాలానే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు అని అంటున్నారు.

దానితో పాటు ఖర్చుకు కూడా ఎన్నిక ఎన్నికకూ బాగా పెరిగిపోతున్నాయి. మారుతున్న కాలంలో సోషల్ మీడియా కూడా అతి ముఖ్య పాత్ర పోషిస్తోంది. దాంతో ఎమ్మెల్యే అభ్యర్ధి ఎవరైనా కేవలం సోషల్ మీడియాలో ప్రచారానికే మూడు నుంచి నాలుగు కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తోంది అని అంటున్నారు. ఇక ఓటుకు ఒకపుడు అయిదు వందల రూపాయలు ఇచ్చేవారు అని ప్రచారంలో ఉండేది.

ఆ రోజులకు అది గొప్పగానే ఉంది. కానీ నంద్యాల ఉప ఎన్నికల తరువాత ఓటు రేటు బాగా పెరిగిపోయింది అని అంటున్నారు. వేలల్లోకి వచ్చేసిందిట. దాంతో 2024లో ఓటుకు రెండు వేల రూపాయలు ఖర్చు చేయాలని కొత్త లెక్కలు తీస్తున్నారు. ఒక నియోజకవర్గంలో సుమారు లక్షన్నర మంది ఓటర్లు ఉంటే కనుక ఈ లెక్కన వేసుకుంటే దానికే ఏకంగా ముప్పయి కోట్ల రూపాయలు చాలా సులువుగా పోతుంది అని అంటున్నారు.

ఇక మండలాలు గ్రామాలలో నాయకుల జంపింగులకు, అలాగే పంపకాలకు మరో ఆరేడు కోట్లు ఖర్చు అవుతుంది అని లెక్క వేస్తున్నారు. ఇవన్నీ దాటుకుని ప్రచారం నిర్వహించి పోలింగ్ దాకా కధ వస్తే పోలింగ్ ఏజెంట్ల కోసం ప్రతీ ఒక్క పోలింగ్ స్టేషన్ కి కనీసంగా యాభై వేల రూపాయల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇలా కనుక చూసుకుంటే అన్నీ కలుపుకుని కచ్చితంగా యాభై కోట్ల రూపాయలు దాకా ఖర్చు అవుతుందని అంటున్నారు. యాభై కోట్లు చేతిలో పట్టుకోకుండా ఎన్నికలను చేయలేమని అన్ని పార్టీలలోని ఆశావహులు అభ్యర్ధుల రేసులో ఉన్న వారు అంటున్న మాట ఇది.

తీరా ఇన్ని రకాలైన ఆర్ధిక ఇబ్బందులను తట్టుకుని యాభై కోట్లను తీసి ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయినా ఆ పదవికి గౌరవం విలువా ఉన్నాయా అంటే అదీ లేదు అని అంటున్నారుట. దాంతో ఎందుకొచ్చిన ఎమ్మెల్యే పదవి అని చాలా మంది అనుకుంటున్నారుట. నిజానికి దేశంలో కెల్లా ఎన్నికల ఖర్చు ఎక్కువగా తెలుగు రాష్ట్రాలలోనే ఉంది. అందులోనూ ఏపీలోనే ఉంది.

ఏపీలో చాలా కాలం నుంచే ధన ప్రభావం ఎన్నికల మీద పడడం జరిగింది. ఇక్కడ హంగూ ఆర్భాటం ఎక్కువ. దానికి తోడు పోటీ తత్వం ఎక్కువ. ఎన్నికలను చాలా ప్రస్టేజి గా సవాల్ గా తీసుకుని అభ్యర్ధులు పోటీలు పడి మరీ పెంచేసి ఈ స్థితికి తెచ్చారని అంటున్నారు.

ఈ సందర్భంగా ఒక ముచ్చట చెప్పుకోవాలి. ఎన్టీయార్ టీడీపీ పెట్టినపుడు చాలా మంది విద్యావంతులను మేధావులను ఎంపిక చేసి టికెట్లు ఇచ్చారు. వారి మొత్తం ఎన్నిక ఖర్చు ఆ రోజుల్లో కేవలం పది వేల రూపాయలుగా ఉందని చాలా మంది ఈ రోజుకీ చెప్పుకుంటారు. ఆ రోజులలో ప్రజలు కూడా ఏమీ ఆశించేవారు కాదు అలాగే పార్టీ కార్యకర్తలు కూడా గెలుపు కోసం తమ శక్తినే చమటగా మారుస్తూ వెళ్లేవారు.

ప్రచార ఆర్భాటాలు కూడా తక్కువ. దాంతో ఎన్నికల ఖర్చు చాలా నామమత్రంగా ఉండేది. పైపెచ్చు ఆ రోజులలో ఎమ్మెల్యే అంటే ఎంతో గౌరవం మర్యాద ఉండేవి. ఇపుడు కాలం మారింది అన్నీ పెరిగిపోయాయి. విలువలు తరిగిపోయాయని అంతా నిట్టూరుస్తున్న పరిస్థితి ఉంది.