సింగిల్ గా పోటీ: పవన్ కు విసిరే సవాలు.. మోడీకి వర్తించదా?
ఇప్పుడు అలాంటి లాజిక్కును సంధిస్తే.. ఏపీ అధికార పార్టీ ఇబ్బందుల్లో పడటం ఖాయమని చెప్పక తప్పదు
By: Tupaki Desk | 10 Aug 2023 5:47 AM GMTరాజకీయాలు అన్న తర్వాత అందరికి ఒకేలాంటి నిబంధనలు వర్తిస్తాయి. కొందరికి మాత్రమే అన్నట్లుగా ఉండదు. ఇప్పుడు అలాంటి లాజిక్కును సంధిస్తే.. ఏపీ అధికార పార్టీ ఇబ్బందుల్లో పడటం ఖాయమని చెప్పక తప్పదు. జనసేన అధినేత పవన్ ను ఇరుకున పడేసేందుకు.. దమ్ముంటే.. సింగిల్ గా ఏపీ వ్యాప్తంగా 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా? ధైర్యం ఉందా? అని ప్రశ్నిస్తూ.. తమ సవాలుకు సమాధానం చెప్పాలంటూ వైసీపీ నేతలు తరచూ ప్రశ్నిస్తుంటారు. ఈ సవాలు ఒక మోతాదు వరకు ఓకే కానీ.. ఎక్కువసార్లు అంటే మాత్రం.. అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అదెలా అంటారా? జనసేనను ప్రశ్నించే ప్రశ్నల్ని.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని సంధించే సత్తా ఉందా? అన్న క్వశ్చన్ ను తెర మీదకు తీసుకొస్తే.. సమాధానం చెప్పలేని ఇబ్బందికర పరిస్థితుల్లోకి అధికార వైసీపీ వెళుతుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. జనసేన అధినేత పవన్ ను అదే పనిగా ప్రశ్నించే కొన్ని అంశాలు.. కేంద్రంలోని మోడీ సర్కారుకు వర్తిస్తూ.. దీనికేం సమాధానం చెబుతారా? అని ప్రశ్నిస్తే పరిస్థితి ఏమిటని అడుగుతున్నారు.
రెండుసార్లు ప్రధానమంత్రిగా వ్యవహరిస్తూ.. తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న మోడీ ప్రాతినిధ్యం వహించే బీజేపీ సైతం దేశంలోని అన్ని లోక్ సభా స్థానాల్లో పోటీ చేసే సత్తా ఉండదని.. అలాంటప్పుడు జనసేన అధినేత పవన్ ను ఎలా సవాలు విసురుతారని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ.. పవన్ కు సవాలు విసిరితే.. అదే రీతిలో వైసీపీ నేతలు బీజేపీని సైతం ఇదే తరహాలో సవాలు విసిరే దమ్ముందా? అని ప్రశ్నిస్తున్నారు.
అందుకే.. పవన్ ను ఉద్దేశించి తొందరపడి మాటలు అనే మందు.. దాని తర్వాత ఎదురయ్యే పర్యవసానాల మాటేమిటి? అన్నది కూడా ఆలోచించాలని అడుగుతున్నారు. ఇప్పటివరకు జరిగింది పక్కన పెట్టినా.. ఎన్నికలకు టైం దగ్గరకు వచ్చిన వేళ.. జనసేనానిని టార్గెట్ చేసే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
అందుకు భిన్నంగా.. సరైన కసరత్తు లేకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే.. వాటికి లాజిక్కులతో ప్రశ్నలు ఎదురైతే మొదటికే మోసం మాదిరి పరిస్థితి ఉంటుందంటున్నారు. అందుకే.. సింగిల్ గా పోటీ దమ్ముందా? లాంటి తలనొప్పులు తెచ్చే సవాళ్లకు వైసీపీ నేతలు దూరంగా ఉంటే మంచిదన్న సూచన వినిపిస్తోంది. మరేం చేస్తారో చూడాలి.