Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురు టీడీపీ సిట్టింగ్ లకు చెక్ పెట్టేందుకు జగన్ వ్యూహం!

ముఖ్యంగా మూడు ప్రధాన స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యేలను ఓడించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని చెబుతున్నారు

By:  Tupaki Desk   |   28 Aug 2023 9:04 AM GMT
ఆ ముగ్గురు టీడీపీ సిట్టింగ్ లకు చెక్ పెట్టేందుకు జగన్ వ్యూహం!
X

2019 ఎన్నికల్లో టీడీపీని చావుదెబ్బ కొట్టి మరీ జగన్ అధికారంలోకి వచ్చారు. ఆ దెబ్బ నుంచి టీడీపీ ఇంకా కోలుకోలేదనే చెప్పాలి. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. దీంతో 2024లోనూ విజయ కేతనం ఎగురవేయాలని వైసీపీ అధినేత జగన్ పట్టుదలతో ఉన్నారు. ఈ సారి టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కకూడదనే ఉద్దేశంతో జగన్ ఉన్నారు. మొత్తం 175 స్థానాల్లోనూ వైసీపీ జెండా ఎగరేయాలనే లక్ష్యంతో జగన్ కసరత్తులు చేస్తున్నారు. అందుకే వైనాట్ 175 అనే నినాదాన్ని కూడా ఎత్తుకున్నారు. టీడీపీని పూర్తిగా ఖాళీ చేయాలనే ఉద్దేశంతో ఆ పార్టీ సిట్టింగ్ స్థానాలపై జగన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా మూడు ప్రధాన స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యేలను ఓడించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని చెబుతున్నారు. టీడీపీకి పట్టున్న కుప్పం, హిందూపురం, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ ప్రణాళికల్లో మునిగిపోయారని టాక్. ఇప్పటికే చిత్తురూ జిల్లా ఇంఛార్జీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారథ్యంలో కుప్పంలో బాబుకు చెక్ పెట్టే పని కొనసాగుతోంది. కుప్పం ఇంఛార్జీగా కేఆర్జే భరత్ కూడా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిసింది. కుప్పంలో ప్రతి ఇంటికి వెళ్తూ వైసీపీ సంక్షేమ పథకాలను ఆయన వివరిస్తున్నారు.

మరోవైపు నందమూరి బాలక్రిష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురంపై జగన్ ఫోకస్ పెట్టారు. ఈ మేరకు పెద్దిరెడ్డి తాజాగా ఈ నియోజకవర్గంలో మకాం వేశారని తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ విజయం కోసం స్థానిక నాయకులు, కార్యకర్తలకు పెద్దిరెడ్డి మార్గనిర్దేశనం చేస్తున్నారని సమాచారం. ఇక్కడ నియోజకవర్గ ఇంఛార్జీగా టీఎన్ దీపిక ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె గెలుపు కోసం పెద్దిరెడ్డి గ్రౌండు ప్రిపేర్ చేస్తున్నట్లు తెలిసింది. ఇక విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి రామక్రిష్ణబాబును ఓడించేందుకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను పోటీ చేయించాలని జగన్ చూస్తున్నట్లు తెలిసింది.