Begin typing your search above and press return to search.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మరోసారి హీట్‌ తప్పదా?

సెప్టెంబర్‌ 21 నుంచి ఐదు రోజులపాటు సమావేశాలను నిర్వహించాలని జగన్‌ ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం

By:  Tupaki Desk   |   13 Sep 2023 8:07 AM GMT
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మరోసారి హీట్‌ తప్పదా?
X

ఓవైపు దేశంలో జమిలి ఎన్నికల హడావుడి, మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో రాజకీయా పరిణామాలు వేగంగా మారిపోయిన వేళ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు తెర లేస్తోంది.

సెప్టెంబర్‌ 21 నుంచి ఐదు రోజులపాటు సమావేశాలను నిర్వహించాలని జగన్‌ ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు సంచలన నిర్ణయాలకు దారితీస్తాయనే చర్చ జరుగుతోంది. అలాగే చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా సమావేశాలు జరిగే వీలుందని టాక్‌ నడుస్తోంది.

షెడ్యూల్‌ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది వేసవిలో జరగాల్సి ఉంది. అయితే జమిలి ఎన్నికల నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు రావచ్చని అంటున్నారు. ఇందుకు సంబంధించిన బిల్లును పెట్టడానికే పార్లమెంటు ప్రత్యేకంగా సెప్టెంబర్‌ 18 నుంచి సమావేశం కానుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. పార్లమెంటు సమావేశాలు సెప్టెంబర్‌ 22న ముగియనున్నాయి. ఇదే సమయంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

జమిలి ఎన్నికలకు అనుకూలంగా పార్లమెంటు నిర్ణయం తీసుకుంటే దానిపై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారని.. ఇందుకు సంబంధించిన బిల్లులను కూడా ప్రవేశపెడతారని చెబుతున్నారు.

ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సీపీఎస్‌ స్థానంలో జీపీఎస్‌ ను ప్రవేశపెట్టింది. వీటిపైనా తాజా అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులు పెడతారని అంటున్నారు.

ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలపై సెప్టెంబర్‌ 14న ప్రభుత్వ, పార్టీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేకంగా సమావేశం కానున్నారని సమాచారం.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 21 నుంచి అయిదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అవసరాన్ని బట్టి మరో రెండు రోజులు పొడిగిస్తారని చెబుతున్నారు. ఈ సమావేశాల్లోనే చంద్రబాబు అవినీతికి సంబంధించి ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ కుంభకోణాలు, వాటిలో ఎంత ప్రజాధనాన్ని దోచుకున్నారు వంటి అంశాలపై సీఎం వైఎస్‌ జగన్‌ సభ్యులకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ సాక్షిగానే చంద్రబాబు అవినీతిని సీఎం జగన్‌ ఎండగట్టనున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య హీట్‌ ఖాయమంటున్నారు.