Begin typing your search above and press return to search.

ప్యాకేజ్ బంధం బయటపడింది... వైసీపీ నేతల కామెంట్స్ పీక్స్!

రాబోయే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కలిసే పోటీ చేస్తాయనే చర్చ ఏపీ రాజకీయాల్లో ఎప్పటినుంచో నడుస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   14 Sep 2023 11:51 AM GMT
ప్యాకేజ్ బంధం బయటపడింది... వైసీపీ నేతల కామెంట్స్ పీక్స్!
X

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు ములాకత్ లో కలిశారు. ఈయనతో పాటు వెంట బాలయ్య, లోకేష్ లు కూడా ఉన్నారు. సుమారు 40 నిమిషాలు సాగిన ఈ ములాకత్ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పొత్తుని కన్ ఫాం చేశారు.

అవును... ఎన్నికలు ఆరునెలల తర్వాత జరిగినా, రేపే జరిగినా టీడీపీ, జనసేనా కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పబ్లిక్ గా ప్రకటించారు. ఈ విషయాన్ని జనసైనికులు అర్థం చేసుకోవాలని కోరారు. దీంతో ఈ వ్యాఖ్యల అనంతరం వైసీపీ నేతలు ఎవరి స్టైల్లో వారు రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం వారి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

రాబోయే ఎన్నికల్లో టీడీపీ - జనసేన కలిసే పోటీ చేస్తాయనే చర్చ ఏపీ రాజకీయాల్లో ఎప్పటినుంచో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా జనసేన అధినేత ఈ విషయాన్ని కన్ ఫాం చేశారు. దీంతో వైసీపీ అధికార ట్విట్టర్ లో స్పందించింది. "ప్యాకేజ్ బంధం బయటపడింది" అని కామెంట్ చేసింది.

అనంతరం... "నువ్వు రాజ‌మండ్రి సెంట్రల్ జైల్‌ కి వెళ్ళింది టీడీపీతో పొత్తును ఖాయం చేసుకునేందుక‌ని ప్రజ‌ల‌కు పూర్తిగా అర్థం అయింది పవన్ కల్యాణ్. ఇన్నాళ్ళూ నీమీద న‌మ్మకం పెట్టుకున్న అభిమానుల‌కు, కాస్తో కూస్తో నిన్ను న‌మ్మిన వాళ్ళకు ఈరోజుతో భ్రమ‌లు తొల‌గించేశావు" అని తెలిపింది.

ఇదే సమయంలో... "ఇక ఇది పొత్తులకి, ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇక మిమ్మల్ని మూకుమ్మడిగా ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా సిద్ధం" అని ట్వీట్ చేస్తూ... "బేరం ఫిక్స్ - బయటపడిన ప్యాకేజీ బంధం" అని ఒక ఫోటోను పోస్ట్ చేసింది!

ఇదే క్రమంలో... ఈ రోజు చంద్రబాబుతో పవన్ ములాకత్ అంటూ వచ్చిన వార్తలపై అంబటి స్పందించారు. "ఎప్పుడో అయ్యాడు.. ఇప్పుడేముంది కొత్తగా ములాకత్" అంటూ ట్వీట్ చేశారు. ఇక చంద్రబాబుతో భేటీ అనంతరం పొత్తును కన్ ఫాం చేసిన పవన్ వ్యాఖ్యలపైనా ట్విట్టర్ లో స్పందించారు మంత్రి అంబటి రాంబాబు.

ఇందులో భాగంగా... "జనసైనికులూ ఆలోచించండి... ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడిలా లేదూ?" అని ట్వీట్ చేసిన అంబటి రాంబాబు... అనంతరం... "ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను అంటే నమ్మే పిచ్చోళ్లు ఎవరూ లేరు కల్యాణ్ బాబు!" అంటూ మరో ట్వీట్ చేశారు అంబటి రాంబాబు.

ఇదే సమయంలో... పవన్ మనసులో ఎప్పుడూ చంద్రబాబే ఉంటారంటూ స్పందించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇదే సమయంలో.. "పవన్ ఒక పొలిటీషియన్ అయితే.. ఆయనది ఒక రాజకీయ పార్టీ అయితే.. బాధ్యతగా మాట్లాడేవాడు. సినిమాల్లో డైలాగులు వేసినట్లు బయటకూడా వేస్తే జనం నవ్వుతారు. రియాలిటీకి జనం దగ్గరగా ఉన్నారు. పవన్ కల్యాణ్ రీల్‌ కి దగ్గరగా ఉన్నారు" అని కామెంట్ చేశారు.

చంద్రబాబుకు దత్తు పుత్రుడనే విషయం పవన్‌ మరోసారి రుజువు చేశాడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. దత్త తండ్రి అరెస్ట్‌ ను పవన్‌ జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అవినీతి చేసిన వ్యక్తిని సపోర్ట్‌ చేయడం సిగ్గుచేటు చర్య అని... బీజేపీతో వివాహం, టీడీపీతో కాపురం చేస్తున్నాడని ఫైరయ్యరు.

ఇదే క్రమంలో... పవన్‌ ప్యాకేజీ స్టార్‌ అని మరోసారి రుజువైందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పవన్‌ నిర్ణయం కాపులను తలదించుకునేలా చేస్తుందని, అసలు కాపులకు ద్రోహం చేసిన వ్యక్తితో పవన్‌ కలవడమేంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే షూటింగ్ లో లేదంటే బాబు కాళ్ల వద్ద మాత్రమే పవన్ ఉంటారని మండిపడ్డారు.

ఇదే క్రమంలో మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఇందులో భాగంగా... పవన్ కల్యాణ్‌ - చంద్రబాబు బంధం ఈనాటిది కాదని, 2014 నుంచి వాళ్ళిద్దరూ కలిసే ప్రయాణం చేస్తున్నారని అన్నారు. మళ్లీ కొత్తగా ఈరోజు కలిసి పోటీ చేస్తామని పవన్ చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. అందరూ కలిసి వచ్చినా 2024 ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమని స్పష్టం చేశారు.