Begin typing your search above and press return to search.

జనసేన ఉత్సాహాన్ని ఆపలేకపోతున్నారా...?

ఈ పొత్తు విషయంతో నిజానికి టీడీపీకి జోష్ తీసుకుని రావాలని టీడీపీ అధినాయకత్వం ప్లాన్ చేసింది. కానీ చిత్రంగా జనసేనలో ఉత్సాహం పొంగిపొర్లుతోంది

By:  Tupaki Desk   |   19 Sep 2023 11:28 AM GMT
జనసేన ఉత్సాహాన్ని ఆపలేకపోతున్నారా...?
X

టీడీపీతో పొత్తు ప్రకటన జనసేనలో కొత్త ఉత్సాహాన్ని కలుగచేస్తోంది. ఈ పొత్తు విషయంతో నిజానికి టీడీపీకి జోష్ తీసుకుని రావాలని టీడీపీ అధినాయకత్వం ప్లాన్ చేసింది. కానీ చిత్రంగా జనసేనలో ఉత్సాహం పొంగిపొర్లుతోంది. ఇక విజయం మనదే అనుకుంటూ ఆ పార్టీ ఆశావహులు జోరెత్తిస్తున్నారు.

ఈ ఉత్సాహం ఆనందం అంతా ఉభయ గోదావరి జిల్లాలలో ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడే జనసేనకు మంచి పట్టు ఉంది. పవన్ వారాహి యాత్రలు కూడా సూపర్ హిట్ అయింది అక్కడే. దాంతో మొత్తం 34 సీట్లు ఉన్న గోదావరి జిల్లాలలో టోటల్ గా అన్ని చోట్ల నుంచి జనసేన నుంచి ఆశావహులు పోటీకి తయారు అంటున్నారు.

అయితే టీడీపీతో పొత్తు కుదిరితే మాత్రం సగం సీట్లు అయినా జనసేనకు ఇస్తారని ప్రచారం అయితే సాగుతుంది. దాంతో ఆశావహులు పక్కాగా సీట్లు దక్కుతాయని అంచనాలు ఉన్న వారు తెగ హడావుడి చేస్తున్నారు. వారంతా ఫ్లెక్సీలు కట్టి జనసేన టీడీపీ రెండు జెండాలను ఒక్క చోట పెట్టి సందడే సందడి చేస్తున్నారు.

నిజానికి జనసేనకు ఈ జిల్లాలలో గ్రాఫ్ బాగా పెరిగింది. అయితే పొత్తులు లేకుండా పోటీకి దిగితే గెలుపు అంచుల దాకా వచ్చినా ఓటమి పలుకరిస్తుందేమో అన్న బెంగ అయితే ఉంటూ వచ్చేది. పైగా విడిగా పోటీ చేస్తే అత్యంత ఖరీదుగా 2024 ఎన్నీక్లు మారబోతున్న నేపధ్యంలో పెద్ద ఎత్తున డబ్బుని కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇక జనసేనకు గ్రాస్ రూట్ లెవెల్ దాకా పార్టీ క్యాడర్ లేదు. ఇలా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. ఈ పరిణామల క్రమంలో వారికి తీపి కబురు అధినేత పవన్ చెప్పారని అంటున్నారు. టీడీపీతో పొత్తు ఉంటే ఆ పార్టీ క్యాడర్ అంతా జనసేనకు పనిచేస్తారు. పైగా అంగబలం అర్ధ బలం విషయంలో కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు.

రెండు పార్టీలు కలిస్తే జిల్లాలో విజయావకాశాలు బాగా ఉంటాయన్న అంచనాలు కూడా ఉన్నాయి. దాంతో జనసైనికులు అయితే హుషార్ చేస్తున్నారు. గోదావరి జిల్లాలలో జనసేనకు పిఠాపురం, రాజమండ్రి రూరల్, నర్సాపురం, కాకినాడ రూరల్ రాజోలు, భీమవరం వంటి సీట్లు గ్యారంటీగా పొత్తులో భాగంగా ఇస్తారు అని అంటున్నారు.

దాంతో పాటు మరిన్ని సీట్ల మీద ఆ పార్టీ కన్ను ఉంది. తూర్పులో 19, పశ్చిమ లో 15 సీట్లు ఉంటే ఇందులో కనీసంగా 15 సీట్లు అయినా జనసేనకు దక్కుతాయని లెక్కలేసుకుంటున్నారు. దీంతో జనసేన నేతలు ఇక నెగ్గెసామన్న ధీమాతోనే ముందుకు అడుగు వేస్తున్నారు అని అంటున్నరు. ఈసారి అసెంబ్లీకి తప్పకుండా వెళ్తామన్నభరోసా కూడా వారిలో కనిపిస్తోంది.

నిజానికి టీడీపీలో కూడా ఈ జోష్ ఉండాలి. కానీ వారిని మించి జనసేనలో ఉంది అంటే పవన్ బాగానే క్యాడర్ ని లీడర్ ని ట్యూనప్ చేశారు అని అంటున్నారు. అంతే కాదు ఈసారి పొత్తుల వల్ల జనసేనలో ఏమైనా భిన్నాభిప్రాయాలు వస్తాయని అంతా అనుకున్నా అలాంటిది ఏమీ లేదు అన్నది గోదావరి జిల్లాలలో కనిపించే జనసేన క్యాడర్ ఊపు చూస్తే అర్ధం చేసుకోవచ్చు అని అంటున్నారు.