జగన్... చంద్రబాబు... పవన్ : 2024 లో సీఎం అయ్యేది ఎవరంటే....?
ఏపీలో 2024 ఎన్నికల తరువాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్నది ఒక కీలకమైన చర్చ. అందరిలోనూ ఆసక్తిని పెంచే చర్చగా ఉంది
By: Tupaki Desk | 6 Oct 2023 8:01 AM GMTఏపీలో 2024 ఎన్నికల తరువాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్నది ఒక కీలకమైన చర్చ. అందరిలోనూ ఆసక్తిని పెంచే చర్చగా ఉంది. రాజకీయంగా చూస్తే ఏపీ ఇపుడు వేడెక్కిపోయింది. ఒక వైపు చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ పొలిటికల్ హీట్ మామూలుగాలేదు. మరో వైపు చూస్తే ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు, ఏ పార్టీకి జనంలో మొగ్గు ఉంది అన్నది పెద్ద ఎత్తున సర్వేలు చేస్తూ చాలా ఏజెన్సీలు ఉన్న వేడికి మరింతంగా నిప్పు రాజేస్తున్నాయి.
ఈ నేపధ్యంలో అనేక సర్వేలు హోరా హోరీ పోరు తప్పదని కూడా సూచిస్తున్నాయి. గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితం అయిన తెలుగుదేశం పార్టీ ఈసారి ఒంటరిగా కాకుండా పొత్తులతో రానుంది. జనసేనతో పొత్తు కలిపింది. ఈ రెండు పార్టీలతో బీజేపీ చేరుతుందా లేదా అన్నది ఒక కీలకమైన పాయింట్ అయితే అసలు ఏపీలో మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ పరిణామాలు ఇలా ఉండగానే తాజాగా ఒక ప్రముఖ సంస్థ చేసిన సర్వేలో 2024 తరువాత ఏపీలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏది అంటే వైసీపీయే అని చెబుతోంది. అంతే కాదు ఏపీకి తరువాత ముఖ్యమంత్రి ఎవరు అంటే వైఎస్ జగన్ కే ఎక్కువ మంది ఓటేసి మొగ్గు చూపించడం విశేషం. ఆయన తర్వాత స్థానంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు ఇక మూడవ ప్లేస్ లో పవన్ ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ అన్నవి సోదిలోకి లేకుండా పోయాయి.
ఇక వైఎస్ జగన్ ఏపీకి 2024 తరువాత సీఎం కావాలని 46 శాతం మంది ఓటేస్తే చంద్రబాబు సీఎం గా ఉండాలని 40 శాతం మంది ఓటేశారు. ఇక జనసేన అధినేత పవన్ సీఎం గా ఉండాలని చూడాలని కేవలం తొమ్మిది శాతం మంది మాత్రమే ఓటేయడం విశేషం. ఇతరులకు రెండు శాతం మంది ఓటేస్తే తమకు ఎవరు సీఎం అవుతారో తెలియదు చెప్పలేమని మూడు శాతం మంది ఓటేయడం గమనార్హం.
మొత్తంగా చూసుకుంటే ఈ రోజుకీ ఏపీలో జగన్ వైపే జనాదరణ కనిపిస్తోంది అంటున్నారు. ఇప్పటిదాకా వచ్చిన అనేక సర్వేలు సైతం వైసీపీకే అత్యధిక స్థానాలు కట్టబెడుతూ వచ్చాయి. ఇటీవల రిలీజ్ అయిన టైమ్స్ నౌ సర్వే సైతం ఏపీలో పాతిక ఎంపీ సీట్లలో జగన్ నాయకత్వంలోని వైసీపీ 24 నుంచి 25 సీట్లను కైవశం చేసుకుంటుందని క్లీన్ స్వీప్ చేస్తుందని కూడా స్పష్టం చేసింది.
ఇదీ తీరున పలు జాతీయ సర్వేలు కూడా ఏపీలో వైసీపీ జెండాయే మళ్లీ ఎదుగుతుందని చెప్పుకొస్తున్నాయి. అయితే జనసేన టీడీపీ కూటమి బీజేపీ బ్లెస్సింగ్స్ ఉంటాయా అన్నది చూడాల్సి ఉంది. అదే విధంగా
మరో ఆరు నెలలకు పైగా ఎన్నికలకు సమయం ఉండడంతో అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమేమి మారుతాయో కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా 2024 తరువాత మళ్లీ జగనే సీఎం కావాలని 46 శాతం మంది కోరుకోవడం మాత్రం వైసీపీకి ఆనందాన్ని ఇచ్చే న్యూస్ గానే చూడాలని అంటున్నారు.