Begin typing your search above and press return to search.

ఏపీలో హంగ్ వస్తుందా...?

తెలంగాణా ఎన్నికల వేళ హంగ్ ఆశలతో కమలం పార్టీ ఒక్క లెక్కన ఊయలలూగింది అని ప్రచారం సాగింది

By:  Tupaki Desk   |   17 Dec 2023 4:52 AM GMT
ఏపీలో హంగ్ వస్తుందా...?
X

తెలంగాణా ఎన్నికల వేళ హంగ్ ఆశలతో కమలం పార్టీ ఒక్క లెక్కన ఊయలలూగింది అని ప్రచారం సాగింది. ఆ పార్టీ కీలక నేతలు సైతం హంగ్ వస్తే తాము ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషిస్తామని కూడా చెప్పుకున్నట్లుగా ప్రచారం సాగింది. అంటే బీఆర్ ఎస్ కి తక్కువ సీట్లు వచ్చి అధికారానికి జానెడు దూరంలో ఉంటే తమ పంట పండినట్లే అని బీజేపీ నేతలు భావించారని కూడా ప్రచారం సాగింది.

అయితే కాంగ్రెస్ కే జనాలు పూర్తి మెజారిటీతో పట్టం కట్టారు. మిత్ర పక్షం సీపీఐ ఒక్క సీటు కూడా కలుపుకుంటే కాంగ్రెస్ కి అరవై అయిదు సీట్లు ఉన్నట్లుగా లెక్క. మొత్తానికి తెలంగాణాలో ఏ హంగూ ఆర్భాటం లేకుండానే ఎన్నికలు ముగిసాయి.

ఇపుడు ఎపీలో మరో మూడు నెలలలో ఎన్నికలు ఉన్నాయి. ఏపీలో హంగ్ వస్తుందా అన్నది కూడా కొందరు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే అటు అధికార వైసీపీ ఢీ కొడుతోంది, ఇటు విపక్షం కూడా పోరాడుతోంది. దాంతో మొత్తం 175 సీట్లు ఉన్న ఏపీ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ దక్కాలీ అంటే ఏ పార్టీకి అయినా 88 సీట్లు రావాలి. మరి వార్ వన్ సైడ్ గా సాగితే వందకు పైగా సీట్లు ఈజీగా వస్తాయి.

అలా కాదు ప్రతీ ఒక్క సీటూ టఫ్ గా మారితే మాత్రం రిజల్ట్ ఇంటరెస్టింగ్ గానే ఉంటుంది అని అంటున్నారు. ఏపీలో హంగ్ వస్తే ఎవరికి లాభం అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏపీలో టీడీపీ వైసీపీ మాత్రమే కాదు మూడవ పార్టీగా జనసేన ఉంది. అలాగే బీజేపీ కూడా ఏపీలో పోటీ చేస్తుంది. ఈ రోజుకు జనసేనతోనే బీజేపీ ఉంది. మరి బీజేపీ ఆశలు తెలంగాణా మాదిరిగా ఏపీలో కూడా ఉంటాయని అంటున్నారు. అలాగే జనసేన కూడా హంగ్ మీద ఆశలు పెట్టుకోవచ్చు అంటున్నారు.

అదెలా అంటే మొత్తం 175 సీట్లలో జనసేనకు నలభై నుంచి యాభై సీట్లు కోరుతున్నారు. అలాగే పొత్తులోకి వస్తే బీజేపీకి ఒక పది నుంచి పదిహేను సీట్లు కోరుతారు. అంటే ఈ లెక్కన చూస్తే టీడీపీ ఏ 110 సీట్లకో పరిమితం అయి పోటీ చేయాల్సి ఉంటుంది అన్న మాట. మరి ఆ 110 సీట్లలో 88 సీట్లతో మ్యాజిక్ ఫిగర్ అన్నది సాధ్యం కాదు.

అపుడే బీజేపీ జనసేనకు ప్లస్ అవుతాయని అంటున్నారు. అందుకే సీట్ల దగ్గరే ముందు టీడీపీని కట్టడి చేసి తమకు కావాల్సిన సీట్లను ఎక్కువ నంబర్ తో ఈ పార్టీలు తీసుకోవడానికి చూస్తాయి అని అంటున్నారు. అయితే టీడీపీ అధినాయకత్వం ఏమీ అంత సులువుగా మిత్రులకు ఎక్కువ సీట్లు వదలదు అని అంటున్నారు.

తాను ఎట్టి పరిష్తితుల్లోనూ 140 సీట్లకు తగ్గకుండా పోటీ చేయడానికే టీడీపీ చూస్తుంది అని అంటున్నారు. ఇక ఆ మిగిలిన 35 సీట్లలోనే జనసేన బీజేపీలకు సర్దుబాటు చేస్తారు అని అంటున్నారు. అయితే ఇక్కడ కూడా ఒక మతలబు ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీకి కేవలం 12 సీట్లు మాత్రమే ఇచ్చి మిగిలిన 163 సీట్లలో టీడీపీ పోటీ చేస్తే ఆ పార్టీకి సొంతంగా వచ్చినవి 102 సీట్లు మాత్రమే అని అంటున్నారు. అంటే అది బొటాబొటీ మెజారిటీయే.

మరి ఇపుడు 140 సీట్లకు పోటీ చేస్తే కచ్చితంగా అది మరింత తగ్గవచ్చు అని అంటున్నారు. అంటే టీడీపీ ఏ ఎనభై సీట్ల దగ్గరో ఆగిపోతే అపుడు బీజేపీ జనసేన అవసరం పడుతుందని ఆ విధంగా పవన్ కళ్యాణ్ సీఎం కోరిక బీజేపీ అధికారం ఆశలు కూడా తీరుతాయని ఒక ప్రచారం సాగుతోంది.

అయితే చంద్రబాబు రాజకీయ చాణక్యం చాలా గొప్పది. ఆయన టీడీపీకి సింపుల్ మెజారిటీ అయినా రాకుండా సీట్ల పంపిణీ చేస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. టీడీపీ ఎట్టి పరిస్థితులలోనూ మిత్రులతో ఆధారపడకుండా సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తుంది. దానికి సరిపడా సీట్లను గెలుచుకునేందుకు గల అన్ని అవకాశాలను టీడీపీ వాడుకుంటుంది అని అంటున్నారు.

ఇక వైసీపీ చూస్తే ఒంటరి పోరుగానే సాగుతోంది. ఆ పార్టీకి కచ్చితంగా 88 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దక్కాల్సిందే. అయితే వార్ వన్ సైడ్ గానే ఉంటుందని అటు వైసీపీ ఇటు టీడీపీ విశ్వాసం వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో హంగ్ అన్న మాట ఏపీలో వినిపించకపోవచ్చు అని అంటున్నారు. 119 సీట్లు ఉన్న తెలంగాణా అసెంబ్లీలోనే ప్రజలు హంగ్ తీసుకుని రాలేదు. ఎక్కువ సీట్లు ఉన్న ఏపీలో అలాంటివి జరగవు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పైగా తమకు నచ్చిన పార్టీకి ఓట్లూ సీట్లు ఇచ్చి పారేయడం ఏపీ ప్రజలకు అలవాటు అని కూడా గుర్తు చేస్తున్నారు. సో వెయిట్ అండ్ సీ.