ఏపీలో ఎన్నికలు మొదటి దశలోనే ...!?
అయితే ఈసారి కూడా ఏపీలో మొదటి దశలో ఎన్నికలు జరుగుతాయా అన్న చర్చకు తెర లేస్తోంది. ఎందుకంటే 2019ని అంతా గుర్తు చేసుకుంటున్నారు
By: Tupaki Desk | 15 March 2024 1:27 PM GMTఏపీలో ఇపుడు ఇదే హాట్ టాపిక్ గా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా లోక్ సభకు అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 16న మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలో మీడియా సమావేశం జరగనుంది. దాంతో దేశంలో ఎన్నికలు అలాగే ఏపీలో ఎన్నికల తేదీలు మొత్తం ఈసీ వివరంగా చెబుతుంది.
అయితే ఈసారి కూడా ఏపీలో మొదటి దశలో ఎన్నికలు జరుగుతాయా అన్న చర్చకు తెరలేస్తోంది. ఎందుకంటే 2019ని అంతా గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో అంటే 2019 మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఏప్రిల్ 11న మొదటి దఫాలో ఎన్నికలు ముగిసాయి. ఆ మీదట ఏడు దశలలో ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగాయి. మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది. ఫలితాలు వచ్చాయి.
ఈసారి కూడా మొదటి దశలోనే ఎన్నికలు ఉంటాయా అన్నది అంతా చర్చించుకుంటున్నారు. ఈసారి ఎన్నికల షెడ్యూల్ ఆరు రోజులు ఆలస్యంగా వెలువడుతోంది. దాంతో ఎన్నికల తేదీలు కూడా మారుతాయని అంటున్నారు. ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చి మొదటి దశలోనే ఏపీలో ఎన్నికలు పెడితే మాత్రం టీడీపీ కూటమికి కొంత ఇబ్బంది అవుతుందని అంటున్నారు.
ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించి ఉన్నారు. ఇంకా కొన్ని క్లియర్ చేయాల్సి ఉంది. అయితే చాలా చోట్ల అగ్గి రాజుకుంటోంది. సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంది. దాంతో ఎక్కువ టైం ఉంటే కనుక ఇవన్నీ ఒక కొలిక్కి వస్తాయని అంటున్నారు. ఎంత ఎక్కువ టైం ఉంటే అంతలా విపక్షానికి మంచిది అన్నది కూడా ఒక విశ్లేషణ ఉంది.
ఎందుకంటే ప్రచారానికి ఎక్కువ సమయం ఉంటుంది. దాంతో పాటు విభేదాలు తగ్గి అంతా ఐక్యంగా ముందుకు వస్తారు. అదే విధంగా అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కో గలుగుతారు. ఇక ఎన్నికలు ఎంత ఆలస్యం అయితే అంతలా అధికార పక్షానికి ఇబ్బందులు వస్తాయని కూడా అంటున్నారు.
ఈసారి ఫిబ్రవరి నుంచే ఎండలు మండించేస్తున్నాయి. దాంతో ఏప్రిల్ మధ్యలో ఎన్నికలు ముగిస్తే ఆ మీదట ఎటు నుంచి ఎలా ఉన్నా ఫరవాలేదు, కానీ ఎన్నికలు ఎంత ఆలస్యం అయితే అంతలా వ్యతిరేకత పెరుగుతుంది. దానికి తోడు సమ్మర్ సమస్యలు కూడా ఉంటాయి. దాంతో మొదటి దశలోనే ఏపీలో ఎన్నికలు జరిగిపోవాలని సహజంగా అధికార పక్షానికి ఉంటుంది.
కానీ విపక్షాలకు మాత్రం నాలుగవ అయిదవ విడతలో ఎన్నికలు పెడితే బాగుంటుంది అన్న ఆలోచనలు ఆశలు ఉన్నాయట. అంటే మే నెల రెండవ వారంలో అన్న మాట. అప్పటికి చూసుకుంటే నికరంగా 55 రోజుల దాకా సమయం ఉంటుంది అని అంటున్నారు. అంత ఎక్కువ సమయం ఉంటే కచ్చితంగా అధికార పక్షం ఎత్తులను చిత్తు చేయగలమని అంటున్నారు.
అయితే అభ్యర్ధుల విషయంలో చూసుకుంటే అధికార విపక్ష సభ్యులు ఎవరైనా ఎన్నికలు ఎంత తొందరగా అయిపోతే అంత బాగా ఉంటుంది అని అంటున్నారు.ఎందుకంటే ఎన్నికల వ్యవధి పెరిగే కొద్దీ చేతి చమురు వదిలిపోతుంది అన్నది వారి బాధ.
మరి ఈ నెల 16న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది అందులో ఏపీలో ఎన్నికలు మొదటి దశలో పెడతారా లేక ఆ తరువాత దశలలోనా అన్నది కూడా చూడాల్సి ఉంది. అయితే ఏపీలో అసెంబ్లీకి కూడా ఎన్నికలు ఉండడం వల్ల తొలి దశలోనే పూర్తి చేసి ఇక్కడ బలగాలను వేరే చోటకు తరలిస్తారు అని అంటున్నారు. ఇదే అనవాయితీ కొనసాగుతూ వస్తోంది అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే గతసారి ఏడు దశలలో ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎనిమిది దశలలో ఎన్నికలు ఉంటాయని కూడా మరో ప్రచారం సాగుతోంది. ఎన్ని దశల పోలింగ్ అయినా కూడా మే 23 నాటికే ఫలితాలు వస్తాయని అంటున్నారు. సో ఈసీ షెడ్యూల్ కోసం ఇపుడు అంతా వెయిటింగ్.