Begin typing your search above and press return to search.

కొత్త సభలో వైసీపీని తలచుకున్నారా ?

చంద్రబాబు అయితే 11 మంది ఎమ్మెల్యేలను వైసీపీకి ఇవ్వడం దేవుడి స్క్రిప్ట్ అని తాను అనను కానీ అదే జరిగింది అన్నారు. కూటమికి వచ్చిన 164 సీట్లు మొత్తం నంబర్ కూడితే 11 వస్తుందని అన్నారు.

By:  Tupaki Desk   |   22 Jun 2024 10:57 AM GMT
కొత్త సభలో వైసీపీని తలచుకున్నారా ?
X

ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. ప్రజలకు బాధ్యులుగా ఉందామని స్పీకర్ ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా మాట్లాడారు. వారు అలా మాట్లాడుతూనే గత ప్రభుత్వం అంటూ వైసీపీని పదే పదే తలచుకోవడం విశేషం. మంత్రి అచ్చెన్నాయుడు అయితే వైసీపీ అన్న మాట కానీ ఆ పార్టీ నాయకుడి ప్రస్తావన కానీ తేవద్దు అని సభ్యులకు సూచించారు. అయినా సరే మాట్లాడిన వారు అంతా పరోక్షంగానో ప్రత్యక్షంగానో వైసీపీని తలచుకున్నారు.

చంద్రబాబు అయితే 11 మంది ఎమ్మెల్యేలను వైసీపీకి ఇవ్వడం దేవుడి స్క్రిప్ట్ అని తాను అనను కానీ అదే జరిగింది అన్నారు. కూటమికి వచ్చిన 164 సీట్లు మొత్తం నంబర్ కూడితే 11 వస్తుందని అన్నారు. అలాగే అమరావతి కోసం రైతులు చేసిన ఆందోళన 1631 రోజుల పాటు సాగిందని దాన్ని మొత్తం కూడిన 11 వస్తుందని అన్నారు. అలా ఆ తక్కువ సీట్లు ఇచ్చి ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు అని అన్నారు. ఇంత తక్కువ సీట్లు తెచ్చుకుని సభకు రాలేక పిరికిపందలా వైసీపీ పారిపోయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాము 23 సీట్లు వచ్చినా ప్రజల పక్షాన ఆనాడు గట్టిగా నిలబడ్డామని గుర్తు చేశారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విజయాన్ని మాత్రమే కాదు ఓటమిని కూడా ధైర్యంగా తీసుకోవాలని అన్నారు. వారికి అది లేదు కాబట్టే సభకు రాకుండా వెళ్ళిపోయారని విమర్శించారు. ఓటమిలో నిలబడితేనే గొప్ప అని అన్నారు.

అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్సీలు నా మైనారిటీలు అని ఎన్నికల వేళ పదే పదే మాట్లాడిన జగన్ ఇపుడు బీసీని స్పీకర్ గా చేస్తుంటే సభకు రాకుండా వెళ్ళిపోవడం చూస్తే నిజంగా బీసీల మీద ప్రేమ వారికి ఏపాటితో అర్ధం అవుతుందని అన్నారు.

జగన్ పులివెందులకు వెళ్తారో ఎక్కడికి వెళ్తారో వెళ్ళనీయండి తన పార్టీ ఎమ్మెల్యేలను అయినా సభకు పంపకపోవడం చూస్తే స్పీకర్ ఎన్నికల వేళ సభా సంప్రదాయాలను వారు అసలు పాటించలేదని అర్ధం అవుతోందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. గౌరవం ఇవ్వడం తీసుకోవడం రెండూ వైసీపీకి చేతకాదని ఆమె నిందించారు.

మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే వైసీపీ సభకు గైర్ హాజరు కావడం చెడు సంప్రదాయమని విమర్శించారు. ఇది చాలా తప్పు అని ఆయన అన్నారు. ప్రతిపక్షం సభలో ఉండాలని ఆయన అన్నారు ఇక బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అయితే ప్రతిపక్షం లేని సభ చప్పగా ఉందని మాట్లాడడంతో సభలో నవ్వులు పూసాయి.

తాను జగన్ ని ఫేస్ చేయడానికే ఎంపీగా పోటీ చేసే చాన్స్ వదులుకుని మరీ అసెంబ్లీకి వచ్చాను అని అన్నారు. జగన్ ఆయన ఎమ్మెల్యేలు ఈ ఒక్కరోజే రారా లేక అయిదేళ్ళూ రారా అన్న డౌట్ తనకు కలుగుతోందని అన్నారు. ఒకవేళ వారు రాకపోతే ప్రతిపక్ష పాత్ర తానే పోషిస్తాను అని స్పీకర్ ఆ చాన్స్ ఇవ్వాలని ఆయన కోర్డంతో సభలో మరో మారు నవ్వులు పూశాయి. మొత్తానికి సభలో వైసీపీ లేకపోయినా చాలా మంది సభ్యులు తలచుకోవడం విశేషం.

చట్ట సభలలో ప్రతిపక్షం ఉంటేనే మజా ఉంటుంది. అధికార పక్షం ఒక్కటే ఉంటే సాఫీగా సమావేశాలు సాగవచ్చు కానీ ఏదో తెలియని లోటుగానే ఉంటుంది. నిజానికీ ఇంతటి భారీ మెజారిటీతో గెలిచిన కూటమికి విపక్షం తప్పులను ఎత్తి చూపాలని ఉంటుంది. వారు సభలో ఉంటే ఇంకా గట్టిగా చెప్పేవారు. కానీ విపక్షం వైసీపీ ఆ చాన్స్ ఇవ్వకూడదని భావిస్తోంది అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు సభకు విపక్షం వస్తుందా రాదా అన్నది.