Begin typing your search above and press return to search.

ఇప్పుడున్నది ప్రజా ప్రభుత్వం... అయ్యన్న సంచలన నిర్ణయం!

అయితే... అది తన ఇంటికో, గెస్ట్ హౌస్ కో పరిమితమైతే పర్లేదు.. అసెంబ్లీకి కూడా అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   18 July 2024 8:17 AM GMT
ఇప్పుడున్నది ప్రజా ప్రభుత్వం... అయ్యన్న సంచలన నిర్ణయం!
X

విపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర ద్వారా నిత్యం ప్రజల్లో ఉన్న వైఎస్ జగన్... అధికారంలోకి వచ్చిన తర్వాత పరదాలకూ, ప్యాలెస్ లకూ పరిమితమైపోయాడనే కామెంట్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అయితే... అది తన ఇంటికో, గెస్ట్ హౌస్ కో పరిమితమైతే పర్లేదు.. అసెంబ్లీకి కూడా అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

అవును... మూడు రాజధానుల పేరు చెప్పి వైఎస్ జగన్ అమరావతి రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన సంగతి తెలిసిందే. దీంతో... అమరావతి రైతులు ఐదేళ్ల పాటు ఉద్యమించారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలంటూ నిరసన వ్యక్తం చేశారు.. పాదయాత్రలు చేశారు.. తమ నిరసన స్వరాన్ని హస్తినకు వినిపించే చర్యలకూ ఉపక్రమించారు.

ఈ సమయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వారి నిరసన కార్యక్రమాలను వీలున్నంత మేర ఎక్కడికక్కడ అణచివేసే ప్రక్రియ చేపట్టింది. ఈ నేపథ్యంలో రైతులు అసెంబ్లీని ముట్టడిస్తున్నట్లు ప్రకటించడంతో.. అప్పటి వైసీపీ ప్రభుత్వం రాత్రికి రాత్రి అసెంబ్లీకి ఉన్న రెండో గేట్ ను మూసేసింది. దానికి అడ్డంగా పటిష్టమైన గోడను కూడా కట్టేసింది.

కొత్తగా చూసినవారు అక్కడ గేటు ఉందంటే నమ్మలేని పరిస్థితి ఏర్పడేలా గోడను నిర్మించారు. ఈ సమయంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తాజాగా ఆ గోడను కూల్చేయాలని, తిరిగి రెండో గేటును పునరుద్దరించాలని అధికారులు ఆదేశించారు. దీంతో ఈ గేటు మూసేస్తూ కట్టిన గోడను అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా ఏపీ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ప్రజలు వారి వారి సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పించడం అనేది ప్రభుత్వ కనీస బాధ్యత అని.. ప్రజాస్వామ్య నిలయమైన అసెంబ్లీ గేట్లు తెరిచే ఉండాలని.. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ప్రభుత్వం అని తెలిపారు.