బీజేపీ ఫార్ములా నిజమేనా ?
వినటానికి ఈ నిష్పత్తి బాగానే ఉంటుంది కాని అంతిమంగా నష్టపోయేది టీడీపీ మాత్రమే. ఈ విషయం తెలియటంతోనే తమ్ముళ్ళంతా బీజేపీపైన మండిపోతున్నారట.
By: Tupaki Desk | 12 Feb 2024 6:00 AM GMTతెలుగుదేశంపార్టీ పొత్తు విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉడుంపట్టు పట్టినట్లు సమాచారం. తమతో పొత్తు పెట్టుకోవాలంటే తామడిగిన సీట్లు ఇవ్వాల్సిందే అని పెద్ద మెలికే పెట్టిందట. అలాగే తాము ప్రతిపాదించిన పార్ములా ప్రకారమే సీట్ల పంపకాలు జరగాలనే కండీషన్ పెట్టిందని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ కండీషన్ ఏమిటంటే 4:2:1 నిష్పత్తిలోనే సీట్ల పంపకాలు జరగాలని చెప్పిందట. ఈ నిష్పత్తి ప్రకారం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీకి నాలుగు అసెంబ్లీలు, జనసేనకు రెండు అసెంబ్లీ సీట్లు మిగిలిన ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించాలట.
వినటానికి ఈ నిష్పత్తి బాగానే ఉంటుంది కాని అంతిమంగా నష్టపోయేది టీడీపీ మాత్రమే. ఈ విషయం తెలియటంతోనే తమ్ముళ్ళంతా బీజేపీపైన మండిపోతున్నారట. నిష్పత్తి ప్రకారం సీట్ల పంపిణి జరిగితే జనసేన పోటీచేసే సీట్ల సంఖ్య 50, బీజేపీ పోటీచేసే సీట్లు 25 అవుతాయి. అంటే మిత్రపక్షాలకు 75 నియోజకవర్గాలు పోను మిగిలిన 100 నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ పోటీచేయాల్సుంటుంది. ఈ నిష్పత్తి ప్రకారం సీట్ల పంపకాలు జరిగితే టీడీపీది ఆత్మహత్యా సదృశ్యమే అని తమ్ముళ్ళు గోలపెట్టేస్తున్నారట.
ఈ విషయమై ఎలా స్పందించాలో చంద్రబాబునాయుడుకు కూడా అర్ధంకావటంలేదట. అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోవటమే చాలామంది తమ్ముళ్ళకి ఏమాత్రం ఇష్టంలేదు. అలాంటిది కొత్తగా ఈ నిష్పత్తి గోలేమిటంటు తమ్ముళ్ళల్లో అసహనం పెరిగిపోతోంది. వాస్తవానికి బీజేపీకి ఉన్న ఓటుషేర్ 1 శాతం కూడా లేదు. ఇదే సమయంలో టీడీపీ ఓటుషేర్ సుమారు 38 శాతం.
ఇంతఓటు షేరున్న టీడీపీ అసలు ఓటుషేరే లేని బీజేపీ విషయంలో ఇంతగా తగ్గి చర్చలు జరపాల్సిన అవసరం లేదని తమ్ముళ్ళు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ ప్రతిపాదించిన నిష్పత్తి ప్రకారం సీట్ల సర్దుబాటు జరిగితే మిత్రపక్షాలు ఎన్నిసీట్లలో గెలుస్తాయో తెలీదు. టీడీపీ పోటీచేయబోయే 100 సీట్లలో ఎన్ని గెలుస్తుందో తెలీదు. 100 అసెంబ్లీ సీట్లు, 13 పార్లమెంటు సీట్లకు మాత్రమే టీడీపీ పరిమితమైపోతుందని తమ్ముళ్ళలో బాగా చర్చ జరుగుతోంది. బీజేపీ ప్రతిపాదించిన నిష్పత్తి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదనే టాక్ వినబడుతోంది. మరి చివరకు చంద్రబాబు ఏమిచేస్తారో చూడాలి.