ఉచిత పథకాలపై బీజేపీ మౌనం.. ఉమ్మడి మేనిఫెస్టోపై తర్జన భర్జన..!
అయితే, ఉచిత పథకాలకు తాము వ్యతిరేకమని చెబుతున్న బీజేపీ ఏమేరకు.. వీటిని అంగీకరిస్తుందనేది ప్రధాన ప్రశ్న. మరోవైపు.. జనసేన కూడా.. వీటిపై మౌనంగానే ఉంది.
By: Tupaki Desk | 17 March 2024 6:01 AM GMTవచ్చే ఎన్నికలకు సంబంధించి పొత్తులు పెట్టుకుని ముందుకు సాగుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోపై ఇంకా ముడిపడలేదు. ఎవరికివారు మౌనంగా ఉన్నారు. దీనిపై బీజేపీ నుంచి భిన్నమైన అభిప్రాయం వ్యక్తమవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాలని భావిస్తున్న టీడీపీ.. ప్రజలకు వైసీపీ మాదిరిగా ఉచిత పథకాలు ఇవ్వాలనే వ్యూహంతో ఉంది.
ఈ క్రమంలో ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో కొన్ని పథకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. సహా అమ్మకు వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ.15000 చొప్పున ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇక, వీటికి తోడు ఇతర పథకాలు కూడా ఉచితంగా ఉన్నాయి. కానీ, ఇది ఉమ్మడి మేనిఫెస్టో కాదు. పొత్తుల కంటే ముందుగానే వీటిని ప్రకటించా రు. వీటినే ప్రజల్లోకి ఎక్కువగా తీసుకువెళ్లారు.
అయితే, ఉచిత పథకాలకు తాము వ్యతిరేకమని చెబుతున్న బీజేపీ ఏమేరకు.. వీటిని అంగీకరిస్తుందనేది ప్రధాన ప్రశ్న. మరోవైపు.. జనసేన కూడా.. వీటిపై మౌనంగానే ఉంది. తాజాగా షెడ్యూల్ కూడా విడుదల కానున్న నేపథ్యంలో మేనిఫెస్టోను కూడా రూపొందించేందుకు చంద్రబాబు ఉత్సాహంగానే ఉన్నారు. కానీ, కూటమిలో కీలక రోల్ పోషిస్తున్న బీజేపీ మాత్రం ఉచితాలకు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఎవరిక వారు మేనిఫెస్టో ప్రకటిస్తారా? అనేది కూడా ఆసక్తిగా మారింది.
ఒకవేళ ఎవరికి వారుగా మేనిఫెస్టోను ప్రకటించాల్సి వస్తే.. అది తప్పుడు సంకేతాలు ఇస్తుందనే అభిప్రా యం ఉంది. పొత్తులపైనా ఇది తీవ్ర ప్రభావం చూపించే ఛాన్స్ ఇచ్చినట్టు అయింది. అలాగని ముందుకు వెళ్లాలంటే.. జాతీయస్థాయిలో ఉచిత పథకాలకు ముఖ్యంగా రూ.15000 వంటి అమ్మకు వందనం పథకాలకు బీజేపీ వ్యతిరేకం. అంతేకాదు.. ఆర్టీసీ బస్సుల్లోమహిళలకు పూర్తి ఉచిత ప్రయాణాలకు కూడా.. బీజేపీ విముఖంగా ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టో తీసుకురావాలని అనుకుంటే.. మార్పులు చేయక తప్పదు. దీనిపై రెండు రోజుల్లోనే క్లారిటీ వస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.