Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీలో చేరిక‌లు.. ఔను.. నిజ‌మే!

రాష్ట్రంలో నియంతృత్వ ప్ర‌భుత్వం ఉంద‌ని పురందేశ్వ‌రి విమ‌ర్శించారు. అభివృద్ది వాతావరణం లేకుండా పోయిందని అన్నారు

By:  Tupaki Desk   |   12 Feb 2024 11:30 PM GMT
ఏపీ బీజేపీలో చేరిక‌లు.. ఔను.. నిజ‌మే!
X

ఏపీ బీజేపీ అంటే.. ఆ.. ఏముంది.. ఒక‌రిద్దరు నాయ‌కులు త‌ప్ప‌! అని తీసిపారేయ‌డం కామ‌న్‌. నిజ‌మే. కానీ, ఇప్పుడు తెర‌వెనుక ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ.. ఆ పార్టీలోనూ చేరిక‌లు జ‌రుగుతున్నాయి. తాజాగా ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు బీజేపీ బాట‌ప‌ట్టారు. వారికి పార్టీ ఏపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వాస్త‌వానికి పురందేశ్వ‌రికి ముందు.. త‌ర్వాత‌.. కూడా పెద్ద‌గా పార్టీలో వ‌చ్చిన మార్పులు ఏవీ లేవు. అయితే.. కేంద్రంలో మ‌రోసారి మోడీ ప్ర‌భుత్వ‌మే వ‌స్తుంద‌న్న అంచ‌నాల నేప‌థ్యంలో పారిశ్రామిక వేత్త‌లు క్యూ క‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ సంద‌ర్భంగా పురందేశ్వ‌రి మాట్లాడుతూ.. బీజేపీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. దీనికి పార్టీలో చేరుతున్న‌వారే నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. గత మూడు రోజులుగా ఆరు జిల్లాలకు చెందిన పారిశ్రామికవేత్త లు బిజెపి లో చేరేందుకు క్యూ క‌డుతున్నార‌ని తెలిపారు.

రాష్ట్రంలో నియంతృత్వ ప్ర‌బుత్వం

రాష్ట్రంలో నియంతృత్వ ప్ర‌భుత్వం ఉంద‌ని పురందేశ్వ‌రి విమ‌ర్శించారు. అభివృద్ది వాతావరణం లేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వ పనితీరులో లోపాలను ప్రస్తావిస్తే కేసులు, అరెస్టులు, అణచివేతలతో భయాందోళనలు స్రుష్టిస్తున్నారని ఆవేదన చెందారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సైతం తమవిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకున్నా... వికసిత భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా అధికారులు అవి కేంద్ర పథకాలుగా వాస్తవాలను ప్రజలకు వివరించాల్సి వచ్చిందని అన్నారు.

ఓటర్ల జాబితాలో అక్రమాలు కేవలం తిరుపతి ఉప ఎన్నికలకే పరిమితం అయ్యానుకుంటే పొరపాటేనని పురందేశ్వ‌రి అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా తమ పార్టీ నేతలు అందించిన ఫిర్యాదులపైనే ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటివరకు ఐఏఎస్ అధికారులతోపాటు పోలీసు అధికారులపైనా సస్పెన్షన్ వేటు పడిందని అన్నారు. ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే లేఖ రాశామన్నారు.

ముఖ్యమంత్రి వైనాట్ 175నినాదం వెనుక భారీ కుట్ర ఉందని పురందేశ్వరి అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి దొంగ ఓట్లు... దొంగ ఎపిక్ కార్డులు... బోగస్ ఓటర్ల జాబితాతో లబ్ధిపొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఇటీవల వైసీపీ తమ అభ్యర్ధులను ఒక చోట నుంచి మరొక చోటకు మార్పులు చేస్తోందని... అదే సమయంలో ఓటర్లను కూడా గంపగుత్తుగా ఒకచోట నుంచి మరొక చోటకు బదిలీ చేస్తున్నారని అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గెలుపొందిన విడుదల రజనిని ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్పారని... ఆమెతో పాటు 10 వేల మంది ఆమె అనుయాయుల పేర్లను కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నమోదు చేయించే ప్రక్రియ జరుగుతోందన్నారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి చేసిన సేవ, సహకారం, అభివృద్ధి గురించి ఈనెల 20 నుంచి 29 వరకు అసెంబ్లీ స్థాయిల్లో ప్రజలకు వివరించేందుకు ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ పాలన... నాయకత్వం పట్ల ఆకర్షితులై ఆరు జిల్లాల్లో పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు, ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరుతున్నారని పురందేశ్వరి తెలిపారు.

చేరిన వారు వీరే

ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి పారిశ్రామిక వేత్తలు ఏలూరు రామచంద్రారెడ్డి, కావూరి వాసు, రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పారిశ్రామిక వేత్త డాక్టర్ బాల నాగిరెడ్డి, ఐనాబత్తిన సుబ్బారావు, ఖాదర్ వలీసబ్బీ, రామచంద్రారెడ్డి , తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం ఎఎంసి మాజీ డైరెక్టర్, సర్పంచ్ కేతా అమర్ నాథ్ రెడ్డి తదితరులకు పురందేశ్వరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.