మోడీ చెప్పారు - బాబు చేశారు.. చంద్రన్న చెప్పారు.. బీజేపీ దూరం..!
తాజాగా ప్రదాని నరేంద్ర మోడీ ఆగస్టు 15ను పురస్కరించుకుని.. హర్ ఘర్ తిరంగా! పిలుపునిచ్చారు. దీనిని చంద్రబాబు అందిపుచ్చుకున్నారు.
By: Tupaki Desk | 15 Aug 2024 7:30 PM GMTరాజకీయాల్లో తగ్గడం.. నెగ్గడం తెలిసిన నాయకుడిగా చంద్రబాబుకు పేరుంది. ఎక్కడ తగ్గాలో అక్కడ ఖచ్చితంగా ఆయన తగ్గుతారు. ఎక్కడ నెగ్గాలో ఆయన ఖచ్చితంగా నెగ్గుతారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ కి దూరంగా ఉండి.. తగ్గారు. అదేసమయంలో తన రాజకీయ విరోధి ఘోర ఓటమి ద్వారా ఆయన నెగ్గారు. అలానే ఏపీలోనూ చంద్రబాబు రాజకీయాలు ఇలానే ఉన్నాయి. బీజేపీతో పొత్తుల నుంచి జనసేనతో కలిసి ప్రయాణం వరకు అనేక మెట్లు దిగారు. అధికారికంగా అనేక మెట్లు కూడా ఎక్కారు.
ఇలాంటి తెలివి.. బీజేపీ నాయకులకు కొరవడినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్కపిలుపును వారు అందిపుచ్చుకోవడం లేదు. పైగా సమాంతర రాజకీయాలు చేస్తున్నారు. వాస్తవానికి కూటమి సర్కారు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో చంద్రబాబుతో కలిసి బీజేపీ ముందుకు నడవాలి. కానీ, అలాంటి పరిస్థితిలేదు. కానీ, మరోవైపు..కేంద్రంలోని బీజేపీ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటు న్నా చంద్రబాబు మాత్రం జైకొడుతున్నారు.
తాజాగా ప్రదాని నరేంద్ర మోడీ ఆగస్టు 15ను పురస్కరించుకుని.. హర్ ఘర్ తిరంగా! పిలుపునిచ్చారు. దీనిని చంద్రబాబు అందిపుచ్చుకున్నారు. ప్రతి ఇంటిపైనా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు.. తన ఇంటిపైనా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఇదే తొలికార్యక్రమంగా పెట్టుకున్నారు. అంటే..కేంద్రంలోని బీజేపీ పాలకులు చెబుతున్నట్టు చంద్రబాబు చేశారు. కట్ చేస్తే.. రాష్ట్రంలో చంద్రబాబు ఇచ్చిన పిలుపును మాత్రం బీజేపీ నాయకులు పట్టించుకోలేదు.
అదే.. అన్న క్యాంటీన్లు. రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ప్రజలకు చేరువ చేయాలని.. పేదల ఆకలి తీర్చాలని సీఎం చంద్రబాబు సూచించారు. దీనికి గాను ప్రతిపాదనలు ఆహ్వానించారు. టీడీపీ, జనసేన పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ తమ ప్రాంతాల్లో ఎక్కడ ఎన్నిక్యాంటీన్లు కావాలో పేర్కొంటూ జాబితాలు ఇచ్చారు. కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ.. ఈ ప్రతిపాదనను అసలు పట్టించుకోలేదు. ఈ కార్యక్రమంతో మాకేంటి సంబంధం అన్నట్టుగా ఉండిపోయారు. దీంతో అసలు బీజేపీ నాయకులు ఎందుకు ఇలా చేస్తున్నారనేది ఇప్పుడు రాజకీయంగా జరుగుతున్న చర్చ.