Begin typing your search above and press return to search.

బీజేపీ పెద్దలు మద్దతుగా నిలుస్తారా...?

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం మీద ఏపీ బీజేపీ అయితే అవుట్ రేట్ గా మద్దతు ఇస్తూ ఖండించింది.

By:  Tupaki Desk   |   10 Sep 2023 3:59 AM GMT
బీజేపీ పెద్దలు మద్దతుగా నిలుస్తారా...?
X

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం మీద ఏపీ బీజేపీ అయితే అవుట్ రేట్ గా మద్దతు ఇస్తూ ఖండించింది. దగ్గుబాటి పురంధేశ్వరి అయితే అరెస్ట్ ని తప్పుపట్టారు. ఒక విధంగా ఏపీ బీజేపీ బాబు వెనక ఉన్నట్లే అనిపించేలా ఈ స్టేట్మెంట్ ఉంది.

మరి కేంద్ర బీజేపీ పెద్దలు ఈ వ్యవహారం మీద ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఇపుడు కీలకమైన చర్చగా ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో జీ 20 సదస్సు హడావుడిలో కేంద్ర బీజేపీ నాయకత్వం అంతా మునిగితేలుతోంది. మరో రెండు రోజుల వరకూ అదే హడావుడి కొనదగవచ్చు. ఆ మీదటనే వారంతా రిలాక్స్ అవుతారు. అయితే రాజకీయాల్లో ఉన్న వారి పది ముఖాలు అన్నట్లుగా ఒకే పనిలో బిజీగా ఉండిపోరు. మొత్తం లోకంలో ఏమేమి జరుగుతుంది అన్నది కూడా ఎప్పటికపుడు సమాచారం అయితే వెళ్తుంది.

అలా కనుక చూసుకుంటే బాబు అరెస్ట్ వ్యవహారం కేంద్ర బీజేపీ పెద్దలకు పూర్తి వివరాలతో తెలిసి ఉంటుంది. అయితే జాతీయ బీజేపీ నాయకులు నుంచి ఎలాంటి రియాక్షన్ అయితే ఇప్పటిదాకా లేదు. మరో వైపు ఇండియా కూటమి నేతలు మాత్రం బాబు అరెస్ట్ ని తప్పుపట్టారు. ఆయన అరెస్ట్ ప్రజాస్వామ్యానికి చేటు అని కూడా అంటున్నారు.

సరిగ్గా ఇక్కడే జాతీయ బీజేపీ నాయకత్వం వైపు అందరి చూపూ ఉంది. ఏపీ రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినా అది సొంత స్టేట్ వ్యవహారంగా ఉంటుంది. కానీ జాతీయ స్థాయిలో బీజేపీకి పోటీగా కూటమి కడుతున్న ఇండియా నేతలు ఇపుడు బాబుకు బాసటగా నిలవడం అంటే అది బీజేపీ మీద వత్తిడి పెంచడమే అంటున్నారు.

బాబు బీజేపీతోనే చెలిమి అని అంటున్నారు. ఆ దిశగానే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో నాటికి పొత్తులు కుదరకపోతాయా అన్న ఆశతో బాబు ఉన్నారు. మరి అలాంటి టైం లో బీజేపీ జాతీయ నాయకత్వానికి నిజంగా ఏపీలో బాబుతో అవసరం ఉంటే కనుక కచ్చితంగా ఆ వైపు నుంచి కూడా సానుకూలత కనిపిస్తుంది.

మరి బాబు అరెస్ట్ అయి ఇరవై నాలుగు గంటలు గడచినా ఆ వైపుగా పాజిటివ్ రియాక్షన్ లేదు అంటే అది ఎలా చూడాలి అన్నది ఒక చర్చ అయితే ఇండియా కూటమి మద్దతుతో రేపటి రోజున బాబు ఏమైనా తన ఆలోచనలు వ్యూహాలు వేరే విధంగా మార్చుకుంటారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మొత్తానికి చూస్తే బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం మౌనంగా ఉండడమే ఆసక్తిని రేపుతోంది. బహుశా ఇది ఏపీ రాజకీయాలలో దేశ రాజకీయాలలో కీలక మలుపునకు నాంది పలుకుతుందా అన్న ఆలోచనలూ రేగుతున్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో. బాబు రూట్ ఏ వైపునకు తిరుగుతుందో.