Begin typing your search above and press return to search.

ఏపీలో బీజేపీ విజన్... ఫుల్ కన్ఫ్యూజన్ ..!

ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఏమి చేయాలి అన్నది బీజేపీలో చర్చగా ఉంది. ఏపీ బీజేపీ నేతలు అయితే పొత్తుల కోసం చూస్తున్నారు

By:  Tupaki Desk   |   19 Nov 2023 5:56 AM GMT
ఏపీలో బీజేపీ  విజన్... ఫుల్ కన్ఫ్యూజన్ ..!
X

ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఏమి చేయాలి అన్నది బీజేపీలో చర్చగా ఉంది. ఏపీ బీజేపీ నేతలు అయితే పొత్తుల కోసం చూస్తున్నారు. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి అయితే టీడీపీతో పొత్తుకు సుముఖంగా ఉన్నారు అని ప్రచారం సాగుతోంది. ఏది ఎలా ఉన్నా కేంద్ర బీజేపీ నాయకత్వానిదే తుది నిర్ణయం అని అంటున్నారు.

ఇదిలా ఉంటే కేంద్ర బీజేపీ నాయకత్వం టీడీపీ విషయంలో ఏమి ఆలోచిస్తోంది అంటే తెలంగాణా ఎన్నికల సందర్భంగా కొంత విషయం బయటపడింది అని విశ్లేషణలు ఉన్నాయి. తెలంగాణాలో టీడీపీతో జనసేనతో పొత్తు పెట్టుకుని బీజేపీ పోటీ చేసి ఉంటే ఆ కధ వేరుగా ఉండేది అని అంటున్నారు.

ఎందుకంటే బీజేపీకి గ్రేటర్ హైదరాబాద్, నిజమాబాద్, కరీం నగర్ వంటి చోట్ల బలం ఉంది. అలాగే తెలుగుదేశానికి కూడా గ్రేటర్ హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి వంటి చోట్ల బలం ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి జనంలో ఫాలోయింగ్ ఉంది. గ్లామర్ ఫుల్ గా ఉంది. ఆయన క్రౌడ్ పుల్లర్ గా ముందుకు వస్తే ఈ కూటమి చాలా జోరు చేసి ఉండేది అన్న భావన అయితే ఉంది.

మొదట అయితే అంతా అలాగే అనుకున్నారు. ఏపీ ఎన్నికలలో పొత్తులను తెలంగాణా ఎన్నికలు తేలుస్తాయని భావించారు. కానీ బీజేపీ మాత్రం ఒక్క జనసేననే తనతో కలుపుకుంది. దాని కంటే ముందు ఢిల్లీకి కూడా ఎన్డీయే మీటింగ్ కోసం పవన్ కే ఆహ్వానం పంపించారు. ఇక ఈ ఏడాది మొదట్లో చంద్రబాబు అమిత్ షాతో భేటీ అయ్యారు అన్న సమాచారమూ ఉంది.

ఆ భేటీలో ఏమి చర్చించారో తెలియదు కానీ మళ్లీ బీజేపీ ఊసు టీడీపీ ఎత్తలేదు, టీడీపీ గురించి కేంద్ర బీజేపీ నాయకత్వం ఆలోచించలేదు. దీంతో ఈ రెండు పార్టీలు ఇపుడు ఏపీలో కలుస్తాయా అన్నది కూడా పెద్ద చర్చగా ఉంది. తెలంగాణాలో బీజేపీకి మద్దతు ఇచ్చి పొత్తు కలుపుకుంటే ఏపీలో కూడా చాలా సులువుగా పొత్తు కలపవచ్చు అన్నది టీడీపీ అధినాయకత్వం ఆలోచన చేసింది అని అంటున్నారు.

కానీ తెలంగాణాలో కమలనాధులు ఆలోచనలు వేరే విధంగా ఉండడంతోనే టీడీపీ సైలెంట్ అయిపోయి కాంగ్రెస్ కి ఇండైరెక్ట్ గా మద్దతు ప్రకటించింది అని అంటున్నారు. అంటే టీడీపీ ప్లాన్ బీని అమలు చేసే యోచనలో ఉంది అని అంటున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే తెలంగాణా ఎన్నికలు ఆ పార్టీకి చాలా ముఖ్యం. కొద్ది నెలల క్రితం వరకూ కూడా బీజేపీ గెలుస్తుంది అన్న ఊపు ఉండేది.

కర్నాటక ఎన్నికల తరువాత అది కాస్తా తగ్గినా కనీసం డబుల్ డిజిట్ నంబర్ తో సీట్లను గెలుచుకుని ఒక ఫోర్స్ గా తెలంగాణాలో బీజేపీ ఎదగాలీ అంటే టీడీపీతో పొత్తు ఎంతో మేలు చేసేది అని అంటున్నారు. కానీ తన తెలంగాణా ఎదుగుగల కలలను కూడా ఆపేసుకుని మరీ టీడీపీని దూరంగా బీజేపీ పెట్టింది అంటే ఇక ఏపీలో అసలు ఈ రెండు పార్టీలూ కలిసే అవకాశాలు లేవు అనే అంటున్నారు.

మరో వైపు చూస్తే ఏపీలో జనసేన టీడీపీతో పొత్తు కలిపింది. దీని వెనక టీడీపీ పక్కా ప్లాన్ ఉంది. బీజేపీకి అనివార్యమైన పరిస్థితిని కల్పించడమే ఆ ప్లాన్ అని అంటున్నారు. ఇక పవన్ ని తెలంగాణాలో తమ వైపునకు తిప్పుకున్నంత సులువు కాదు ఏపీలో టీడీపీ నుంచి జనసేనను వేరు చేయడం అని అంటున్నారు.

రేపటి రోజున ఏపీ కార్యక్షేత్రంగా ముందుకు సాగాలని చూస్తున్న పవన్ కళ్యాణ్ కి బీజేపీ కంటే టీడీపీయే అక్కడ ముఖ్యం. అందువల్ల బీజేపీ టీడీపీతో పొత్తునకు కలసి రాకపోతే మాత్రం జనసేన బీజేపీని వదిలేసుకుంటుంది అని కూడా ప్రచారం సాగుతోంది. మరి జనసేననూ వదిలేసి టీడీపీని పక్కన పెట్టి బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే 2019 నాటి ఫలితాలే వస్తాయని అంటున్నారు.

అంతే కాదు బీజేపీలో ఉన్న చాలా మంది నాయకులు వలస వచ్చిన వారూ కూడా ఆ పార్టీకి గుడ్ బై కొట్టేసే ప్రమాదం ఉంది అని అంటున్నారు. అంటే చంద్రబాబుతో పొత్తులకు టీడీపీ సిద్ధం కావాల్సిందే అని బీజేపీలో ఒక వర్గం భావిస్తోంది. ఒక వేళ బీజేపీ ముందుకు వచ్చినా చంద్రబాబు ఈ టైం లో కమలంతో దోస్తీకి రెడీ అవుతారా అన్నది మరో చర్చగా ఉంది.

ఎందుకంటే రేపటి రోజున అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం జాతీయ రాజకీయ ముఖ్య చిత్రం విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. కాంగ్రెస్ ఎక్కువ రాష్ట్రాలు గెలిస్తే ఇండియా కూటమికి విజయావకాశాలు పెరుగుతాయి. దాంతో బాబు ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతారా అన్నది కూడా చర్చకు వస్తోంది.

ఏది ఏమైనా ఏపీ విషయంలో బీజేపీ ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉందనే అంటున్నారు. విజన్ మాట దేముడెరుగు అసలు పెత్తులు ఎవరితో ఉంటాయి. పొత్తుల కధ ఎలా సాగుతుంది, గందరగోళం వీడుతుందా అన్నది ఇప్పటికైతే ప్రశ్నలుగానే ఉన్నాయని అంటున్నారు.