బొటా బొటీ వస్తే బీజేపీ కీలకం అవుతుందా ?
ఏపీలో ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు వచ్చేందుకు సుదీర్ఘ నిరీక్షణ చేయక తప్పని పరిస్థితి. జూన్ 4 వరకూ అంతా వెయిట్ చేయాల్సిందే
By: Tupaki Desk | 16 May 2024 1:44 PM GMTఏపీలో ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు వచ్చేందుకు సుదీర్ఘ నిరీక్షణ చేయక తప్పని పరిస్థితి. జూన్ 4 వరకూ అంతా వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ లోగా చాలా హంగామా సాగుతోంది. ఎవరు గెలుస్తారు. ఎవరు ఓడుతారు అన్న దాని మీద పొలిటికల్ పండిట్స్ తమకు ఉన్న టాలెంట్ ని బయటకు తీస్తున్నారు.
ఏకపక్షంగా ఓటర్లు ఒకే పార్టీని ఎన్నుకుంటారు అని కొందరు అంటూంటే అలా కాదు ఓడినా బలమైన ప్రతిపక్షంగా ఒక పార్టీ ఉంటుందని అదే గెలిచిన పక్షానికి బొటా బొటీ మెజారిటీ మాత్రమే దక్కుతుందని అంటున్నారు.
మరో వైపు చూస్తే 2014లో వైసీపీ ఓడినా 67 సీట్లతో బలమైన పక్షంగా అవతరించింది. ఆ ఎన్నికల్లో 102 సీట్లలో సోలోగా టీడీపీ గెలిచింది. ఈసారి వైసీపీ గెలిచినా వంద సీట్ల నుంచి 110 మాత్రమే వస్తాయని అదే టీడీపీ కూటమికి అన్నే సీట్లు రావచ్చు అని అంటున్నారు.
మరీ పోరు భీకరంగా ఉంటే మాత్రం తొంబై నుంచి తొంబై అయిదు కూడా రావచ్చు అని మరో నంబర్ చెబుతున్నారు. ఇక్కడే రాజకీయ కుతూహలం అందరిలో మొదలవుతోంది. అతి తక్కువ నంబర్ తో వైసీపీ కానీ కూటమి కానీ గద్దెనెక్కితే ఏపీ రాజకీయం సాఫీగా సాగుతుందా అన్నదే ఇక్కడ చర్చ. ఏపీలో ఎవరు అధికారం చేపట్టాలన్నా కావాల్సిన సీట్లు 88. దీనిని మ్యాజిక్ ఫిగర్ అని అంటారు.
ఈ నంబర్ కంటే ఒకటి రెండు సీట్లు మాత్రమే ఎక్కువగా తెచ్చుకుని జస్ట్ 90తో అటు కూటమి కానీ ఇటు వైసీపీ కానీ గెలిస్తే అవతల పక్షానికి 85 దాకా సీట్లు వస్తాయి. అంటే అధికారానికి విపక్షం మూడు సీట్లకు దూరంగా ఉంటే రెండు సీట్లతో అధికారం మరో పక్షం వశం అవుతుంది అన్న మాట.
ఇది ఊహించుకుంటేనే భయం వేసే పరిస్థితి. కానీ ఏపీలో ఎన్నికలు జరిగిన తీరూ ఏ పక్షమూ తాము తగ్గకపోవడం రెండు వైపులా ఉన్న ప్లస్ అండ్ మైనస్ ఇలా చాలా సమీకరణలు చూస్తే కనుక ఏపీ రాజకీయం నిలువునా చీలిపోయింది. అలాగే సామాజికపరంగా చీలిపోయింది. దాంతో ఫలితాలు కూడా వాటిని ప్రతిబింబించేలా సీట్లు ఇలా చీలిపోతే మాత్రం ఏపీలో పాలన చాలా కష్టం అవుతుంది.
అయితే ఏపీ రాజకీయాల్లో ఎన్నాళ్ళుగానో తన వంతు పాత్ర పోషించాలని చూస్తూ వస్తున్న బీజేపీకి ఇది సువర్ణ అవకాశంగా మారుతుందని కూడా అంటున్నారు. టీడీపీ కూటమిలో బీజేపీ ఉంది. ఒకవేళ కూటమి 90 సీట్లతో అధికారంలోకి వస్తే మాత్రం విపక్షంలోని వైసీపీని చీల్చి అయినా ఏపీ రాజకీయాల్లో ఏక్ నాధ్ షిండేలను తయారు చేసి మరీ కొద్ది కాలానికే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా చేయవచ్చు అన్న చర్చ కూడా సాగుతోంది.
అదే విధంగా వైసీపీ బొటా బొటీతో అధికారంలోకి వస్తే టీడీపీలోని వారిని తన వైపు తిప్పుకుని ఆ మీదట వైసీపీని ఇబ్బంది పెట్టి ఏదో ఒక సమయంలో అధికారం బీజేపీ పొందినా పొందవచ్చు అన్నది మరో ప్రచారంగా ఉంది. ఏది ఏమైనా ఏపీలో బీజేపీ పాత్ర బహు స్వల్పం. కానీ ఆ పార్టీకి బొటా బొటీ మెజారిటీలు మాత్రం కావాల్సినంత చాన్స్ ఇచ్చేలా ఉంటాయని అంటున్నారు.
అయితే ఏపీ ప్రజలు విజ్ఞులు కాబట్టి ఏ ఒక్క పార్టీకి అయినా కనీసంగా 120 నుంచి 130 సీట్ల దాకా ఇస్తేనే పాలన సాఫీగా అయిదేళ్ళ పాటు సజావుగా సాగుతుందని అంటున్నారు. ఏపీలో మే 13న జరిగిన పోలింగ్ తీరు చూస్తే భారీగానే సాగింది. సైలెంట్ వేవ్ అయితే కనిపించింది. అది అటు వైసీపీకి అయినా ఇటు టీడీపీ కూటమికి అయినా భారీ సీట్లకు కట్టబెట్టే దిశగానే సాగుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఫలితాలు వచ్చేంతవరకూ ఇలాంటి ప్రచారాలు లెక్కలు ఇంకా చాలానే వస్తాయని చెప్పకతప్పదు.