Begin typing your search above and press return to search.

వైఎస్సార్ కాదు ఎన్టీఆర్... ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలివే!

ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం మొట్టమొదటి మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరిగింది.

By:  Tupaki Desk   |   24 Jun 2024 11:19 AM GMT
వైఎస్సార్  కాదు ఎన్టీఆర్... ఏపీ క్యాబినెట్  కీలక నిర్ణయాలివే!
X

ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం మొట్టమొదటి మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ మంత్రివర్గ సమావేశం సుమారు మూడున్నర గంటల పాటు కొనసాగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకున్న అనంతరం చేసిన ఐదు సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

అవును... చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా చంద్రబాబు చేసిన ఐదు సంతకాలకూ ఆమోదం తెలపింది. ఇందులో భాగంగా... ప్రధానంగా సీఎంగా చంద్రబాబు తొలిసంతకం, మంత్రిగా లోకేష్ తొలిసంతకం చేసిన మెగా డీఎస్సీ అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 16,347 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు.

ఈ మేరకు డీఎసీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు క్యాబినెట్ ముందు ఉంచారు. ఇందులో భాగంగా జూలై 1 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమై డిసెంబర్ 10లోపు ప్రకటించిన అన్ని పోస్టులనూ భర్తీ చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఇదే సమయంలో... ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ రూ.4000 కు పెంపు నిర్ణయానికీ ఆమోదం తెలిపారు.

దీని కింద ఇచ్చే మొత్తాన్ని జూలై ఒకటో తేదీ నుంచి ఇంటివద్దే అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత మూడు నెలలు కలిపి జూలైలో రూ.7000 పెన్షన్ ఇవ్వనున్నారు. ఆగస్టు నుంచి యథావిధిగా నాలుగు వేల రూపాయలు ఇవ్వనున్నారు! అదేవిధంగా... అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఇదే క్రమంలో డాక్టర్ వైఎస్సార్ వైద్య ఆరోగ్య వర్శిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించాలని... ఇకపై "ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య వర్సిటీ"గానే ఉండాలని కేబినెట్ నిర్ణయించింది. ఇదే సమయంలో... ఏపీలో ప్రధాన సమస్యల్లో ఒకటిగా ఉన్న గంజాయి నివారణకు హోంమంత్రి అనిత సారథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఇదే సమయంలో ప్రధానంగా... 6 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... అమరావతి, పోలవరం, మద్యం, విద్యుత్, పర్యావరణం, ఆర్థిక పరిస్థితి, శాంతి భద్రతలు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు.