కీలక అంశాలు లేకుండానే ముగిసిన ఏపీ ప్రచారం !
అభ్యర్ధులు అంతా మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా అదే టెంపో కొనసాగించడానికి నానా ఇబ్బందులు పడ్డారని అంటున్నారు.
By: Tupaki Desk | 11 May 2024 5:13 PM GMTఏపీలో ఈసారి దాదాపుగా రెండు నెలల పాటు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం సాగింది. అభ్యర్ధుల జేబులకు చిల్లు అన్నట్లుగా ప్రచారం అదే తీరున సాగిపోయింది. అభ్యర్ధులు అంతా మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా అదే టెంపో కొనసాగించడానికి నానా ఇబ్బందులు పడ్డారని అంటున్నారు.
ఇక ఏపీలో మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అలాగే మరో రెండు జాతీయ పార్టీలు కీకలంగా ఉన్నామని ముందుకు వచ్చాయి. ఇందులో ఏపీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అర్ధవంతమైన చర్చ అన్నది జరిగిందా అంటే నిరాశ మాత్రమే వస్తుంది. ఏపీ 2014లో విడిపోయింది. ఆనాడు చాలా హామీలు ఏపీకి ఇచ్చారు. విభజన హామీలు అని వాటికి పేరు.
అలాగే పోలవరం రాజధాని ప్రత్యేక హోదా వంటి అతి ముఖ్యమైన అంశాలు అన్నీ ఏపీలో 2014 ఎన్నికల్లో కీలకమైన పాత్ర పోషించాయి. కానీ అదే 2019 నాటికి చూస్తే ప్రత్యేక హోదా చుట్టూ ఎక్కువగా ఏపీలఒ రాజకీయం సాగింది. మధ్యలో కొంత పోలవరం కూడా జత కలసింది.
ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం వీటి ఊసే పెద్దగా లేదు. ఏపీలో సంక్షేమ పధకాల గురించే చర్చ అంతా తిప్పారు. ఎవరు ఎక్కువ ఉచిత పధకాలు ఇస్తున్నారు అన్న దాని మీదనే వైసీపీ టీడీపీ మళ్ళించారు. ఇలా ఏపీలో తాత్కాలిక తాయిలాల మీద ఓట్ల పంట పండించుకునే అంశాల మీదనే చర్చ సాగింది తప్ప ముఖ్యమైన వాటి విషయం కాదు అని అంటున్నారు.
ఆఖరుకు రెండేళ్ళ క్రితం హోరెత్తించినీ మూడు రాజధానులు వర్సెస్ అమరావతి ఇష్యూగా కూడా ఎన్నికలు సాగలేదు. దానికి ప్రధాన అజెండా చేసుకుని ముందుకు సాగడానికి రాజకీయ పార్టీలు పెద్దగా అసక్తిని చూపించలేదు అని అర్ధం అవుతోంది. దాంతో దానికి కొన్ని మాటలకే కొన్ని సందర్భాలకే పరిమితం చేసారు అని చెప్పాలి.
ఇక ఏపీలో ఏ ఒక్క అంశం మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ సాగింది అన్నది కూడా చూస్తే కనిపించదు. ప్రతీ కొద్ది రోజులకూ మరో కొత్త అంశం అన్నట్లుగా ఈసారి ప్రచారం సాగింది. ఏప్రిల్ మే నెలలలో మొదట్లో వాలంటీర్లు వ్యవస్థ మీద రచ్చ సాగింది. దానిని కొనసాగింపు రద్దు వంటి వాటి మీదనే అటూ ఇటూ రాజకీయ పక్షాలు రాద్ధాంతం చేస్తూ వచ్చాయి.
ఇక మే నెలలో చూస్తే ఉన్నట్లుండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న అంశం మీద ఒక విధంగా చర్చ సాగింది. అది కాస్తా రచ్చ అయ్యేసరికి వైసీపీ వైపు నుంచి తిప్పికొట్టడం జరిగింది. అయితే ఇవన్నీ భావోద్వేగాలను రేపడానికో లేక తాత్కాలిక ప్రయోజాలకో ఉద్దేశించిన అంశాలుగానే చూస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రం పడనంత ఇబ్బందిలో ఏపీ ఉంది.
దానికి సంబంధించిన అభివృద్ధి కానీ అలాగే ఏపీకి రానున్న అయిదేళ్లలో డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ ని ప్రకటించి దాని మీద బిగ్ డిస్కషన్ కానీ ఎసారి జరగలేదు అని మేధావులు అంటున్నారు. అలాగే ఏపీలో రీజియన్స్ వారీగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా పెద్దగా టచ్ చేయలేదు అని అంటున్నారు. దీని వల్ల ప్రజలకే అంతిమంగా నష్టం అన్న భావన అయితే ఉంది.