Begin typing your search above and press return to search.

కమ్మ ప్లస్ కాపు... అద్భుతం సృష్టిస్తుందా ?

ఏపీ అంటేనే కులాల సంకుల సమరం. అది ఈనాటిది కాదు, స్వాతంత్ర్యం కాలం నుంచి ఉంది

By:  Tupaki Desk   |   19 May 2024 4:30 PM GMT
కమ్మ ప్లస్ కాపు... అద్భుతం సృష్టిస్తుందా ?
X

ఏపీ అంటేనే కులాల సంకుల సమరం. అది ఈనాటిది కాదు, స్వాతంత్ర్యం కాలం నుంచి ఉంది. ఇంకా చెప్పాలీ అంటే ఉమ్మడి మద్రాస్ స్టేట్ నుంచి ఆంధ్ర రాష్ట్ర విడిపోయినప్పటి నాటికి ఇంకా ఎక్కువగా ఉంది. కమ్మ వారు రెడ్లు మధ్య రాజకీయ విభజన స్పష్టంగా ఆనాటి నుంచే ఉంది. మిగిలిన కులాలను తమకు అనుకూలంగా చేసుకుని రెడ్లు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉమ్మడి ఏపీని మూడున్నర దశాబ్దాల పాటు నిరాటంకంగా పాలించారు.

ఇక రెడ్ల ఆధిపత్యానికి విసిగి కమ్మలు 1983లో టీడీపీ ద్వారా సొంత రాజకీయ అస్థిత్వాన్ని సాధించారు. అలా గత నలభై ఏళ్ళుగా కమ్మ రెడ్డిల మధ్య ఏపీ రాజకీయం నిలువునా చీలిపోయింది. ఇక ఏపీలో మిగిలిన ప్రభావవంతమైన సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి.

వాటి జనాభా కూడా అత్యధికం. కానీ అవి రాజ్యాధికారాన్ని ఏనాడూ అందుకో లేకపోవడానికి కారణం ఈ రెండు అగ్ర కులాల దూకుడు రాజకీయం, అంగబలం, అర్ధబలం తో చేసే వ్యూహాలే అన్నది ఒక విశ్లేషణ గా ఉంది. ఇక కాపులకు రాజ్యాధికారం కోరిక కమ్మల తరువాత ఏర్పడింది. అది పురుడు పోసుకుని 1986 ప్రాంతానికి ఒక రూపునకు దిద్దుకునే నేపధ్యంలో వంగవీటి రంగా సహా కీలక నేతలు ఎంతో మంది నాడు కేంద్ర బిందువుగా నిలిచారు.

కాపుల నుంచి ఎక్కువ ఆరాధన రంగాకే దక్కింది. ఆయన తొలిసారి కాపునాడు సభలు పెట్టు ఏపీతో పాటు తెలంగాణాలోనూ ఒక బలమైన సామాజిక వర్గానికి ఆశాదీపం గా మారారు. ఆయనను 1988లో దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత నుంచి కాపులలో ఆ కోరిక అలా కొనసాగుతూనే వస్తోంది.

ఈ మధ్యలో ఎంతో మంది కాపులకు సారధ్యం వహించాలని ప్రయత్నాలు చేశారు కానీ సామాజికపరమైన బలాలకు తోడుగా రాజకీయ సమీకరణలు నిలవకపోవడంతో అవి కొంత వరకే సక్సెస్ అయ్యాయని చెప్పక తప్పదు. ఇక మొదట్లో కాంగ్రెస్ లో అన్ని సామాజిక వర్గాలు పనిచేశాయి. అయితే కమ్మలు రాజకీయ అస్తిత్వం బలంగా చాటుకున్నాక కాపులు కూడా జనాభా పరంగా అత్యధిక శాతం ఉన్న తామెందుకు ముందు వరసలోకి రాకూడదు అన్న చర్చను బయటకు తెచ్చాయి.

ఇక చూస్తే కాపులు ఎపుడూ రాజకీయంగా కాంగ్రెస్ తోనే కొనసాగడాన్ని కూడా ఉమ్మడి ఏపీ నుంచి గమనించవచ్చు. దానికి కారణం కోస్తాలో ఉన్న సామాజిక పరిస్థితులు అని కూడా చెప్పాలి. కమ్మ వర్సెస్ కాపుగా చాలా జిల్లాలలో పరిస్థితులు ఉండడం కూడా వారు కాంగ్రెస్ తో ప్రయాణించడానికి కారణం అని అంటారు. కమ్మలకు తెలుగుదేశం అండగా ఉంటే కాపులకు కాంగ్రెస్ ఆలంబన అయింది. కాపులు టీడీపీ ఆవిర్భవించాక ఒకటి రెండు సందర్భాలలో తప్ప ఎపుడూ పెద్దగా మద్దతు పలికిన నేపధ్యం కూడా లేదు.

అది ఎన్టీయార్ టీడీపీ పెట్టిన మొదట్లో అలాగే విభజన ఏపీలో చంద్రబాబుకు 2014లో కాపులు ఒక పెద్ద సెక్షన్ మద్దతుగా నిలిచారు. ఈ మధ్యలో జరిగిన అనేక ఎన్నికల్లో సైతం వారు కాంగ్రెస్ వైపే ఉంటూ వచ్చారు. ఇక 2019లో కూడా కాపులు వైసీపీకే మద్దతు ఇచ్చిన సంగతి గుర్తు చేసుకోవాలి. అలా సామాజికపరంగా చీలిన కమ్మ కాపులను కలిపే ప్రయత్నం అయితే 2024 ఎన్నికల్లో జరిగింది.

దానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పక తప్పదు. ఆయన ఏపీలో సామాజికపరంగా కొత్త కాంబినేషన్ ని ముందుకు తెచ్చారు. కమ్మ కాపుల కాంబోతో ఏపీలో వైసీపీని గద్దె దించవచ్చు అన్నది ఆయన రాజకీయ వ్యూహం. ఇదే వ్యూహం చంద్రబాబుకూ ఉంది. దాని ఫలితంగా మరోసారి కాపులు టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపారు అన్నది పోలింగ్ అనంతరం వస్తున్న ఒక విశ్లేషణ.

అది గోదావరి జిల్లాలతో పాటు క్రిష్ణా గుంటూరు దాకా ప్రభావం చూపించిందని ఉత్తరాంధ్రాలో విశాఖ వంటి చోట్ల కూడా రాజకీయ సమీకరణలను మార్చిందని ఒక చర్చగా ఉంది. కమ్మ ప్లస్ కాపు ప్లస్ ఇతర వర్గాలు అన్నది టీడీపీ కూటమి వెనక ఉన్న సామాజికపరమైన పునాదిగా అంటున్నారు.

వైసీపీకి సంప్రదాయ సెక్షన్లు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఆ పార్టీకి గట్టిగా సపోర్టర్లుగా ఉంటూ వస్తున్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలను కూడా తమ వైపు తిప్పుకోవానికి ప్రయత్నాలు చేసింది. అలా టీడీపీకి ఆది నుంచి వస్తున్న బీసీ ఓటు బ్యాంకుకి చిల్లు పెట్టింది.

ఇక ఇపుడు చూస్తే కనుక ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలలో కాపులతో పాటు బీసీలు కూడా అత్యధికంగా ఉంటారు. ఇందులో ఎవరి వాటా ఎంత తీసుకున్నారు అన్నదే రేపటి ఎన్నికల ఫలితాలను నిర్ణయించే అంశగా ఉంది. మెజారిటీ కాపులు టీడీపీ కూటమికి జై కొట్టినట్లుగా పోలింగ్ సరళి తెలియచేస్తున్న నేపధ్యంలో మెజారిటీ బీసీలు ఎంటు ఉన్నారు అన్న దానిని బట్టే రేపటి అధికారం ఎవరి చేతిలోకి వెళ్తుంది అన్నది తేలనుంది. కమ్మ ప్లస్ కాపులకు బీసీలలో మెజారిటీ తోడు అయితే ఏపీలో సరికొత్త సామాజిక ముఖ చిత్రం ఆవిష్కృతం అవుతుంది అన్నది రాజకీయ విశ్లెషణగా ఉంది.