Begin typing your search above and press return to search.

ఏపీలో చంద్రబాబు ఫ్యూచర్ స్టెప్ !

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి మహామహులైన సీనియర్లకు చంద్రబాబు క్యాబినెట్ లో స్థానం లభించలేదు

By:  Tupaki Desk   |   14 Jun 2024 4:23 PM GMT
ఏపీలో చంద్రబాబు ఫ్యూచర్ స్టెప్ !
X

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి మహామహులైన సీనియర్లకు చంద్రబాబు క్యాబినెట్ లో స్థానం లభించలేదు. మూడు నెలల క్రితం పార్టీలోకి వచ్చిన వారికి మంత్రివర్గంలో స్థానం లభించింది. కానీ నాలుగు దశాబ్దాలుగా పార్టీకి వెన్నెముకగా నిలిచిన వారికి మాత్రం క్యాబినెట్ లో చోటు దక్కలేదు. దీనిపై ఏపీలో గట్టి చర్చనే నడుస్తుంది. అయితే చంద్రబాబు ఫ్యూచర్ స్టెప్ లో భాగమే ఈ మంత్రి పదవుల పంపకం అని అంటున్నారు. పార్టీకి గట్టి భవిష్యత్ కోసం ఈ అవకాశాన్ని చంద్రబాబు వినియోగించుకున్నారని చెబుతున్నారు.

చింతకాయల అయ్యన్నపాత్రుడు, కళావెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, అశోక్ గజపతిరాజు, యనమల రామక్రిష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, బండారు సత్యనారాయణ మూర్తి, ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావు ఇవన్నీ టీడీపీలో పెద్ద తలకాయలు. కానీ మంత్రివర్గ విస్తరణలో వీరెవ్వరికీ చోటు లభించలేదు. పార్ట అనుమతి లేకుండా కొన్ని పొరపాట్లు చేసిన గంటా మినహా మిగతా వారంతా టీడీపీనే శ్వాసగా బతికిన వారు అనడంలో అతిశయోక్తి లేదు.

అయితే ఏపీలో కొలువుదీరిన 24 మంది మంత్రులలో 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్లలో 17 మంది కొత్తవాళ్లు కాగా ఎనిమిది మంది పూర్తిగా కొత్తవాళ్లు. ఇప్పటి వరకు వాళ్లకు అసెంబ్లీ మొహం కూడా తెలియదు. ముఖ్యంగా విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి, కడప జిల్లాలలో జూనియర్లకే మంత్రి పదవులు దక్కాయి. ఆయా జిల్లాలలో సీనియర్ల మధ్య ఉన్న విభేధాలు, ఆదిపత్య పోరును కట్టడి చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

విశాఖ జిల్లాలో చింతకాయల, గంటా,బండారు సత్యనారాయణలు సీనియర్లు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో గంటా కొన్నాళ్లు పార్టీకి దూరంగా మెలిగాడు. పార్టీకి చెప్పకుండా పదవికి రాజీనామా చేశాడు. చింతకాయల ప్రతిపక్షంలో పోరాటం చేసి జైలుకు కూడా వెళ్లివచ్చాడు. కానీ అక్కడ గంటా, చింతకాయల కట్టడి కోసం పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను క్యాబినెట్ లోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.

విజయనగరం జిల్లాలో అశోకగజపతిరాజు, కళా వెంకట్రావు కుటుంబాలు సీనియర్లు. కళా వెంకట్రావు ఏకంగా చీపురుపల్లిలో వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణను మట్టి కరిపించారు. అశోక్‌గజపతి రాజు కుమార్తె పూసపాటి అదితి విజయలక్ష్మి విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామిని ఏకంగా 60 వేల మెజారిటీతో ఓడించారు. అయితే గజపతినగరంలో బొత్స సోదరుడు అప్పల నరసయ్యను ఓడించిన కొండపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇచ్చి చంద్రబాబు తన మార్క్ చూయించారు. ఇక్కడ కళా, అశోక గజపతి కుటుంబాలను బ్యాలెన్స్ చేయడానికి చంద్రబాబు యువసూత్రం పాటించినట్లు చెబుతున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో యనమల, చినరాజప్ప, బుచ్చయ్య, జ్యోతుల నెహ్రూలు పార్టీకి పట్టుగొమ్మలు. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని వస్తున్నారు. కానీ వీరందరిని కాదని మూడు నెలల క్రితం పార్టీలోకి వచ్చిన రామచంద్రాపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ కు మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు. గోదావరి జిల్లాలలో బలంగా ఉన్న శెట్టిబలిజ వర్గాన్ని పార్టీ వైపు తిప్పుకోవడంతో పాటు సీనియర్లు ఎవరికీ ఇవ్వకపోవడం ద్వారా అందరినీ కట్టడిచేయడానికి ఈ మంత్రం వేసినట్లు చెబుతున్నారు.

జగన్ సొంత జిల్లా కడపలో వరదరాజులురెడ్డి, ఆదినారాయణరెడ్డి, కడపలో భార్యను గెలిపించుకున్న రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి క్యాబినెట్ లో బెర్తులు ఆశించారు. అయితే రాయచోటిలో గడికోట శ్రీకాంత్ రెడ్డిని ఓడించిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి చంద్రబాబు అవకాశం కల్పించి సీనియర్లను సైలెంట్ చేశారని అంటున్నారు.

కేంద్రంలో ఎన్డీఎ ప్రభుత్వం ఉండడం, కూటమికి 164 స్థానాలు ఉన్న నేపథ్యంలో భవిష్యత్ లో రాజ్యసభ, ఎమ్మెల్సీ, ఇతర నామినేటెడ్ పోస్టులను సీనియర్లకు ఇచ్చి సమన్వయం చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తుంది. గవర్నర్ అవకాశాలు వస్తే ఆశోక గజపతిరాజు, యనమల రామక్రిష్ణుడు తదితర సీనియర్లను పంపాలని భావిస్తున్నారట. మొత్తానికి బాబు క్యాబినెట్ కూర్పు అందరిలోనూ ఆసక్తి రేపింది అన్నది వాస్తవం.