Begin typing your search above and press return to search.

అచ్యుతాపురం సెజ్ లో ఘోర ప్రమాదం... సీఎం దిగ్భ్రాంతి!

అవును... అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలి ఘోర ప్రమాదం జరిగింది.

By:  Tupaki Desk   |   21 Aug 2024 2:30 PM GMT
అచ్యుతాపురం సెజ్  లో ఘోర ప్రమాదం... సీఎం దిగ్భ్రాంతి!
X

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్ లో బుధవారం రియాక్టర్ పేలి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ ఏడుగురు మృతిచెందారని.. 50 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అవును... అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలి ఘోర ప్రమాదం జరిగింది. ఈ సెజ్ లోని ఎసెస్నియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వందల సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సరిగ్గా మధ్యాహ్నం భోజన విరామ సమయం 1:30 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించి మటలు చెలరేగాయని చెబుతున్నారు.

ఈ సమయంలో దట్టమైన పొగ అలుముకోవడంతో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి అని అంటున్నారు. భారీ శబ్ధంతో సమీప గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి. దీంతో ఒక్కసారిగా అక్కడున్నవారంతా ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల నుంచి అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలను అదుపుచేశాయి. గాయపడిన వారిని చికిత్స కోసం వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు.

వీరిలో సుమారు 60 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్న వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 300 మంది కార్మికులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ పేలుడు ధాటికి మొదటి అంతస్తు శ్లాబు కూలిపోయీందని అంటున్నారు.

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కలెక్టర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోపక్క ఘటనాస్థలిలో కలెక్టర్, ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలుస్తోంది.