బాబు సొంత జిల్లా మీద జగన్ ఫుల్ ఫోకస్
ఈసారి చిత్తూరు జిల్లాలో మొత్తానికి మొత్తం సీట్లు గెలుచుకోవాలని వైసీపీ పంతం మీద ఉంది.
By: Tupaki Desk | 9 Aug 2023 12:30 AM GMTఈసారి చిత్తూరు జిల్లాలో మొత్తానికి మొత్తం సీట్లు గెలుచుకోవాలని వైసీపీ పంతం మీద ఉంది. 2019 ఎన్నికలలో మొత్తం 14 అసెంబ్లీ సీట్లలో 13 ఎమ్మెల్యే రెండు ఎంపీ సీట్లను వైసీపీ గెలుచుకుని టీడీపీకి గట్టి షాక్ ఇచ్చింది. చంద్రబాబుకు నాడు కుప్పంలోనే మెజారిటీ బాగా తగ్గింది. ఇపుడు చూస్తే కుప్పంలోనే బాబుని ఓడిస్తామని వైసీపీ చెబుతోంది. అదే టైం లో ఈసారి 14 సీట్లూ తమవే అంటోంది.
అయితే వైసీపీ జరిపించుకున్న సొంత సర్వేలను చూసినా ఎనిమిది సీట్లు కచ్చితంగా వస్తాయని మిగిలిన ఆరింటిలో టఫ్ ఫైట్ నడుస్తుంది అని చెబుతున్నాయి. దాంతో వైసీపీ వీక్ గా ఉన్న ఎమ్మెల్యేలను పక్కన పెట్టేసి కొత్త ముఖాలను దింపడం ద్వారా మరో మారు గెలవాలని చూస్తోంది. ఈ విషయంలో సోషల్ ఇంజనీరింగ్ కి సైతం పదును పెడుతోంది.
చిత్తూరు జిల్లాలో ఈసారి వైసీపీకి ఇబ్బందిని పెట్టే ఆరు సీట్లలో మొదటిది గంగాధర నెల్లూరు సీటు. దీంట్లో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏడున్నర పదుల వయసు ఉన్న నారాయణస్వామికి ఈసారి టికెట్ కష్టమని అంటున్నారు. జగన్ సైతం ఆయన్ని స్వయంగా పిలిపించుకుని ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేశారని అంటున్నారు. దాంతో ఆయన తన కుమార్తె కృపాలక్ష్మిని చాన్స్ ఇవ్వమని కోరుతున్నారని అంటున్నారు. కానీ జగన్ పూర్తిగా కొత్త వారికే టికెట్ ఇవ్వాలని చూస్తున్నారుట. అలా ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ సన్నిహిత బంధువు అయిన రాజేష్ కూడా ఈ టికెట్ రేసులో ఉన్నారని టాక్.
అలాగే చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అరని శ్రీనివాసులు ఈసారి టికెట్ రావడం కష్టమని అంటున్నారు. ఆయనకు బదులుగా ఆర్టీసీ ఉపాధ్యక్షుడు ఎం విజయానందరెడ్డిని పోటీలో నిలుపుతారు అని అంటున్నారు. ఇదే సీటు విషయంలో దివంగత నేత డీకే ఆదికేశవులు కుమారుడు శ్రీనివాసులుని కూడా బరిలోకి దింపే చాన్స్ ఉంది అని అంటున్నారు.
అదే విధంగా పలమనేరు సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్ గౌడకు వేరే పదవి ఇచ్చి ఈ సీటుని బలిజ సామాజికవర్గానికి ఇస్తారని అంటున్నారు.ఈ సీటుకు యడమరి జెడ్పీటీసీ, జెడ్పీ వైఎస్ చైర్మన్ అయిన భూమిరెడ్డి ధనంజయ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయన అయితేనే గెలుపు అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అలాగే పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని తప్పించి మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనధరెడ్డికి టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఇక్కడ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిశోర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఆయన ఇటీవల జోరు చేస్తున్నారు. అందుకే ఈ మార్పు అంటున్నారు.
ఇక పూతపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబుకి నో టికెట్ అంటున్నారు. ఆయన సీట్లో కొత్త వారే కచ్చితంగా పోటీ చేస్తారు అని అంటున్నారు. కాణిపాకం ఈవోగా పనిచేసిన కేశవులు, తవణంపల్లి మాజీ ఎంపీవీ పుణ్యసముద్రం రవికుమార్ పేర్లు వైసీపీ హైకమాండ్ పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు.
అదే విధంగా నగరిలో ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఆమె మంత్రిగా ఉన్నారు. అయితే ఆమె పట్ల మొత్తం నాలుగు మండలాలో తీవ్ర వ్యతిరేకత ఉంది. దాంతో ఆమె భర్త సెల్వమణికి బరిలోకి దింపుతారు అన్న ప్రచారం ఉంది. ఆయన మొదలియార్ సామాజికవర్గం, వారి సంఖ్య నియోజకవర్గంలో ఎక్కువ కాబట్టి ఆ సోషల్ ఇంజనీరింగ్ తో సీటు గెలుచుకోవచ్చు అని వైసీపీ చూస్తోందిట.
ఇక సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద కూడా సొంత పార్టీలోనే అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది అంటున్నారు.ఈ సీటు కోసం తిరుపతి వైసీపీ యువజన విభాగం ప్రెసిడెంట్ అజయ్ కుమార్ పేరు కూడా పరిశీలనలో ఉందిట. మొత్తానికి చూస్తే అనేక రకాలైన మార్పులు చేర్పులు చేయడం ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరోసారి ఫ్యాన్ గట్టిగా తిరిగేలా బాబు ప్లాన్స్ వేస్తున్నారు అని అంటున్నారు.