Begin typing your search above and press return to search.

జగన్ ఇక తిరగనక్కరలేదా...కొత్త హామీల మాటేంటి...?

ఏపీలో విపక్షాలు గత రెండేళ్ళుగా చూస్తే నేడో రేపో ఎన్నికలు తరుముకు వస్తున్నాయన్నంతగా జోరు చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   14 Aug 2023 2:30 AM GMT
జగన్ ఇక తిరగనక్కరలేదా...కొత్త హామీల మాటేంటి...?
X

ఏపీలో విపక్షాలు గత రెండేళ్ళుగా చూస్తే నేడో రేపో ఎన్నికలు తరుముకు వస్తున్నాయన్నంతగా జోరు చేస్తున్నాయి. ఇక జగన్ తీరు చూస్తే కేవలం ప్రభుత్వ పధకాలకు బటన్ నొక్కే కార్యక్రమాలలోనే పాల్గొంటున్నారు. దానికి గానూ వ్యూహాత్మకంగా జిల్లాలను ఎంచుకుంటున్నారు. అలా శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ప్రతీ చోటా నెలకు ఒకటి రెండు సార్లు సీఎం జగన్ ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

అలా ఆయన తన ప్రభుత్వం గురించి వివరిస్తూనే రాజకీయ ప్రత్యర్ధుల మీద విమర్శలు గట్టిగా గుప్పిస్తున్నారు. అయితే విపక్షాలు కంటిన్యూస్ గ జనాల్లో ఉన్న వేళ జగన్ పెట్టే ఒకటి రెండు మీటింగ్స్ సరిపోతాయా పొలిటికల్ గా వైసీపీకి ఈ డోస్ స్ట్రాంగ్ చేస్తుందా అన్న చర్చ ఉంది.

అయితే వైసీపీలో చూస్తే జగన్ ఒక్కరే స్టార్ కాంపెనియర్. గత 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి జగన్ అధికారంలో ఉన్నారు. విపక్షాల మాదిరిగా జనంలోకి పాదయాత్రలనో మరోటి అనో వెళ్లలేరు. పైగా పాలన కూడా చూసుకోవాలి. ఇక గత ఎన్నికల్లో అయితే జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల, తల్లి వైఎస్ విజయమ్మ బాగా కవర్ చేసారు. దానికి తోడు ఏడాదిన్నర పాటు జగన్ చేసిన పాదయాత్ర కూడా బాగా కలసివచ్చింది.

ఈసారి అలా ఉంటుందా అన్నదే ఒక సందేహం. ఎందుకంటే ప్రభుత్వం అన్నాక ఎంత బాగా పాలించినా యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. చాలా మంది ఆశలకు అవకాశాలకు మధ్య గ్యాప్ అయితే కచ్చితంగా ఉంటుంది. దాంతో ప్రభుత్వం వ్యతిరేకతను అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు వైసీపీ కూడా అతీతం కాదు.

ఈ యాంటీ ఇంకెంబెన్సీని పెంచేందుకు నిరంతరం జనంలో ఉంటూ విపక్షాలు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నాయి. గతానికి భిన్నంగా ఏపీలో ముగ్గురు కీలక నాయకులు వ్యూహాత్మకంగా ఏపీని పలు మార్లు చుట్టేస్తున్నారు. ప్రతీ రోజూ మూడు విభిన్న ప్రదేశాలలో చంద్రబాబు లోకేష్, పవన్ కళ్యాణ్ జగన్ మీద ఆయన ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

వీటిని ఎంతలా కొట్టిపారేయాలని వైసీపీ చూసినా ఎంతో కొంత జనాలకు కూడా ఎక్కుతాయని అంటున్నారు. పదే పదే అదే మాటను చెబితే నమ్మే వాళ్ళూ ఉంటారు. దానికి తోడు ప్రభుత్వం తమకు ఏమీ చేయలేదు అన్న భావన ఉన్న వర్గాలు సులువుగా ఆ వైపునకు మళ్ళుతారు. దాంతో ఓటు బ్యాంక్ కి భారీగా గండి పడుతుంది. అలాగే విపక్షాల ఓటు బ్యాంక్ పెరుగుతూ ఉంటుంది.

మరి దీని కట్టడి చేయాలంటే ఈ రోజు నుంచే జగన్ జనంలో ఉండాలన్న మాట అయితే వైసీపీలో కూడా వినిపిస్తోంది. కానీ జగన్ ఆలోచనలు చూస్తే తాను మాట్లాడనవసరం లేదు, తమ తరఫున ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మాట్లాడుతాయని భావిస్తున్నారు.

అయితే కేంద్రంలో తొమ్మిదేళ్ళుగా అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కూడా పదే పదే జనాల్లోకి వెళ్తోంది. పార్టీలో కీలక నాయకులు కూడా పెద్ద ఎత్తున తిరుగుతూ ఉంటారు. అలా ఎప్పటికపుడు విపక్షాల వైపు జనాలు మళ్ళకుండా చూసుకుంటూ ఉంటారు. తెలంగాణాలో కేసీయార్ అంతలా తిరగకపోయినా మంత్రులు కేటీయార్ హరీష్ రావు నిరంతరం ప్రజలలో ఉంటూ విపక్షాల వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడుతూ ఉంటారు.

ఏపీలో మాత్రం ఆ రకమైన మెకానిజం వైసీపీ వద్ద కనిపించడంలేదు అని అంటున్నారు. క్యాబినేట్లో పాతిక మంది మంత్రులు ఉన్నా విపక్షాల మీద మీడియా ముఖంగా అయినా రియాక్ట్ అవుతున్న వారు అర డజన్ కంటే తక్కువే అని అంటున్నారు. అలాగే 22 మంది ఎంపీలు 145 మంది దాకా ఎమ్మెల్యేలు ఉన్నా కూడా సమర్ధంగా విపక్షాల ప్రచారాని తిప్పికొట్టడంలేదన్న భావన అయితే ఉంది.

దీంతో వైసీపీకి ఈ డోస్ ఏ మాత్రం సరిపోదు అనే అంటున్నారు. అదే విధంగా ఎన్నికలు దగ్గర చేస్తూ విపక్షాలు తమ మ్యానిఫేస్టోలకు పదును పెడుతున్నాయి. అనేక హామీలను ఇస్తున్నాయి. వైసీపీ అయితే 2019లో ఇచ్చిన హామీలను నెరవేర్చామని ఈ నాలుగేళ్ళలో చెప్పనివి కూడా చేశామని అంటోంది. దాంతో కొత్తగా హామీలు అయితే ఇవ్వాల్సిన అవసరం లేదని పార్టీ భావిస్తోందా అన్న ప్రశ్నలూ ఉన్నాయి.

మరి కొత్త హామీలు ఇవ్వక వైసీపీ నుంచి స్టార్ కాంపెయినర్లు పెద్దగా ప్రచారం చేయకుండా ఉంటే వచ్చే ఎన్నికల యుద్ధాన్ని వైసీపీ ఎలా గెలుస్తుంది అన్న సందేహాలు వస్తున్నాయి. అయితే విపక్షాలను జనాలు నమ్మరని, ప్రతీ ఇంట్లో తమ పధకాలు ఉన్నాయి కాబట్టి ఓట్లు కచ్చితంగా పడతాయని వైసీపీ భావిస్తే అది అతి ధీమాగా చూడాలా లేక కచ్చితమైన వ్యూహంగా చూడాలా అన్నది కూడా ఇప్పటికైతే తెలియడంలేదనే అంటున్నారు.