జంపింగ్ జపాంగ్ నేతకు షాకిచ్చిన జగన్!
By: Tupaki Desk | 4 March 2024 4:07 AM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు సాధించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉవ్విళ్లూరుతున్నారు. పలు సర్వేలు సైతం వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పడంతో ఆయన ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను ఇప్పటివరకు 9 విడతల్లో జగన్ విడుదల చేశారు.
ఈ క్రమంలో ప్రజాబలం లేని, తిరిగి గెలవరని సర్వేల్లో తేలిన అభ్యర్థులకు జగన్ సీట్లు నిరాకరిసున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాయలసీమలో చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులకు వచ్చే ఎన్నికల్లో జగన్ సీటు కేటాయించలేదు. చిత్తూరు అసెంబ్లీ స్థానాన్ని ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ఉన్న విజయానందరెడ్డికి ఇచ్చారు.
దీంతో సీటు దక్కకపోవడంతో ఆరణి శ్రీనివాసులు.. పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఆయనను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆరణి శ్రీనివాసులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతోపాటు పవన్ కళ్యాణ్ ను కలిసినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది.
కాగా ఆరణి శ్రీనివాసులు 2019లో వైసీపీ తరఫున చిత్తూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున తొలిసారి చిత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో మరోసారి పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకి, గతంలో వైసీపీకి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2009లో ఓడిపోయాక టీడీపీలో చేరిన ఆరణి ఆ పార్టీకి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
ఇలా ఇప్పటివరకు ఆరణి శ్రీనివాసులు ప్రజారాజ్యం, టీడీపీ, వైసీపీ పార్టీలు మారారు. ఇప్పుడు నాలుగో పార్టీ జనసేనలో చేరడానికి సిద్ధమవుతున్నారు. దీంతో వైసీపీ అధినేత జగన్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.