కాంగ్రెస్ టికెట్లు కావాలా.. వచ్చేయండి నేతల ఫోన్లు ..!
ఏపీ కాంగ్రెస్ నేతల నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. 'టికెట్ కావాలా.. ఇస్తాం.. రండి' అని నాయకులు చెబుతు న్నారు
By: Tupaki Desk | 29 Jan 2024 3:30 PM GMTఏపీ కాంగ్రెస్ నేతల నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. 'టికెట్ కావాలా.. ఇస్తాం.. రండి' అని నాయకులు చెబుతు న్నారు. పాత కాపులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినా.. నాయకులు పెద్దగా స్పందించడం లేదు. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల జిల్లాల యాత్రలు చేస్తున్నా.. ఆమెను కలిసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వాస్తవానికి షర్మిలకు పగ్గాలు అప్పగించడం వెనుక.. ఇది కూడా ఒక వ్యూహమని పార్టీ నాయకులు గతంలోనే చెప్పారు.
కానీ, షర్మిలవిశాఖ సహా.. ఇతర జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. కీలక నాయకులు కానీ, మండ లస్థాయి నాయకులు కానీ.. ఎవరూ ముందుకు వచ్చి కండువాలు కప్పుకోవడం లేదు. ఇదిలావుంటే.. మరో వైపు వచ్చే ఎన్నికలకు సంబంధించి టికెట్ ఇచ్చేందుకు దరఖాస్తుల ప్రక్రియను పార్టీ ప్రారంభించింది. గత శుక్రవారమే దీనికి సంబంధించిన క్రతువును ప్రారంభించినా.. ఇప్పటి వరకు 10 దరఖాస్తులు కూడా.. రాలేదు. కనీసం తొలి రెండు రోజుల్లోనే 50 వరకు దరఖాస్తులు అందుతాయని అంచనా వేసుకున్నారు.
కానీ, ఇప్పటి వరకు రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అవి కూడా.. విజయవాడ సెంట్రల్ నుంచి పాత నేత ఒకరు, గుంటూరు నుంచి ఒకటి వచ్చినట్టు తెలిసింది. వీరు కూడా ద్వితీయ శ్రేణి నాయకులు కావడం గమనార్హం. కానీ, వాస్తవ ఉద్దేశం.. ఇతర పార్టీల్లో టికెట్లు దక్కని వారు తమ చెంతకు వస్తారని.. వారికి టికెట్లు ఇవ్వాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, ఈ వ్యూహం సక్సెస్ కాలేదు. దీంతో ఇప్పుడు స్వయంగా కొప్పుల రాజు, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు వంటివారు.. రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా విభజించి.. కీలక నేతలకు ఫోన్లు చేస్తున్నారట.
''వచ్చేయండి.. పార్టీ పుంజుకుంటోంది. టిక్కెట్లు ఇస్తాం. మీరైనా మీ వారసులైనా.. ఎంత మంది ఉన్నా.. ఓకే మేడం కాల్ చేయమన్నారు'' అంటూ వారు చెబుతున్నారు. కానీ, అటు వైపు నుంచి రెస్పాన్స్ లేదు. చూద్దాం.. చేద్దాం.. ఇంకా అప్పుడే ఎందుకు? వంటి ఆన్సర్లే వస్తున్నాయట. దీంతో నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. యూత్ కాంగ్రెస్‌లో ఒకరిద్దరికి టికెట్ తామే పిలిచి ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. వారు ఓకే అన్నా.. ఖర్చుల విషయంపై మాత్రం పార్టీకే వదిలేశారు. మొత్తానికి ఇదీ.. సంగతి!