Begin typing your search above and press return to search.

నాడు చేసిన త‌ప్పే నేడు కూడా.. ఏపీ కాంగ్రెస్ ఏం నేర్వాలి?!

ఏపీ వంటి రాష్ట్రంలో ఒక‌ప్పుడు కాంగ్రెస్ అంటే.. ఆరాధ్య పార్టీ. ఇంటికొక ఓటు ఖాయం అని చెప్పుకొన్న రోజులు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   24 Jun 2024 1:30 PM GMT
నాడు చేసిన త‌ప్పే నేడు కూడా.. ఏపీ కాంగ్రెస్ ఏం నేర్వాలి?!
X

ఏపీ వంటి రాష్ట్రంలో ఒక‌ప్పుడు కాంగ్రెస్ అంటే.. ఆరాధ్య పార్టీ. ఇంటికొక ఓటు ఖాయం అని చెప్పుకొన్న రోజులు ఉన్నాయి. ఇంట్లో ముగ్గురు ఉన్నా.. న‌లుగురు ఉన్నా.. అంత మందీ ఓటేసినా..వేయ‌క‌పోయినా.. ఒక ఓటు ఖాయం.. అని నాయ‌కులు నిఖార్సుగా న‌మ్మి పార్టీని న‌డిపించిన రోజుల నుంచి విభ‌జ‌న త‌ర్వాత .. పార్టీ కునారిల్లిపోయింది. ఎక్క‌డికక్క‌డ నాయ‌కులు వీగిపోయారు. ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. కార‌ణం.. నాడు రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో నెత్తీ నోరూ మొత్తుకున్నా.. ఏపీ నేత‌ల మాట‌ల‌ను కాంగ్రెస్ ప‌ట్టించుకోలేదు.

ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ వంటి వారు స‌మైక్య రాష్ట్రం కోసం ఉద్య‌మిస్తే.. కావూరి సాంబ‌శివ‌రావు, రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ వంటి దిగ్గ‌జ నాయ‌కులు.. విభ‌జ‌న చేస్తే చేశారు. స‌క్ర‌మంగా చేయండి.. ఏపీ హ‌క్కులు కాపాడేలా చేయండి. నిఖార్సుగ చేయండి. త‌లుపులు మూసి చేయ‌కండి అని నెత్తీనోరూ బాదుకున్నారు. కానీ, వీరి మాట‌లు ఆనాడు కాంగ్రెస్ వినిపించుకోలేదు. ఫ‌లితంగా 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అవ‌సాన ద‌శ‌లోనే కునారిల్లుతున్న దుస్థితి క‌ళ్ల ముందు క‌నిపిస్తోంది.

క‌ట్ చేస్తే.. ఇప్పుడైనా పార్టీ అధిష్టానంలో మార్పు క‌నిపించిందా? అంటే లేదు. తాము చెప్పిన‌ట్టు వినాల్సిందే.. తాము చెప్పింది చేయాల్సిందే.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. తాజాగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి బిడ్డ‌.. అనే ఒకే ఒక్క అర్హ‌త‌తో వైఎస్ ష‌ర్మిల‌ను తీసుకువ‌చ్చిన పార్టీ ప‌గ్గాలు ఇచ్చారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆమె ప్ర‌చారం చేశారు. కొంత దూకుడుగా నే వెళ్లారు. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. కానీ, ఇక్క‌డ పార్టీకి వ‌చ్చిన మేలేంటి? ఒరిగిన ఓట్లేంటి? అనేదే బిగ్ క్వ‌శ్చ‌న్‌.

ఎందుకంటే.. కాంగ్రెస్‌కు కావాల్సింది.. జ‌గ‌న్‌ను తిట్ట‌డం కాదు. కాంగ్రెస్‌కు కావాల్సింది.. కొన్ని పార్టీల‌తో అంత‌ర్గ‌త లాలూచీలు కూడా.. కావు. ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు.. ఏక‌ప‌క్ష వ్య‌వ‌హారాలు అస‌లే కాదు. పైగా.. ప‌డిపోయిన చోట నుంచి నిల‌బ‌డాల‌ని అనుకున్న‌ప్పుడు.. నాయ‌కుల ఊతం అత్యంత ముఖ్యం ఈ విష‌యంలోనే ష‌ర్మిల విఫ‌ల‌మ‌య్యారు. దీనినే కొంద‌రు నాయ‌కులు ప్ర‌శ్నించారు. ష‌ర్మిల వ‌ల్లే పార్టీకి అన్యాయం జ‌రిగింద‌న్నారు త‌ప్ప‌.. `త‌మ‌కు` అన్యాయం జ‌రిగింద‌ని చెప్ప‌లేదు.

కానీ, ప్ర‌శ్నించిన వారికే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంజాయిషీ నోటీసులు ఇచ్చింది. వాస్త‌వం ఏంటో తెలుసుకోకుండానే.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీల‌న చేయ‌కుండా.. ఇక్క‌డ కూడా.. గ‌తంలో మాదిరిగానే వ్య‌వ‌హ‌రించిన తీరు ప‌క్కాగా క‌ళ్ల‌కు క‌డుతోంది. పోయేదేమీలేదు.. అని అనుకుని నేత‌లు.. బ‌య‌ట‌కువ‌స్తే.. కాంగ్రెస్ జెండో మోసే దిక్కులేదు. చిత్రం ఏంటంటే.. ఏపీలో పార్టీలు బోలెడు. చేరుతామంటే.. చేర్చుకునే అధినేత‌లు కూడా బోలెడు మంది. న‌ష్టం.. క‌ష్టం ఏమైనా ఉంటే అది కాంగ్రెస్‌కే!!